Palakolluలో Heavy rains.. నీట మునిగిన Jagananna ఇళ్ళ స్థలాలు

ABN , First Publish Date - 2022-06-29T21:33:55+05:30 IST

పాలకొల్లులో భారీ వర్షాలకు జగనన్న ఇళ్ళ స్థలాలు నీట మునిగాయి. బురదమయంగా మారాయి.

Palakolluలో Heavy rains.. నీట మునిగిన Jagananna ఇళ్ళ స్థలాలు

West Godavari జిల్లా: పాలకొల్లు (Palakollu)లో భారీ వర్షాల (Heavy Rains)కు జగనన్న (Jagananna) ఇళ్ళ స్థలాలు నీట మునిగాయి. బురదమయంగా మారాయి. వాటిని పరిశీలించేందుకు ట్రాక్టర్‌పై వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు (Ramanaidu).. మోకాలి లోతు బురదలో నడిచి స్థలాలు పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ 20 ఏళ్లు గడిచినా ఇక్కడ ఇళ్లు కట్టుకోలేమని అన్నారు. భూములను తక్కువ ధరకు కొని.. ఎక్కువ రేటుకి వైసీపీ (YCP) నేతలు ప్రభుత్వానికి అమ్మారన్నారు. ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని ఆర్బాటంగా ప్రచారం చేసి.. పనికి రాని స్థలాలు పేదలకు అంటగట్టారని రామానాయుడు విమర్శించారు.


కాగా పశ్చిమగోదావరి జిల్లాలో పలుచోట్ల సోమవారం రాత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు కురిసిన వర్షానికి పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కాళ్ళ మండలంలో భారీ వర్షానికి రహదారులు చెరువులు, కాలువలు తలపించాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్ధ సక్రమంగా లేకపోవడం వల్ల స్ధానికులు ఇబ్బందులకు గురయ్యారు. ప్రధానంగా కాళ్ళలోని పల్లపు వీధి వర్షంనీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడటంతో పంచాయితీ సిబ్బంది నీరు మళ్ళీంచే ఏర్పాట్లు చేశారు. దొడ్డనపూడి, కాళ్ళకూరు, జక్కరంతో పాటు బొండాడపేట తదితర గ్రామాల్లో సర్పంచ్‌లు, అధికారులు వర్షపు నీటిని మళ్లించే చర్యలు చేపట్టారు. పాలకొల్లు హౌసింగ్‌ బోర్డు కాలనీ, ఎల్‌ఆర్‌పేట, వెలమగూడెం, కొత్తపేట కొత్తకాలనీ, క్రిస్టియన్‌పేట, రాజీవ్‌నగర్‌కాలనీ, చిత్రాయి చెరువు గట్లు, లక్ష్మీనగర్‌ తదితర ప్రాంతాల్లో వర్షానికి డ్రైయినేజీలు పొంగి పొర్లాయి. పల్లపు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. యలమంచిలి మండలంలో రహదారులు జలమయం అయ్యాయి. చించినాడ – ఏనుగువానిలంక, మేడ పాడు – నేరేడుమిల్లి, మేడపాడు – పెనుమర్రు, సీతమ్మచెరువు – కాంబొట్ల పాలెం రహదారి గోతుల్లో నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు వాహనదా రులు అవస్థలు పడ్డారు. వీరవాసరం మండలంలో భారీ వర్షాలకు నారుమడులు నీట మునిగాయి. నారుమడులను కాపాడేందుకు రైతులు నీటిని తోడడం, రాత్రి పూట వర్షంతో మునగడం మూడు రోజులుగా సాగుతోంది. మరోపక్క భారీ వర్షంతో నారుమడులు వేయడానికి రైతులు సిద్ధపడుతున్నారు. బాలేపల్లి, వీరవాసరం, దూసనపూడి ఆయకట్టులో నారుమడులు నీటమునిగాయి. ఉండి, పెనుగొండ మండలాల్లో రహదారులు, పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి. డ్రెయిన్లలో నీరు రోడ్డుపై చేరింది. మొగల్తూరు మండలంలో పలు గ్రామాల్లో పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహన దారులు అనేక ఇబ్బందులు పడ్డారు. మొగల్తూరు – భీమవరం రహదారి పెద్ద గొల్లగూడెం వద్ద నీట మునిగింది. కొత్తకాయలతిప్పలో నివాసాల వద్ద నీరు నిలిచిపోవడంతో వార్డు సభ్యుడు లక్కు రాంబాబు సొంత ఖర్చుతో కూలీలను ఏర్పాటు చేసి బోదెలు తవ్వించారు. మసీదు సెంటర్‌, గాంధీబొమ్మల సెంటర్‌ సత్తెమ్మ గుడి వీధి, ఉన్నత పాఠశాల, వడయార్‌పేట, భవానీ కాలనీల్లో నీరు నిలిచిపోవడంతో సర్పంచ్‌ పడవల మేరీ సత్యనారాయణ, ఉప సర్పంచ్‌ బోణం నర్సింహరావు జేసీబీతో కచ్చా డ్రెయిన్లు తవ్వించారు. ఇంజేటివారిపాలెం, గొల్లగూడెం గ్రామాల్లో నారు నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2022-06-29T21:33:55+05:30 IST