వలంటీర్‌పై చేయి చేసుకున్న శంకరనారాయణ

ABN , First Publish Date - 2022-05-18T09:29:37+05:30 IST

మాజీ మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ ఓ వలంటీర్‌పై చేయి చేసుకున్నారు.

వలంటీర్‌పై చేయి చేసుకున్న శంకరనారాయణ

పదవి పోయిందన్న నిస్పృహ.. ఇళ్లకు స్టిక్లర్లు అంటించలేదంటూ మాజీ మంత్రి ఆగ్రహం

ఎదురుతిరిగిన వలంటీర్‌, అతడి స్నేహితులు.. నచ్చజెప్పి పంపిన పోలీసులు


సోమందేపల్లి, మే 17: మాజీ మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ ఓ వలంటీర్‌పై చేయి చేసుకున్నారు. శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం తుంగోడు పంచాయతీ పరిధిలోని కావేటి నాగేపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో మంగళవారం జరిగిన ‘గడప గడపకు మన ప్రభుత్వం‘ కార్యక్రమానికి శంకరనారాయణ హాజరయ్యారు. ప్రభుత్వం అందజేసిన స్టిక్కర్లను ఇళ్లవద్ద పూర్తిస్థాయిలో అతికించకపోవడంతో సీరియస్‌ అయ్యారు. కోపం పట్టలేక, అక్కడే ఉన్న వలంటీర్‌ రామచంద్రారెడ్డిపై చేయి చేసుకున్నారు. దీంతో వలంటీర్‌ ఎదురు తిరిగారు. తానేం చేశానని, ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించారు. అక్కడే ఉన్న అధికార పార్టీ నాయకులు, పోలీసులు అతడిని పక్కకు తీసుకెళ్లేందుకు యత్నించారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఇంతలో అక్కడే ఉన్న వలంటీర్‌ సోదరుడు, అతని స్నేహితులు, గ్రామానికి చెందిన యువకులు అక్కడ పోగయ్యారు. చేయిచేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ కలిసి నిలదీయడంతో శంకరనారాయణ బిత్తరపోయారు. ఇదే సమయంలో పలు సమస్యలపై గ్రామంలో కొంతమంది ఆయనతో వాగ్వాదానికి సిద్ధమయ్యారు. అప్రమత్తమైన పోలీసులు జనాన్ని అక్కడి నుంచి పంపించేశారు. వలంటీర్‌ను, అతడి సోదరుడు, స్నేహితులను పక్కకు తీసుకువెళ్లి నచ్చజెప్పారు. నిన్నమొన్నటిదాకా సౌమ్యుడిగా పేరుపొందిన శంకరనారాయణ.. ఏకంగా వలంటీర్‌పై చేయి చేసుకోవడం చర్చనీయాంశమైంది. మంత్రి పదవి పోయిందన్న నిస్పృహతోనే ఆయనిలా చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి.

Updated Date - 2022-05-18T09:29:37+05:30 IST