Mulugu: సీతక్కకు తప్పిన ప్రమాదం

ABN , First Publish Date - 2022-07-16T21:48:02+05:30 IST

ప్రజా ప్రతినిధి అంటే ఒంటి మీద బట్టలు నలగకుండా మందీ మార్బలంతో ప్రచార ఆర్భాటాలతో మునిగితేలుతుంటారు.

Mulugu: సీతక్కకు తప్పిన ప్రమాదం

ములుగు: ప్రజా ప్రతినిధి అంటే ఒంటి మీద బట్టలు నలగకుండా మందీ మార్బలంతో ప్రచార ఆర్భాటాలతో మునిగితేలుతుంటారు. కానీ ఎమ్మెల్యే సీతక్క (MLA Seethakka) సామాన్యుల్లో మామూలు మనిషిగా కలిసిపోతుంటారు. ఎండనక, వాననక అభాగ్యుల కోసం కదిలివెళ్తుంటారు. ఎన్ని కిలోమీటర్లైనా లెక్క చేయకుండా కాలినకడనే వెళ్తుంటారు. అది కారడివి అయినా మైదానం అయినా... ఆమె తెలిసింది బాధితులకు కాస్త ఆసరా ఇవ్వడమే. మూటలు మోసుకుంటూ తన నియోజకవర్గ ప్రజల చెంతకు ఆమె వెళ్తుంటారు. వాళ్ల ఈతిబాధలు తెలుసుకుంటారు. వాళ్లకు పట్టెడు మెతుకులు పెట్టి.. వాళ్లతోనే ఆమె కలిసి తింటారు. నియోజకవర్గ ప్రజల కోసం ఆమె అలుపెరుగకుండా కొండలు, గుట్టలు చుట్టేస్తుంటారు.


తాజాగా, వరద సహాయక చర్యల్లో పాల్గొన్న... సీతక్క ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వరద సహాయక చర్యలకు వెళ్తుండగా గోదావరి మధ్యలో ఆమె ప్రయాణిస్తున్న బోటు ఆగిపోయింది.  అయితే, ఈ ప్రమాదం నుంచి ఆమె తప్పించుకున్నారు. ఈదురు గాలుల తాకిడికి బోటు ఒడ్డుకు కొట్టుకు రావడంతో ఆమె సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగలిగారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లిలో ఈ ఘటన జరిగింది. ఈ నెల 12న వరద బాధిత ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. ములుగు జిల్లా పొదుమూరు సమీపంలో గోదావరి (Godavari) వరద ఉద్ధృతి వల్ల కోతకు గురైన భూములను పరిశీలించారు. అలాగే పునరావాస కేంద్రానికి వెళ్లి వరద బాధితులను పరామర్శించారు. వారికి పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు.  


కరోనా సమయంలో ప్రజా ప్రతినిధులందరూ ఇళ్లకే పరిమితమైతే సీతక్క మాత్రం ఇంట్లో కూర్చోలేదు. పనులు లేక, పూట తిండికి నోచుకోని గిరిజనుల దైన్యం ఆమెను పల్లె బాట పట్టించింది. ట్రాక్టర్ల మీద, బైకుల మీదా ప్రయాణించారు. వాహనాలు వెళ్లలేని మార్గాల్లో మైళ్ళ కొద్దీ నడిచారు. కొండలు ఎక్కారు. వాగులు దాటారు. స్వయంగా సరుకుల మూటలు మోశారు. ఆపన్నుల ఆకలి తీర్చారు. 48 రోజుల్లో 470కి పైగా పల్లెలలు, గూడేలు, వాడలను సందర్శించారు.

Updated Date - 2022-07-16T21:48:02+05:30 IST