ఆస్తి తగాదాలో MLA తనయుడి జోక్యం.. కుటుంబం ఆత్మాహుతి!

ABN , First Publish Date - 2022-01-04T09:51:09+05:30 IST

ఆస్తి వివాదం ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. తన సొంత డబ్బుతో పాటు భారీగా అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి మోసానికి గురై నష్టపోయిన ఆ వ్యక్తి ఆ అప్పులు తీర్చేందుకు తన తల్లి పేరిట ఉన్న ఆస్తిని అమ్మేందుకు యత్నించగా వివాదం నెలకొంది.

ఆస్తి తగాదాలో MLA తనయుడి జోక్యం.. కుటుంబం ఆత్మాహుతి!

  • భార్య, ఇద్దరు పిల్లలపై పెట్రోల్‌ పోసి నిప్పంటించుకున్న భర్త 
  • భర్త, భార్య, కూతురు అక్కడికక్కడే మృతి 
  • చావుబతుకుల మధ్య మరో కుమార్తె
  • బిజినెస్‌ యాప్‌ పెట్టుబడులతో నష్టాలు
  • ఆస్తి పంపకాల్లో ఎమ్మెల్యే వనమా తనయుడు రాఘవేంద్ర సెటిల్‌మెంట్‌
  • వాటాల్లో తనకు అన్యాయం జరిగిందనే.. 
  • సూసైడ్‌ నోట్‌లో స్పష్టంగా వివరాలు
  • భద్రాద్రి జిల్లా పాత పాల్వంచలో ఘటన 
  • ఎమ్మెల్యే తనయుడిపై కేసు నమోదు


పాల్వంచ రూరల్‌, జనవరి 3:  ఆస్తి వివాదం ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. తన సొంత డబ్బుతో పాటు భారీగా అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి మోసానికి గురై నష్టపోయిన ఆ వ్యక్తి ఆ అప్పులు తీర్చేందుకు తన తల్లి పేరిట ఉన్న ఆస్తిని అమ్మేందుకు యత్నించగా వివాదం నెలకొంది. ఈ క్రమంలో ఆస్తి పంపకాల్లో ఎమ్మెల్యే తనయుడు చేసిన సెటిల్‌మెంట్‌తో తనకు అన్యాయం జరిగిందని మనస్థాపానికి గురై భార్య, ఇద్దరు కూతుళ్లతో సహా తనపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకోగా.. అతనితో పాటు భార్య, ఓ కూతురు మృతి చెందారు. మరో కుమార్తె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ విషాద ఘటన ఆదివారం అర్ధరాత్రి భద్రాద్రి  జిల్లా పాతపాల్వంచలో జరిగింది. 


పాతపాల్వంచకు చెందిన మండిగ నాగ రామకృష్ణ (38), శ్రీలక్ష్మి (34) దంపతులకు పదమూడేళ్ల కవలలు సాహిత్య, సాహితి ఉన్నారు. రామకృష్ణ పాల్వంచ సమీపంలోని నవభారత్‌లో మీసేవా కేంద్రాన్ని నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఏడాది క్రితం ‘డాడీ రోడ్‌’ అనే ఓ ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా తన మిత్రులతో కలిసి వ్యాపారాన్ని ప్రారంభించాడు. 


ఆ వ్యాపారంలో రూ.40 లక్షల వరకు నష్టపోయినట్లు సమాచారం.  అప్పటికే ఇల్లు, కారుపై కూడా ఫైనాన్స్‌ తీసుకొని ఉండటంతో ఎక్కడా అప్పు పుట్టలేదు. ఈ క్రమంలోనే తన తల్లి పేరుతో ఉన్న ఆస్తిని అమ్మడానికి యత్నించగా అందుకు అతడి తల్లి, అక్క నిరాకరించారు. ఈ క్రమంలో వారంతా కలిసి వివాదాన్ని పరిష్కరించాలని కోరుతూ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవేంద్రరావును ఆశ్రయించారు. ఆయన పంచాయితీ చేసి.. తల్లి ఆస్తిని మూడు భాగాలు చేయడంతో తనకు అన్యాయం జరిగిందని భావించిన రామకృష్ణ మనస్థాపంతో కుటుంబంతో కలిసి ఆదివారం అర్ధరాత్రి పాతపాల్వంచలోని తన నివాసంలో భార్య, ఇద్దరు కూతుళ్లపై పెట్రోలు పోసి తానూ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో రామకృష్ణ, దంపతులతో పాటు కూతురు సాహిత్య సజీవ దహనమై పోగా.. మరో కూతురు సాహితి మంటల బాధతో బయటకువచ్చి కేకలు వేయడంతో స్థానికులు ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉండగా.. కొత్తగూడెం న్యాయమూర్తి ఆ బాలిక నుంచి వాంగ్మూలాన్ని సేకరించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రాథమిక సమాచారాన్ని సేకరించిన పోలీసులు మృతురాలు శ్రీలక్ష్మి సోదరుడు జనార్దన్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇదే ఆస్తి వివాదంలో మనస్తాపానికి గురైన రామకృష్ణ వారం క్రితం రాజమండ్రి వెళ్లివచ్చిన అనంతరం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించగా.. స్థానికుడొకరు గమనించి ఆయన్ను కాపాడారు.  


నా చావుకు ఆ ముగ్గురే కారణం

ఆత్మహత్యకు ముందు రామకృష్ణ ఓ సూసైడ్‌ నోట్‌ రాశాడు. తన అక్క మాధవి, తల్లి సూర్యవతిల పక్షాన రాఘవేంద్రరావు మాట్లాడి తనను వేధించాడని, తన చావుకు కారణం ఆ ముగ్గురేనని ఆ నోట్‌లో పేర్కొన్నాడు. అయితే ఈ కేసులో తనపై కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదవుతోందని తెలుసుకున్న రాఘవేంద్రరావు ఇంటి నుంచి పరారయ్యారు. 


గంటకో మలుపు 

 రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటన గంటకో మలుపు తిరిగింది. గ్యాస్‌ సిలిండర్‌ పేలిందని, ఆ కాసేపటికి విద్యుదాఘాతం జరిగిందని, మరికొంత సేపటికి అప్పుల బాధతో కుటుంబమంతా బలవన్మరణానికి పాల్పడిందని భిన్న ప్రచారాలు వినిపించాయి. ఆ తర్వాత రామకృష్ణ ఆన్‌లైన్‌ కరెన్సీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టి మోసపోయాడని.. అందువల్లే ఆయన కుటుంబసభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం జరిగింది. కానీ, చివరకు సూసైడ్‌ నోట్‌ బహిర్గతం కావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 


నాకు సంబంధం లేదు: రాఘవ 

రామకృష్ణ, అతడి కుటుంబం ఆత్మహత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవేంద్రరావు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక కొంతమంది కుట్రపన్ని తనను ఈ కేసులో ఇరికించారని, అనేక సమస్యలపై తమ వద్దకు అనేకమంది వస్తుంటారని, అలా వచ్చిన రామకృష్ణ అమ్మను మంచిగా చూసుకోమని చెప్పటం తప్పా? అని ప్రశ్నించారు.

Updated Date - 2022-01-04T09:51:09+05:30 IST