గ్యాంగ్‌ రేప్‌ బాధితురాలి కుటుంబానికి ఎమ్మెల్యే కొడుకు బెదిరింపులు!

ABN , First Publish Date - 2022-06-15T09:34:43+05:30 IST

జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌రేప్‌ బాధితురాలి కుటుంబ సభ్యులకు బెదిరింపులు వస్తున్నాయి.

గ్యాంగ్‌ రేప్‌ బాధితురాలి కుటుంబానికి ఎమ్మెల్యే కొడుకు బెదిరింపులు!

  • నిందితుల కుటుంబ సభ్యుల నుంచి కూడా!.. 
  • ఆ బాలికకు నిలోఫర్‌లో అడుగడుగునా ఇబ్బందులు!
  • పరీక్షల కోసం 9 గంటల పాటు నిరీక్షణ
  • రెండో రోజూ 4 గంటల వెయిటింగ్‌
  • కార్ల యజమానులపై త్వరలో కేసులు
  • ఓ కారు వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ సతీమణిదే
  • ముగిసిన మైనర్‌ నిందితుల పోలీసు కస్టడీ


బంజారాహిల్స్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌రేప్‌ బాధితురాలి కుటుంబ సభ్యులకు బెదిరింపులు వస్తున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందు నుంచే బెదిరింపు ఫోన్‌కాల్స్‌ ప్రారంభమైనట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. గత నెల 28న జరిగిన గ్యాంగ్‌రేప్‌ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ రోజు బాధిత బాలిక తమ కుటుంబంతో పరిచయమున్న హాదీ అనే వ్యక్తితో కలిసి అమ్నేషియా పబ్‌కు వెళ్లారు. ఆమెపై గ్యాంగ్‌రేప్‌ జరిగాక.. తల్లిదండ్రులకు విషయం చెప్పలేదు. మూడో రోజు తల్లిదండ్రులు ఆమె ఒంటిపై ఉన్న గాయాలను చూసి, గట్టిగా ప్రశ్నించారు. అప్పటికీ ఆమె మౌనాన్ని వీడకపోవడంతో.. హాదీని గట్టిగా నిలదీశారు. దీంతో అమ్నేషియా పబ్‌కు వెళ్లి విచారించిన హాదీ.. గ్యాంగ్‌రేప్‌ జరిగిన విషయాన్ని గుర్తించాడు. పలుకుబడి ఉన్నవారి పిల్లలు కావడంతో అతను భయపడ్డాడు. భయంగానే బాధిత బాలిక తండ్రికి విషయం చెప్పాడు. దాంతో బాధితురాలి తండ్రి.. నిందితులతో ఉన్న ఎమ్మెల్యే కుమారుడి(మైనర్‌)కి ఫోన్‌చేసి నిలదీశారు. ఆ మైనర్‌ తీవ్రస్థాయిలో బెదిరించి, ఫోన్‌ పెట్టేశాడని తెలిసింది. ఆ తర్వాత కూడా బాధిత బాలిక తండ్రికి నిందితుల తరఫు వారి నుంచి పలుమార్లు బెదిరింపు ఫోన్‌కాల్స్‌ వచ్చినట్లు సమాచారం. ఓవైపు బాలిక వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఆందోళనలో ఉండగా.. మరోవైపు బెదిరింపు కాల్స్‌తో ఆ కుటుంబం తీవ్ర మనస్తాపానికి గురవుతున్నట్లు తెలిసింది.


నిలోఫర్‌ వైద్యుల తీరు..

సామూహిక అత్యాచారం బాధ ఒకవైపు మనసును ఆందోళనకు గురిచేస్తుండగా.. ఈ కేసును అత్యంత సున్నితంగా డీల్‌ చేయాల్సిన వైద్యులు ఆమెకు అడుగడుగునా ఇబ్బంది పెట్టారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఆమెను భరోసా కేంద్రానికి తరలించారు. నిజానికి భరోసా కేంద్రంలో గైనకాలజిస్టు, పీడియాట్రిక్‌ సర్జన్‌, ఇతర విభాగాల వైద్యులు తప్పనిసరిగా ఉండాలి. కానీ, కొంతకాలంగా వైద్యులు అందుబాటులో లేకపోవడంతో.. అక్కడి అధికారులు బాధితులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి, పరీక్షల కోసం నిలోఫర్‌ ఆస్పత్రికి పంపుతున్నారు. గ్యాంగ్‌రేప్‌ బాధిత బాలికను కూడా నిలోఫర్‌కు పంపారు. అక్కడి వైద్యులు ఆ బాలిక విషయంలో విపరీతమైన తాత్సారం చేశారని పోలీసులు చెబుతున్నారు. 


ఒంటిపై గాయాలకు చికిత్స చేయకుండా.. అత్యాచారం జరిగిందనడాన్ని నిరూపించే పరీక్షలు చేయకుండా.. ఆ బాలిక 9 గంటల పాటు నిరీక్షించేలా చేశారని పేర్కొన్నారు.  సున్నితమైన కేసుల్లో వైద్యులు అరగంటలో శాంపిల్‌ సేకరణ, గాయాలకు చికిత్స చేయాలని స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్స్‌(ఎ్‌సవోపీ) స్పష్టం చేస్తోంది. మెడికో లీగల్‌ కేసుల్లో.. బాధితులకు ఎవరు పరీక్షలు నిర్వహించాలి? కేస్‌షీట్‌పై ఎవరు సంతకం చేయాలి? తర్వాతి రోజుల్లో కోర్టులకు వాంగ్మూలం/సాక్ష్యం ఇచ్చేందుకు ఎవరు వెళ్లాలి? అనేదానిపై నిలోఫర్‌ వైద్యుల్లో ఓ స్పష్టత ఉంటుంది. అందుకు భిన్నంగా.. ఆ బాలిక నిరీక్షించేలా చేశారని, రెండో రోజు కూడా 4 గంటల పాటు నిరీక్షించాక.. పరీక్షలు నిర్వహించారని తెలిపారు.


కార్ల యజమానులపై కేసులు

గ్యాంగ్‌రేప్‌ నిందితులు ఉపయోగించిన బెంజ్‌, ఇన్నోవా కార్ల యజమానులపై కేసులు పెట్టేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. బెంజ్‌ కారు నిందితుల్లో ఒకరి బంధువుదని, ఇన్నోవా కారు వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ సతీమణి(ఓ ఎమ్మెల్యే సోదరి) పేరిట ఉన్నట్లు గురించారు. ఈ రెండు వాహనాలను మైనర్లు నడిపారని పోలీసులు ఆధారాలను సేకరించారు. దీంతో.. కార్ల యజమానులపై కేసులు పెట్టనున్నట్లు తెలిసింది. కాగా.. గ్యాంగ్‌రేప్‌ నిందితులైన ఐదుగురు మైనర్ల పోలీసు కస్టడీ మంగళవారంతో ముగిసింది. దీంతో సాయంత్రం వారిని జువెనైల్‌ హోంకు తరలించారు.

Updated Date - 2022-06-15T09:34:43+05:30 IST