అక్రమ మద్యం గుట్టురట్టు

ABN , First Publish Date - 2021-11-29T06:35:59+05:30 IST

మైలవరం నియోజకవర్గంలోని వైసీపీ నేత అక్రమ మద్యం వ్యాపార గుట్టును డివిజనల్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు బయటపెట్టారు.

అక్రమ మద్యం గుట్టురట్టు
టాస్క్‌ఫోర్స్‌, ఎస్‌ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలు.. అదుపులో కోడె శ్రీను

తెలంగాణ మద్యంతో పట్టుబడిన ఎమ్మెల్యే వసంత అనుచరుడు 

480 మద్యం సీసాలు, కారు స్వాధీనం చేసుకున్న అధికారులు

ఏడాదిన్నర కాలంగా కొనసాగుతున్న అక్రమ రవాణా


మైలవరం, నవంబరు 28 : మైలవరం నియోజకవర్గంలోని వైసీపీ నేత అక్రమ మద్యం వ్యాపార గుట్టును డివిజనల్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు బయటపెట్టారు. తెలంగాణ నుంచి ఆంధ్రాకు ఏడాదిన్నర కాలంగా మద్యం రావాణా చేస్తున్న అనంతవరం గ్రామానికి చెందిన కోడె శ్రీనివాసరావును టాస్క్‌ఫోర్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌ఈబీ జేడీ మోకా సత్తిబాబు, డివిజనల్‌ టాస్క్‌ఫోర్స్‌ సూపరింటెండెంట్‌ నారాయణస్వామి ఆదేశానుసారం శనివారం రాత్రి తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన అనంతవరం చెక్‌పోస్ట్‌ సమీపంలో డీటీఎఫ్‌, ఎస్‌ఈబీ అధికారులు రెక్కీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఎర్రుబాలెం నుంచి కొండపల్లికి ఏపీ 07 ఎన్‌ 7779 నెంబరు స్విఫ్ట్‌ కారులో అక్రమంగా మద్యం తరలిస్తున్న శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని, 480 మద్యం సీసాలు, కారును స్వాఽధీనం చేసుకున్నారు. కోడె శ్రీనివాసరావు నీటి సంఘం మాజీ అధ్యక్షుడు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు ముఖ్య అనుచరుడు. ఏడాదిన్నరగా ఇతడు తెలంగాణ సరిహద్దు గ్రామమైన గట్ల గౌరవరంలో బెల్టు షాపు నిర్వహిస్తూ, ఆంధ్రాలోని పలు ప్రాంతాలకు అక్రమ మద్యం రవాణా చేస్తున్నాడని ఆరోపణలున్నాయి. పార్టీ అండదండలతో, కొంతమంది అధికారులు, చెక్‌పోస్ట్‌ సిబ్బంది సహకారంతో ఈ అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిని ఛేదించేందుకు టాస్క్‌ఫోర్స్‌ అధికారులు అనంతవరం చెక్‌పోస్ట్‌ సిబ్బందిపై నిఘా పెట్టారు. కోడె కారును చెక్‌పోస్టు సిబ్బంది పైపైన చెక్‌ చేసి వదిలి వేయడాన్ని గమనించారు. కోడె తన అన్న కొడుకు ద్వారా అక్రమ మద్యం వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఇటీవల అతను కూడా మద్యం తరలిస్తూ, 1100 సీసాలతో పట్టుబడ్డాడు. ఈ అక్రమ రవాణాలో కోడెకు ఎవరెవరు సహకరిస్తున్నారో తెలుసుకునేందుకు అతని ఫోన్‌ స్వాధీనం చేసుకుని, కాల్‌ లిస్టులను పరిశీలిస్తున్నారు. కోడె శ్రీనును అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్టు డీటీఎఫ్‌ అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-11-29T06:35:59+05:30 IST