హోరాహోరీ!

ABN , First Publish Date - 2021-02-23T04:49:19+05:30 IST

ఈసారి మహబూబ్‌నగర్‌- రంగారెడ్డి- హైదరాబాద్‌ పట్టభద్రుల శాసనమండలి

హోరాహోరీ!

  • హైదరాబాద్‌ - రంగారెడ్డి-  మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఎన్నిక రసవత్తరం
  • ఈసారి ఎన్నికల్లో తీవ్ర పోటీ 
  • ఉమ్మడి రంగారెడ్డి జిల్లానే కీలకం 
  • అందరికీ ప్రతిష్టాత్మకంగా ఎన్నిక
  • అధికార పార్టీ అనూహ్య నిర్ణయంతో మారిన సమీకరణాలు
  • సర్వశక్తులు ఒడ్డుతున్న టీఆర్‌ఎస్‌
  • సిట్టింగ్‌ స్థానం కాపాడుకునేందుకు బీజేపీ యత్నం
  • మూడోసారి విజయం కోసం ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ పోరాటం
  • ఉనికి  కోసం కాంగ్రెస్‌ తంటాలు
  • ఈసారి బరిలో టీడీపీ  


ఈసారి మహబూబ్‌నగర్‌- రంగారెడ్డి- హైదరాబాద్‌ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎన్నిక హోరాహోరీగా సాగనుంది. ప్రధాన పార్టీలన్నీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. బలమైన అభ్యర్థులను బరిలో దింపుతుండటంతో పోటీ తీవ్రంగా ఉంది. గెలుపు కోసం పార్టీలు పోటాపోటీగా శ్రమిస్తున్నాయి. ఎన్నికలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కీలకం కానుంది. ఇక్కడ నుంచి ఓటర్లు అధికంగా ఉండటంతో పార్టీలన్నీ ఈ ప్రాంతంపై ఎక్కువగా దృష్టి సారించాయి.


(ఆంరఽధజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో మహబూబ్‌నగర్‌- రంగారెడ్డి- హైదరాబాద్‌ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎన్నిక హీటెక్కింది. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి జరిగే ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మహామహులు రంగంలో ఉండడంతో పోటీ తీవ్రంగా ఉంది.  ముఖ్యంగా  అధికార టీఆర్‌ఎస్‌పార్టీకి ఈ ఎన్నికలు మరింత ప్రతిష్టాత్మకంగా మారాయి. దుబ్బాక ఉపఎన్నికతోపాటు గ్రేటర్‌ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తిన్న టీఆర్‌ఎస్‌.. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు అభ్యర్థిని నిలబెడుతుందా? లేదా? అన్న అనుమానాలు ఇప్పటివరకూ వ్యక్తమయ్యాయి. ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ సీఎం కేసీఆర్‌ అనూహ్యంగా దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె సురభి వాణీదేవిని తెరపైకి తెచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అపరచాణక్యునిగా పేరున్న మాజీ ప్రధాని పీవీ కుటుంబం నుంచే అభ్యర్థిని ప్రకటించి చాణక్యనీతిని ప్రదర్శించారు. దీంతో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు మారిపోయాయి. టీఆర్‌ఎస్‌ ఈసారి అభ్యర్థిని ప్రకటించకుండా పరోక్షంగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్న ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌కు మద్దతిస్తారనే ప్రచారం నిన్నమొన్నటి వరకు సాగింది. దీంతో బీజేపీ సిట్టింగ్‌ అభ్యర్థి రామచంద్రరావు, నాగేశ్వర్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డి మధ్య త్రిముఖ పోటీ ఉంటుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా టీఆర్‌ఎస్‌ తన అభ్యర్థిగా సురభి వాణీదేవిని ప్రకటించడంతో ఎమ్మెల్సీ ఎన్నిక రసకందాయంలో పడింది. అంతేకాక ఈసారి టీడీపీ కూడా బరిలో దిగుతున్నట్లు ప్రకటించింది. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు మద్దతు ప్రకటించిన టీడీపీ ఈ సారి నేరుగా తానే రంగంలో దిగుతోంది. టీడీపీ తెలంగాణరాష్ట్ర అధ్యక్షుడు రమణను ఎన్నికల బరిలో దింపింది. ఆయనతోపాటు మరికొందరు స్వతంత్ర అభ్యర్థులు బరిలో దిగుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక ప్రధాన అభ్యర్థులందరికీ ప్రతిష్టాత్మకమనే చెప్పాలి. ఈఎన్నిక ఫలితం ప్రభావం నాగార్జునసాగర్‌  ఉప ఎన్నికపై పడే అవకాశం ఉంది. అందుకే అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. పార్టీ ప్రతిష్టనే కాకుండా మాజీ ప్రధాని పీవీ కుటుంబ ప్రతిష్ట కూడా ఇందులో ఇమిడి ఉండడంతో టీఆర్‌ఎస్‌ నాయకత్వం సర్వశక్తులూ ఒడ్డాడుతున్నాయి. ఇక సిట్టింగ్‌ స్థానాన్ని ఎలాగైనా కాపాడాలనుకుంటున్న బీజేపీ కూడా అన్ని అస్త్రాలను బయటకు తీస్తోంది. పార్టీ అతిరథ మహామహులను ప్రచారానికి దింపుతోంది. ఇక ప్రజా సంఘాలు, వామపక్షాల మద్దతుతో బరిలో దిగుతున్న ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ ప్రధాన పార్టీలకు గట్టిపోటీనే ఇస్తున్నారు. గతంలో రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి రాజకీయ పార్టీలను మట్టికరిపించిన ఆయన.. మూడోసారి కూడా విజయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక కాంగ్రెస్‌ తరఫున మాజీ మంత్రి చిన్నారెడ్డి బరిలో దిగడంతో ఆ పార్టీ శ్రేణులు ఆయన గెలుపు కోసం కష్టపడుతున్నాయి. 


ఉమ్మడి జిల్లానే కీలకం

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో ఉమ్మడి రంగారెడ్డిజిల్లానే కీలకంగా మారింది. ఇక్కడ నుంచి అత్యధికంగా ఓటర్లు ఉన్నారు. దీంతో ప్రధాన అభ్యర్థులంతా ఇక్కడి ఓటు బ్యాంకుపై కన్నే శారు. హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గంలో 5,17,883 మంది ఓటర్లు ఉండగా ఇందులో ఉమ్మడి రంగారెడ్డిజిల్లా నుంచే 2,94,055 మంది ఓటర్లు ఉం డడం  గమనార్హం. ఇందులో రంగారెడ్డిజిల్లా నుంచి 1,40,968 మందికాగా మేడ్చల్‌ జిల్లా నుంచి 1,27,543 మంది, వికారాబాద్‌ నుంచి 25,544 మంది ఓటర్లు ఉన్నారు. ఈసారి ప్రధాన పార్టీలన్నీ పోటీ పడి ఓటర్లను నమోదు చేయించారు. ఇందుకోసం టీంలను కూడా ఏర్పాటు చేశాయి. అలాగే స్వతంత్రులుగా బరిలో దిగాలని భావిస్తున్న మరికొందరు ఓటర్ల నమోదు కోసం శ్రమించారు. ఆశావహులు తమ కార్యకర్తలను, వాలంటీర్లను రంగంలో దింపి ఓటర్లను నమోదు చేయించారు. మరోవైపు అధికారులు ఓటర్ల నమోదుపై విస్తృత ప్రచారం నిర్వహిం చారు. ముఖ్యంగా అఽధికారపార్టీ స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు టార్గెట్లు ఇచ్చి ఈమేర ఓటర్లను నమోదు చేయించాలని ఆదేశించింది. దీంతో ఆపార్టీ ప్రజాప్రతినిధులంతా కార్యరం గంలో దిగారు. దీంతో ఈసారి ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంతో పోలిస్తే దా దాపు రెండు లక్షలకుపైగా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఇందులో ఉమ్మడి రంగారెడ్డిజిల్లా నుంచే అధికంగా ఉండడం గమనార్హం. ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 616 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయగా ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో 286 పోలింగ్‌స్టేషన్లు ఏర్పాటు చేశారు. 


నామినేషన్లకు నేడే తుదిగడువు

ఇదిలాఉంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంఽధించి ఈనెల 16న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది. షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 23వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 24వ తేదీన నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామి నేషన్ల విత్‌డ్రాకు 26వ తేదీ తుది గడువు విధించారు. మార్చి 14వ తేదీన పోలింగ్‌ నిర్వహించి 17 ఓట్ల లెక్కింపు చేపడతారు. 


ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఓటర్ల, పోలింగ్‌స్టేషన్ల వివరాలు

జిల్లాపేరు పోలింగ్‌స్టేషన్లు ఓటర్లు పురుషులు మహిళలు ట్రాన్స్‌జెండర్లు

రంగారెడ్డి 119 1,40,968 88,358 52,594 16

వికారాబాద్‌         37 25,544 17,802 7,739 03

మేడ్చల్‌ 130 1,27,543 77,349 50,178 16

మొత్తం 286 2,94,055 1,83,509 1,10,511 35

Updated Date - 2021-02-23T04:49:19+05:30 IST