మండలి పోల్‌లో ‘వర్గ’పోరు.. రిజర్వేషన్లపై గిరిజన తెగల్లో విద్వేషాలు

ABN , First Publish Date - 2021-03-01T05:16:40+05:30 IST

రిజర్వేషన్ల విషయంలో గిరిజన తెగల మధ్య నెలకొన్న విద్వేషాలు నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో అభ్యర్థులు, ప్రజాప్రతినిధులకు పెనుసవాల్‌గా మారాయి. లంబాడా, ఆదివాసీల గిరిజన తెగల మధ్య గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రస్థాయిలో విబేధాలు కొనసాగుతున్నాయి.

మండలి పోల్‌లో ‘వర్గ’పోరు.. రిజర్వేషన్లపై గిరిజన తెగల్లో విద్వేషాలు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీవ్రప్రభావం  

ఓట్ల బదలాయింపే అసలు సవాల్‌

రిజర్వుడ్‌ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ముచ్చెమటలు

ఇల్లెందు, ఫిబ్రవరి 28: రిజర్వేషన్ల విషయంలో గిరిజన తెగల మధ్య నెలకొన్న విద్వేషాలు నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో అభ్యర్థులు, ప్రజాప్రతినిధులకు పెనుసవాల్‌గా మారాయి. లంబాడా, ఆదివాసీల గిరిజన తెగల మధ్య గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రస్థాయిలో విబేధాలు కొనసాగుతున్నాయి. ఎస్టీ జాబితానుంచి లంబాడాలను తొలగించాలని ఆదివాసీ గిరిజన తెగలు గత కొన్నేళ్లుగా డిమాండ్‌ చేస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్‌, వరంగల్‌ జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ అంశంపై పలుమార్లు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. గిరిజన తెగలు పోటాపోటీగా ఆందోళనకు దిగాయి. ఈ రెండు సామాజిక వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో తమ తమ సామాజిక వర్గాలకు అండగా నిలుస్తుండడంతో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రజాప్రతినిధులకు పరీక్షగా మారాయి.

సవాల్‌గా అభ్యర్థుల సామాజికత

ఎమ్మెల్సీ విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న టీఆర్‌ఎస్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని, కాంగ్రెస్‌ పార్టీ సఫావట్‌ రాములునాయక్‌ను, బీజేపీ గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డిని, టీజేఎస్‌ ప్రొఫెసర్‌ కోదండరాంను, వామపక్షాలు జయసారిధిరెడ్డిని బరిలో దించగా బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల నుంచి మొత్తం 71మంది పోటీలో ఉన్నారు. అయితే ప్రధాన పార్టీల్లో కేవలం కాంగ్రెస్‌ మాత్రమే లంబాడా సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దించగా మిగతా పార్టీలు ఒకే సామాజిక వర్గం వారిని పోటీలో ఉంచాయి. ఈ అంశమే మండలి ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సామాజికవర్గాల ప్రభావంతో గెలుపొందిన ఎమ్మెల్యేలు తాజా మండలి ఎన్నికల్లో వారి పార్టీ అభ్యర్థులకు గిరిజన పట్టభద్రుల ఓట్లు రాబట్టేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. లంబాడా, ఆదివాసీ తెగల వివాదం వల్ల కాంగ్రెస్‌కు లంబాడా సామాజికవర్గం పట్టభద్రులనుంచి భారీగా సానుకూల ఓటింగ్‌ జరుగుతుందని, ఆదివాసీల ఓటింగ్‌ పలువురు అభ్యర్థులకు చీలుతుందన్న ప్రచారం జరుగుతోంది. రిజర్వుడ్‌ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలున్న ఇల్లెందు, మహబూబూబాద్‌, డోర్నకల్‌, పినపాక, వైరా, దేవరకొండ నియోజకవర్గాల్లో లంబాడా పట్టభద్రుల ఓటింగ్‌ను కాంగ్రెస్‌కు లభించకుండా చేయడం, కాంగ్రెస్‌  గెలుపొందిన ములుగు, భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్లలో అదివాసీ పట్టభద్రులను కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటింగ్‌ చేయించడం అంత సులువుకాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ మండలి నియోజకవర్గంలో బంజారా పట్టభద్రులు సుమారు 50వేలు, ఆదివాసీ పట్టభద్రులు 35 వేల మంది ఓట్లు కలిగి ఉన్నట్లు అంచనావేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటింగ్‌ను ప్రభావితం చేస్తున్న తెగల వివాదం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

తొమ్మిది నియోజకవర్గాల్లో తెగల సమస్య

నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో తొమ్మిది అసెంబ్లీ గిరిజన రిజర్వుడ్‌ నియోజకవర్గాలు న్నాయి. ఈ నియోజకవర్గాల్లో గిరిజన తెగల మధ్య తీవ్రస్థాయిల్లో వైష మ్యాలు ఉన్నాయి. గత శాసనసభ ఎన్నికల్లో ప్రత్యక్షంగా అధికార టీఆర్‌ ఎస్‌ పార్టీ దేవరకొండ, మహబూబాబాద్‌, డోర్నకల్‌ అసెంబ్లీ నియోజక వర్గాలను గెలుచుకోగా కాంగ్రెస్‌ ములుగు, ఇల్లెందు, పినపాక, భద్రాచలం సెగ్మెంట్లను వైరా నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి, అశ్వారావుపేటలో టీడీపీ విజయం సాధించారు. ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌నుంచి గెలుపొందిన ఇల్లెందు, పినపాక ఎమ్మెల్యేలు బానోత్‌హరిప్రియ, రేగకాంతరావు, వైరా ఎమ్మెల్యే లావుడ్యారాములునాయక్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఫలితంగా పట్టభద్రుల శాసన మండలి పరిధిలో ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సంఖ్య ఆరుకు పెరిగింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సంఖ్య రెండుకు తగ్గగా టీడీపీకి అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ప్రస్తుత సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలకు చెందిన ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయం కోసం తీవ్రంగా యత్నిస్తున్నప్పటీకీ గిరిజన తెగల వివాదం వారిని అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు సమాచారం.

ఓటింగ్‌ మళ్లింపు పెను సవాల్‌

గతశాసనసభ ఎన్నికల్లో ఆదివాసీ, లంబాడాగిరిజన తెగల మధ్య సామాజిక వర్గాల అంశాలు తీవ్ర ప్రభావం చూపాయి. సామాజిక వర్గాల వారీగా ఓటింగ్‌ జరగడం వల్ల అనుహ్య ఫలితాలు వచ్చాయి. తమ సామాజిక వర్గాల సామూహిక ఓటింగ్‌తో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారు కొందరు ఇతర పార్టీల్లో చేరడం వల్ల తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు మండలి అభ్యర్థులకు పట్టభద్రుల ఓట్లు వేయించగలుగుతారా లేదా అనే విషయం చర్చనీయాంశంగా మారింది. తమ నియోజకవర్గాల్లో పట్టభద్రులను ప్రభావితం చేయడం అంతా సులువుకాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2021-03-01T05:16:40+05:30 IST