కాకినాడ సదస్సులో మాట్లాడుతున్న వెంకటేశ్వరరావు
ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు
జేఎన్టీయూకే, మార్చి 27: మద్యం సొమ్మును ప్రభుత్వ ఆదాయ వనరుగా భావించడం సిగ్గుచేటని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు అన్నారు. జేఎన్టీయూకేలోని సెనేట్హాల్లో మద్యం, మాదకద్రవ్యాలు యువతపై ప్రభావం అనే అంశంపై జనవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో ఆదివారం సదస్సు నిర్వహించారు. సదస్సుకు జిల్లా జనవిజ్ఞాన వేదిక అధ్యక్షుడు కేఎంఎంఆర్ ప్రసాద్ అధ్యక్షత వహించగా మొదటిగా మల్లు స్వరాజ్యం మృతికి మౌనం పాటించి నివాళులర్పించారు. ముఖ్య అతిఽథిగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ అమ్మ సంక్షేమ సొమ్ము కోసం నాన్న తాగే మద్యం డబ్బులపై ప్రభుత్వం ఆధారపడటం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించాలన్నారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకుడు డాక్టర్ సీహెచ్ స్టాలిన్ మాట్లాడుతూ మద్య నిషేధం, ప్రజాస్వామిక సంస్కృతి కోసం ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా వ్యాసరచన, పోస్టర్ మేకింగ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. సదస్సులో జనవిజ్ఞాన వేదిక నాయకులు కేవీవీ.సత్యనారాయ ణ, సుబ్రహ్మణ్యం, రవికుమార్, సుబ్బారావు, మంగతాయారు పాల్గొన్నారు.
విద్యా సంస్థల నిర్వీర్యం
సర్పవరం జంక్షన్, మార్చి 27: విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకుండా విద్యా సంస్థలను నిర్వీర్యం చేసేలా ఖాళీ స్థలాలను ఏదో ఒక ఒంకతో లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఆదివారం తిమ్మాపురం అక్నూపీజీ సెంటర్ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నన్నయ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న నాయకర్ పీజీ సెంటర్ను అభివృద్ధి చేయని ప్రభుత్వం వైసీపీ కార్యాలయం కోసం 4.41 ఎకరాలను కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. స్థానిక సర్పంచ్ వైసీపీ కార్యాలయానికి స్థలం కోసం పంచాయతీ తీర్మానం చేసి తహశీల్దార్ ద్వారా ఆర్డీవోకు పంపంచి ఒత్తిడి తీసుకురావడం దారుణమన్నారు. యూనివర్సిటీ అధికారులను కనీసం సంప్రదించకుండా గ్రామసభ తీర్మానం చేయ డం తగదన్నారు. జిల్లాల విభజనలో భాగంగా అక్నూ యూనివర్సిటీ రాజమహేంద్రవరం జిల్లా పరిధిలోకి వెళుతోందని, నూతనం ఏర్పాటయ్యే కాకినాడ జిల్లాకు యూనివర్సిటీ లేదని, ఇప్పుడు ఉన్న స్థలాన్ని పార్టీకి కేటాయిస్తే జిల్లాకు యూనివర్సిటీ ఉండే అవకాశం కోల్పోతామన్నారు. తక్షణమే స్థలం కేటాయింపు విషయంపై పునరాలోచించుకోవాలని లేదంటే విద్యార్థులు, ప్రజా సంఘాలతో కలసి ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు.