ఎత్తు.. పైఎత్తు!

ABN , First Publish Date - 2021-03-06T05:20:48+05:30 IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రచారం జోరందుకుంది.

ఎత్తు.. పైఎత్తు!

  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు
  • ప్రచారంలో దూసుకుపోతున్న పార్టీల అభ్యర్థులు
  • ఉమ్మడిరంగారెడ్డి జిల్లాలో వేడెక్కిన రాజకీయం
  • ప్రచారంలో ముఖ్య నేతల హల్‌చల్‌
  • రసవత్తరంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు


పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వత్రంత అభ్యర్థులు పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తూ వ్యూహ, ప్రతివ్యూహాలను రచిస్తూ విద్యావంతులను ఆకట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు స్వయంగా రంగంలోకి దిగి సంప్రదింపులు జరుపుతున్నారు. 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ఎమ్మెల్సీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో శాసన మండలి ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ శాసన మండలి పట్టభద్రుల స్థానం కోసం ప్రధాన పార్టీల నేతలతోపాటు స్వతంత్రులు అన్ని సర్వశక్తులొడ్డుతున్నారు. పట్టభద్రులు, విద్యావంతులను ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పోటాపోటీగా సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఎమ్మెల్సీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. సోషల్‌ మీడియాను వేదికగా మార్చుకుంటున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు తమకు ఓటేసి గెలిపించాలని కోరుతూ వాయిస్‌ మెసేజ్‌లు పెడుతున్నారు. నమూనా బ్యాలెట్‌ పత్రాలతో అభ్యర్థులు పట్టభద్రులను ప్రసన్నం చేసుకునేందుకు సన్నాహక సమావేశాలు, నియోజకవర్గాల వారీగా పర్యటనలు చేస్తున్నారు. అధికార పార్టీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు పార్టీ అభ్యర్థి సురభి వాణీదేవిని గెలిపించుకునేందుకు పావులు కదుపుతున్నారు. బీజేపీ అభ్యర్థి రాంచందర్‌రావు ఎమ్మెల్సీగా ఆరేళ్లు ఉండి ఉమ్మడి జిల్లా కోసం ఏమి చేశారని వారు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్‌, గ్యాస్‌, డీజిల్‌ ధరలను పెంచిందని టీఆర్‌ఎస్‌, బీజేపీలకు పట్టభద్రులు ఓటుతో తగిన విధంగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డి ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని, బీజేపీ అభ్యర్థి రాంచందర్‌రావుకు పట్టం కట్టాలని బీజేపీ, అనుబంధ సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని శాసన మండలిలో తన గళం విప్పుతానని  వామపక్షాలు, ప్రజా సంఘాల మద్దతుతో బరిలో దిగిన ప్రొఫెసర్‌నాగేశ్వర్‌ అంటున్నారు. వామపక్షాలు నాగేశ్వర్‌ తరఫున చాపకింద నీరులా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇక టీడీపీ తరఫున పోటీ చేస్తున్న ఎల్‌.రమణ, స్వతంత్ర అభ్యర్థులు హర్షవర్ధన్‌, రాగం సతీ్‌షయాదవ్‌, సతీ్‌షలు పట్టభద్రులు, నిరుద్యోగులు, విద్యారంగ సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. తెలంగాణ ఏర్పడినా నిరుద్యోగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిందేమీలేదంటూ విమర్శిస్తున్నారు. 


వ్యూహ, ప్రతివ్యూహాలకు పదును

ప్రధాన పార్టీల నేతలు వ్యూహ, ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నారు. పట్టభద్రులను ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రతి 50 మందికి ఒక చురుకైన కార్యకర్తను నియమించింది. టీఆర్‌ఎస్‌ ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నాల్లో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఓట్లు వచ్చే ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు సాగుతోంది. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు స్వయంగా ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి వారితో సంప్రదింపులు చేస్తున్నారు. వారికి కూడా ఎక్కడైనా వ్యతిరేకత ఎదురైతే నేరుగా మంత్రులు సబితాఇంద్రారెడ్డి, హరీశ్‌రావు రంగంలోకి దిగుతున్నారు. అలాగే బీజేపీ 25 మందికి ఒక కార్యకర్తను నియమించింది. అన్ని మండలాల్లో సమావేశాలు నిర్వహించారు. ఓటర్లను కలిసి తమ అభ్యర్థికి ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలు తమదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. చురుకైన కార్యకర్తకు 50 మంది ఓటర్లను అప్పగించారు. అభ్యర్థులు నేరుగా ఓటర్ల వాట్స్‌పలకు ఓటర్‌ స్లిప్‌లను పంపుతున్నారు. ఇందులో ఓటర్‌ పోలింగ్‌ కేంద్రం వివరాలు కూడా ఇస్తున్నారు. 


అభ్యర్థుల తరఫున ముఖ్య నేతల ప్రచారం

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : ఎమ్మెల్సీ ఎన్నికల టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవిని గెలిపించుకునే బాధ్యతను మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా పార్టీ ఎన్నికల ఇన్‌చార్జిగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు ప్రచారాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ట్రబుల్‌ షూటర్‌గా పేరున్న హరీష్‌రావు నియోజకవర్గాలవారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ సీఎం కేసీఆర్‌ తనకు అప్పగించిన బాధ్యతను విజయవంతంగా పూర్తిచేసే దిశగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. మంత్రి సబితారెడ్డి, జడ్పీచైర్‌పర్సన్‌ సునీతారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ కార్యోన్ముఖులను చేస్తున్నారు. 

ఎమ్మెల్సీ సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ శ్రేణులు విస్తృత ప్రచారం చేస్తున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఎం.రాంచందర్‌రావును గెలిపించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ జిల్లాలోని తాండూరులో పర్యటించారు. నియోజకవర్గాలు, మండలాల వారీగా ఇన్‌చార్జిలను నియమించి వారికి ప్రచార బాధ్యతలు అప్పగించారు. మాజీ మంత్రి డాక్టర్‌ ఎ.చంద్రశేఖర్‌ నేతృత్వంలో జిల్లా అంతా పర్యటిస్తూ బీజేపీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించుకునే దిశగా కృషి చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి రాంచందర్‌రావుకు మద్దతుగా ఆదివారం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి వికారాబాద్‌లో నిర్వహించే ప్రచార సభలో పాల్గొననున్నారు.

 ఇదిలా ఉంటే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఓట్ల రూపంలో తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ ఎన్నికల్లో గెలుపొంది తమ సత్తా చాటాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి డాక్టర్‌ జి.చిన్నారెడ్డి తరపున ఆ పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రచార వ్యూహంపై మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌ శుక్రవారం తన నివాసంలో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై చర్చించారు.

వామపక్షాల అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో పట్టభద్రులు, ఉద్యోగులు, నిరుద్యోగ యువతతో సమావేశాలు నిర్వహించారు. స్వతంత్ర అభ్యర్థులు జి.హర్షవర్ధన్‌రెడ్డి, గౌరీ సతీష్‌ దూకుడు పెంచి రాజకీయ పార్టీల అభ్యర్థులకు ధీటుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 


ఎమ్మెల్సీగా గెలిపిస్తే పేదల గొంతుకను వినిపిస్తా.. : ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి ఎల్‌.రమణ

ఇబ్రహీంపట్నం: తనను ఎమ్మెల్సీగా ఆశీర్వదించి మండలికి పంపిస్తే కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలపై మండలిలో పేదల గొంతు కను వినిపిస్తానని హైదరాబాద్‌- రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి ఎల్‌.రమణ స్పష్టం చేశారు. శుక్రవారం ఇబ్రహీంపట్నంలోని శంకర్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను టీడీపీ వ్యతిరేకించలేదని సిద్ధాంతపరంగా మాత్రమే ప్రశ్నిస్తూ వస్తున్నామన్నారు. అందుకే పార్టీ పట్ల ప్రజల్లో పూర్తి విశ్వాసం ఉందని ఆయన అన్నారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌కు దీటుగా సైబరాబాద్‌ను అభివృద్ధి చేసిన ఘనత టీడీపీకే దక్కుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రపంచ స్థాయి విద్యా సంస్థలను నెలకొల్పి ఉద్యోగాల కల్పనకు బాటలు వేసిందికూడా టీడీపీయేనని ఆయన గుర్తు చేశారు. టీడీపీ హయాంలోనే ఐటీ రంగం అభివృద్ధి చెందిందని, ఐటీఐఆర్‌ను తేవడంలో పాలకులు విఫలమయ్యారని విమర్శించారు. కేసీఆర్‌ కుటుంబం చేతుల్లో తెలంగాణ బంధీ అయిందన్నారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, పట్టభద్రులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో టీడీపీ మున్సిపల్‌ అధ్యక్షుడు జక్క రాంరెడ్డి, భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు కుందారపు కృష్ణాచారి, జెలమోని రవీందర్‌, మంకు ఇందిర, సంజీవ, చకప్రాణి, వంగాల కృష్ణ, జక్క కరుణాకర్‌రెడ్డి, మెట్టు దామోదర్‌రెడ్డి, కిషోర్‌గౌడ్‌, నక్క మహేందర్‌, లక్ష్మారెడ్డి, బాలబ్రహ్మచారి, రావుల వీరేష్‌, కప్పరి అంజయ్య, వీరాచారి తదితరులున్నారు.

Updated Date - 2021-03-06T05:20:48+05:30 IST