ఓటర్ల నమోదుకు స్పందన కరవు

ABN , First Publish Date - 2020-12-02T05:46:56+05:30 IST

ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాను మంగళవారం ప్రకటించారు. వీటిని రెండు జిల్లాల కలెక్టరేట్‌లు, రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయాలు, తహశీల్దార్‌, ఎంపీడీవో, మున్సిపల్‌ కార్యాలయాల్లో ప్రదర్శించారు.

ఓటర్ల నమోదుకు స్పందన కరవు

తగ్గిన ఉపాధ్యాయ ఓటర్ల నమోదు

 ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

 ఈ నెలాఖరు వరకు  అవకాశం

ఏలూరు, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాను మంగళవారం ప్రకటించారు. వీటిని రెండు జిల్లాల కలెక్టరేట్‌లు, రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయాలు, తహశీల్దార్‌, ఎంపీడీవో, మున్సిపల్‌ కార్యాలయాల్లో ప్రదర్శించారు. దీనిపై డిసెంబరు 31లోగా క్లైయిములు, అభ్యంతరాలను స్వీకరించి, 2021 జనవరి 12 నాటికి వాటిని క్లియర్‌ చేస్తాం’ అని జనవరి 21న తుది ప్రచురణ చేస్తారు. నియోజకవర్గ పరిధిలో మొత్తం 14,088 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 8,514, మహిళలు 5,571, ఇతరులు ముగ్గురు. ఇందులో తూర్పులో 7,806 మందికి పురుషులు 4,793, మహిళలు 3,012, ఇతరులు ఒకరు కాగా, పశ్చిమలో 6,282 మందికి పురుషులు 3,721, మహిళలు 2,559, ఇతరులు ఇద్దరు ఉన్నారు. జాబితాలో నమోదు కాని అర్హులు ఎవరైనా ఉంటే ఈ నెల ఒకటి నుంచి 31వ తేదీలోగా సంబంధిత ఎంపీడీవో, తహశీల్దార్‌ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల అధికారి, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి  చెప్పారు. మరింత సమాచారం కోసం జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలోని టోల్‌ ఫ్రీ నంబరు 1950లో సంప్రదించవచ్చని కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి తెలిపారు. 


పశ్చిమలో తగ్గిన ఓటర్ల సంఖ్య 

2014లో జరిగిన ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదైన జాబితాతో పోలిస్తే ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇటు ఉపాధ్యాయ సంఘాలు, అటు అధికారులను ఈ పరిణామం ఆలోచనలో పడేసింది. ఆ ఎన్నికల్లో పశ్చిమ నుంచి 9,327 మంది ఓటర్లు ఉండగా, ఈ సారి 6,282కు పడిపోయింది. అయితే ఈ నెల చివరి వరకు మరో దఫా అవకాశం ఉండడంతో ఓటర్ల సంఖ్య పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఓటరు నమోదు ప్రక్రియలో నిబంధనలు ఆటంకంగా మారాయని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎయిడెడ్‌ అధ్యాపకులకు ఈసారి ఆర్‌జేడీ ప్రత్యేక అనుమతి తీసుకోవాలని ఆదేశాలు రావడంతో చాలా మంది ఓటర్ల నమోదుకు దూరమైనట్లు చెబుతున్నారు. ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లో రిటైర్మెంట్లే తప్ప రిక్రూట్‌మెంట్లు లేకపోవడంతో ఓటర్ల సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది. దరఖాస్తు ప్రక్రియ సుదీర్ఘంగా ఉండటంతో చాలా మంది దరఖాస్తుకు సుముఖత చూపడం లేదు. ‘ఉపాధ్యాయ సంఘాల నేతలే దగ్గరుండి దరఖాస్తు చేయించడం వల్లే ఈ మాత్రమైనా నమోదయ్యాయి. నిబంధనలు కఠినతరం చేయడం, పోస్టుల ను భర్తీ చేయకపోవడం వంటి కారణాల వల్ల సంఖ్య బాగా తగ్గింది. ఇప్పుడు మళ్లీ క్యాంపెయిన్‌ మొదలు పెడుతున్నాం.’ అని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు గోపిమూర్తి తెలిపారు. 

Updated Date - 2020-12-02T05:46:56+05:30 IST