విధేయత కోటాలో Talasila Raghuram‌కు ఎమ్మెల్సీ.. త్వరలో ఆయన రాజీనామా..

ABN , First Publish Date - 2021-11-13T06:28:49+05:30 IST

జిల్లా నుంచి ఇద్దరు వైసీపీ నేతలకు ఎమ్మెల్సీ పదవులు లభించాయి.

విధేయత కోటాలో Talasila Raghuram‌కు ఎమ్మెల్సీ.. త్వరలో ఆయన రాజీనామా..

  • మండలికి ఇద్దరు.. 
  • సామాజిక సమీకరణాల కోటాలో మొండితోక అరుణ్‌

(విజయవాడ, ఆంధ్రజ్యోతి) : జిల్లా నుంచి ఇద్దరు వైసీపీ నేతలకు ఎమ్మెల్సీ పదవులు లభించాయి. వైసీసీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాకు ఎమ్మెల్సీ పదవులు దక్కడం ఇదే తొలిసారి. స్థానిక సంస్థల కోటాలో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బుద్దా వెంకన్న, వైవీబీ రాజేంద్రప్రసాద్‌ పదవీకాలం ముగియడంతో ఈ రెండు స్థానాలను వైసీపీ తన ఖాతాలో వేసుకోనుంది. ఈ రెండు స్థానాలకు జిల్లా నుంచి సీఎం జగన్‌ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, ఏపీ ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ మొండితోక అరుణ్‌కుమార్‌ పేర్లను ఖరారు చేస్తూ శుక్రవారం వైసీపీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. జగన్‌ పాదయాత్ర సమయంలో సమన్వయకర్తగా వ్యవహరించిన తలశిల రఘురాం విధేయతను దృష్టిలో ఉంచుకుని ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. డాక్టర్‌ మొండితోక అరుణ్‌కుమార్‌ ఇప్పటికే ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు చైర్మన్‌గా ఉన్నా, ఆయనకు ఎమ్మెల్సీ దక్కడం వైసీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకోవడంతోపాటు పార్టీకి విధేయులుగా ఉన్న వారికి ఎమ్మెల్సీ కట్టబెట్టాలన్న దృష్టితో అరుణ్‌కుమార్‌కు ప్రాధాన్యం ఇచ్చినట్టు సమాచారం. ఆయన ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవికి త్వరలో రాజీనామా చేసే అవకాశం ఉంది.


గొల్లపూడిలో సందడి

గొల్లపూడి : జిల్లా నుంచి మరో ఎమ్మెల్సీగా సీఎం జగన్‌ ప్రోగ్రాం కన్వీనర్‌ తలశిల రఘురాం పేరు ఖరారు కావడంతో ఆయన అభిమానులు, వైసీపీ శ్రేణులు గొల్లపూడిలోని ఆయన నివాసానికి చేరుకొని అభినందలు తెలిపారు. బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. 


విధేయతకు పట్టం

1966లో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన రఘురాం అంచెలంచెలుగా ఎదిగి, సీఎం జగన్‌ ప్రోగ్రాం కన్వీనర్‌గా రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన పూర్వీకులు ఖమ్మం జిల్లావాసులు కాగా, ఆయన మాత్రం గొల్లపూడిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. రఘురాం ఎల్‌ఎల్‌బీ చదువుకున్నారు. 1996లో యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడిగా రాజకీయ అరంగేట్రం చేశారు. వైఎస్‌ మరణానంతరం ఆయన కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉన్నారు. జగన్‌ పాదయాత్ర ముగిసే వరకు ఆయన వెంటే ఉన్నారు. జగన్‌ సీఎం అయిన తర్వాత రఘురాంకు ప్రోగ్రాం కన్వీనర్‌గా కేబినేట్‌ హోదా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానన్నారు. 


నందిగామలో వైసీపీ సంబరాలు

డాక్టర్‌ మొండితోక అరుణ్‌ కుమార్‌కు శాసనమండలి అభ్యర్థిత్వం లభించడంతో నందిగామ వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. 


అంకితభావానికి గుర్తింపు

1975లో జన్మించిన అరుణ్‌కుమార్‌ డిల్లీ విశ్వ విద్యాలయంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేశారు. 2014 ఎన్నికల్లో తన సోదరుడు డాక్టర్‌ జగన్మోహనరావుకు నందిగామ నుంచి టికెట్‌ దక్కించుకున్నారు. ఆయన ఓటమి పాలైనా, నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని, వైసీపీ అభివృద్ధికి కృషి చేశారు. తిరిగి 2019 ఎన్నికల్లో తన సోదరుడి విజయం కోసం చురుగ్గా పని చేశారు. రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధిగా, రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన అరుణ్‌కు పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవిని కట్టబెట్టింది. ఇంతలోనే మండలి అభ్యర్థిత్వం దక్కింది. 

Updated Date - 2021-11-13T06:28:49+05:30 IST