రద్దీ లేదంటూ రద్దు..!

ABN , First Publish Date - 2022-01-22T16:10:24+05:30 IST

జంట నగరాల రవాణాలో అత్యంత కీలకమైన మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌ (ఎంఎంటీఎస్‌) రైళ్ల నిర్వహణ అధ్వానంగా మారింది. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఎంతో

రద్దీ లేదంటూ రద్దు..!

ఫలక్‌నుమాకు చెందిన రహమాన్‌ సికింద్రాబాద్‌లోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నాడు. నెలకు రూ.20వేల వేతనం. రూ.150తో నెలవారీ సీజన్‌ పాస్‌ తీసుకుని రోజూ అక్కడి నుంచి ఎంఎంటీఎస్‌ రైలులో దుకాణానికి వెళ్లి వస్తుంటాడు. ఫలక్‌నుమా-లింగంపల్లి మార్గంలో మెయింటెనెన్స్‌ పనులు చేస్తున్నామంటూ తరచూ సర్వీసులను రద్దు చేస్తుండడంతో రహమాన్‌ ఇబ్బందులు పడుతున్నాడు. రోజుకు రూ.60 ఖర్చుచేసి పనికి వెళ్లి రావాల్సి వస్తోందని వాపోతున్నాడు.

లింగంపల్లికి చెందిన రాములు పాల వ్యాపారి.  రోజూ లింగంపల్లి నుంచి సికింద్రాబాద్‌కు ఎంఎంటీఎస్‌ రైలులో వచ్చి పాలు పోస్తుంటాడు. పాల క్యాన్లను పట్టుకుని ఎంఎంటీఎస్‌ రైళ్లలో సులువుగా ప్రయాణించే రాములు నాలుగు రోజులుగా ఇబ్బందులు పడుతున్నాడు. లోకల్‌ రైళ్లు రద్దవుతుండడంతో ఆటోల్లో ప్రయాణించాల్సి వస్తోందని  పేర్కొంటున్నాడు.  


ఎంఎంటీఎ్‌సలు లేక చిరుద్యోగుల పాట్లు 

ప్రైవేట్‌ వాహనాలతో జేబులు గుల్ల

 ఐదు రోజుల్లో 134 సర్వీసులకు బ్రేక్‌


హైదరాబాద్‌ సిటీ: జంట నగరాల రవాణాలో అత్యంత కీలకమైన మల్టీ మోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌ (ఎంఎంటీఎస్‌) రైళ్ల నిర్వహణ అధ్వానంగా మారింది. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఎంతో అనుకూలంగా ఉండే రైళ్లను ట్రాక్‌ నిర్వహణ పనులు, పలు రూట్లలో రద్దీ తగ్గిందనే నెపంతో తరచూ నిలిపివేస్తున్నారు. దీంతో శివారు ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే ఉద్యోగులు, చిరు వ్యాపారులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు ఆర్టీసీ బస్సుల్లో, మరికొందరు ప్రైవేట్‌ వాహనాల్లో ప్రయాణం చేస్తున్నారు. జంటనగరాల పరిధిలోని సికింద్రాబాద్‌, నాంపల్లి, ఫలక్‌నుమా, లింగంపల్లి మార్గాల నడుమ రెండేళ్ల క్రితం రోజుకు 129 వరకు ఎంఎంటీఎస్‌ రైళ్లు నడిచేవి.  కొవిడ్‌ మొదటి, రెండోదశ తర్వాత తొలుత 50, ఆపై అదనంగా 26 రైళ్లను మొత్తం 76 సర్వీసులను నడిపిస్తున్నారు. అయితే, సికింద్రాబాద్‌-లింగంపల్లి, ఫలక్‌నుమా-లింగంపల్లి, నాంపల్లి-లింగంపల్లి మార్గాల్లో ట్రాక్‌ మరమ్మతు పనుల పేరిట ఇటీవల సర్వీసులు రద్దు చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత ఈనెల 17 నుంచి 20 వరకు   మొత్తం 134 సర్వీసులను రోజు విడిచి రోజు నిలిపివేయడంతో ఉద్యోగులు, దినసరి కూలీలు ఇబ్బందులు పడ్డారు. ఎంఎంటీఎ్‌సతోపాటు దూర ప్రాంతాలకు వెళ్లే డెమూ రైళ్లను ఆపేస్తుండడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


ఆదాయం లేకపోవడంతోనే..

ఎంఎంటీఎస్‌ రైళ్లలో కనీస టికెట్‌ చార్జీ రూ.5, గరిష్ఠ టికెట్‌ చార్జీ రూ.25 వరకు ఉంది. నెలవారీ సీజన్‌ పాస్‌ రూ.150 మాత్రమే. దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులతోపాటు విద్యార్థులు, చిరు వ్యాపారులు, ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఎంఎంటీఎస్‌ రైళ్లలో రాకపోకలు సాగించేవారు. కొవిడ్‌కు ముందు దక్షిణ మధ్య రైల్వేకు రోజుకు రూ.2.20 లక్షల నుంచి 2.50 లక్షల ఆదాయం వచ్చింది. అయితే కొవిడ్‌ నేపథ్యంలో ఐటీ కంపెనీలకు వర్క్‌ఫ్రమ్‌ హోం ఇవ్వడంతోపాటు కాలేజీలు మూతపడడంతో రోజువారీ ప్రయాణికుల సంఖ్య సగానికి పైగా పడిపోయింది. దీంతో అధికారులు సగానికి పైగా లోకల్‌ రైళ్లను నెలలో వారం రోజులపాటు నిలిపివేస్తున్నారని ప్రయాణికుల సంఘం నాయకులు వాపోతున్నారు. నగరంలో మెట్రో, క్యాబ్‌లు, ఆటోలతో ఇతర ప్రైవేట్‌ వాహనాలతో పోల్చితే ఎంఎంటీఎస్‌ ప్రయాణం చౌకగా, వేగంగా ఉంటుందని, దీనిని దృష్టిలో ఉంచుకుని సర్వీసులను యథావిధిగా నడిపించాలని వారు కోరుతున్నారు.

Updated Date - 2022-01-22T16:10:24+05:30 IST