Graft case : మొహాలీ జిల్లా అటవీ శాఖాధికారి అరెస్ట్

ABN , First Publish Date - 2022-06-02T23:12:12+05:30 IST

పంజాబ్ విజిలెన్స్ బ్యూరో వలలో ఓ అవినీతి తిమింగలం

Graft case : మొహాలీ జిల్లా అటవీ శాఖాధికారి అరెస్ట్

చండీగఢ్ : పంజాబ్ విజిలెన్స్ బ్యూరో వలలో ఓ అవినీతి తిమింగలం చిక్కుకుంది. ఆ లంచగొండి అధికారిపై ఏకంగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు వెళ్ళింది. దీంతో విజిలెన్స్ బ్యూరో అధికారులు గురువారం ఉదయం ఆ అధికారిని అరెస్టు చేశారు. వరల్డ్‌వైడ్ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ సర్వీసెస్ డైరెక్టర్ ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నారు. 


విజిలెన్స్ బ్యూరో అధికారులు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం, వరల్డ్‌వైడ్ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ సర్వీసెస్ డైరెక్టర్ దవీందర్ సంధు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు ఓ వీడియో ద్వారా ఫిర్యాదు చేశారు. మొహాలీ జిల్లా అటవీ శాఖాధికారి (డీఎఫ్ఓ) గుర్‌మన్‌ప్రీత్ సింగ్, మరొక వ్యక్తి హర్మన్ సింగ్ ముడుపుల కోసం తమను వేధిస్తున్నారని ఆరోపించారు. కొన్ని ప్రాజెక్టుల్లో తమకు అనుకూలంగా వ్యవహరించేందుకు లంచాలను డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో గుర్‌మన్‌ప్రీత్, హర్మన్లను అరెస్టు చేశారు. వీరిపై అవినీతి నిరోధక చట్టం, భారత శిక్షా స్మృతి ప్రకారం కేసు నమోదు చేశారు. 


విజిలెన్స్ బ్యూరో ఎస్ఎస్‌పీ గగన్‌జిత్ సింగ్ మాట్లాడుతూ, ఫిర్యాదుదారు ముఖ్యమంత్రి పోర్టల్‌కు ఓ వీడియోను అప్‌లోడ్ చేశారన్నారు. ఆ వీడియోను తనిఖీ చేసి, అది సరైనదేనని నిర్థరించుకున్న తర్వాత కేసును నమోదు చేసినట్లు తెలిపారు. 


Updated Date - 2022-06-02T23:12:12+05:30 IST