ఫోన్ రాకున్నా మోగుతున్న మొబైల్.. బాగు చేసిన పొరుగింటి కుర్రాడు.. ఆరా తీస్తే వెలుగులోకి షాకింగ్ నిజం!

ABN , First Publish Date - 2021-07-20T15:01:26+05:30 IST

ఆ కుటుంబంలోని మొబైల్స్‌కు కాల్స్ రాకపోయినా, కాల్స్ వచ్చినట్లు రింగ్ అవడం, వైబ్రేట్ అవడం జరుగుతోంది. దీంతో చిర్రెత్తిన ఆ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఫోన్ రాకున్నా మోగుతున్న మొబైల్.. బాగు చేసిన పొరుగింటి కుర్రాడు.. ఆరా తీస్తే వెలుగులోకి షాకింగ్ నిజం!

సింగ్రోలీ: ఆ కుటుంబంలోని మొబైల్స్‌కు కాల్స్ రాకపోయినా, కాల్స్ వచ్చినట్లు రింగ్ అవడం, వైబ్రేట్ అవడం జరుగుతోంది. దీంతో చిర్రెత్తిన ఆ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో ఇలానే జరిగితే పొరుగింట్లో ఉండే ఒక కుర్రాడు కొంత డబ్బు తీసుకొని మొబైల్స్ బాగుచేశాడని, మళ్లీ అదే సమస్య వచ్చిందని చెప్పిన సదరు కుటుంబం.. ఎవరైనా తమ మొబైల్స్ హ్యాక్ చేశారేమో అని అనుమానపడింది. వాళ్లు చెప్పింది విన్న పోలీసులకు సదరు కుర్రాడిపై అనుమానం వచ్చింది. దీంతో అతన్ని పట్టుకొని విచారించగా షాకింగ్ నిజం బయటపడింది.


ఆ అబ్బాయి వయసు 16. కరోనా కారణంగా విద్యాలయాలన్నీ మూతపడటంతో అతను కూడా ఇంట్లోనే ఉంటున్నాడు. దీంతో తల్లిదండ్రులు అతనికి ఒక ల్యాప్‌టాప్ కొనిపెట్టారు. అలా చేయడమే ఆ కుటుంబానికి తలవంపులు తెచ్చిపెట్టింది. చదువు కోసం ఉపయోగించుకోవాల్సిన ల్యాప్‌టాప్‌ను ఆ కుర్రాడు తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదించడానికి ఉపయోగించాడు. జీపీఎస్ యాప్స్ ద్వారా తన లొకేషన్ మార్చుకోవడం తెలుసుకున్న తర్వాత.. హ్యాకింగ్‌పై ఫోకస్ పెట్టి, కష్టపడి ఈ విద్య నేర్చుకున్నాడు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. తను నేర్చుకున్న విద్యను అమాయకులపై ప్రయోగించడం మొదలు పెట్టాడీ కుర్రాడు. యువతను ట్రాప్ చేసి, వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బు వసూలు చేయడం ప్రారంభించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సింగ్రోలీ జిల్లాలో వెలుగు చూసింది.


మోర్వా ప్రాంతంలో ఉండే ఈ కుర్రాడికి ఎక్కడి నుంచో ఒక కెనడా ఫోన్ నంబర్ దొరికింది. దాంతో వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసిన అతను.. అమ్మాయిలా నటిస్తూ యువకులకు గాలం వేయడం ప్రారంభించాడు. కొన్ని రోజులు చాట్ చేసిన తర్వాత వీడియో కాల్స్ చేసి ఆ యువకుల అశ్లీల వీడియోలు, ఫొటోలు తీసేవాడు. అలాగే వీడియో కాల్ సమయంలోనే సదరు బాధితుడి ఫోన్ హ్యాక్ చేసి, అతని మొబైల్‌లోని కాంటాక్టులు, ఫొటోలు, వీడియోలు సేకరించడం ప్రారంభించాడు. ఆ తర్వాత అడిగినంత డబ్బు ఇవ్వకపోతే.. తాను తీసిన అశ్లీల వీడియోలను కుటుంబసభ్యులకు పంపుతానని బెదిరించేవాడు. ఇలా చాలామంది వద్ద నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఈ విషయాలన్నింటినీ పోలీసుల విచారణలో నిందితుడు అంగీకరించాడు.

Updated Date - 2021-07-20T15:01:26+05:30 IST