‘ద్రావిడ’ స్ఫూర్తితో నవ్య జాతీయవాదం

ABN , First Publish Date - 2022-09-16T06:34:30+05:30 IST

దక్షిణార్ధగోళం దేశాలు పై భాగంలో ఉండే ప్రపంచ పటాన్ని చూశారా? అటువంటి ప్రపంచ పటం మీ ప్రపంచ దృక్పథాన్ని మార్చి వేస్తుంది. చాలా దూరంలో ఉండే ఆస్ట్రేలియాను...

‘ద్రావిడ’ స్ఫూర్తితో నవ్య జాతీయవాదం

దక్షిణార్ధగోళం దేశాలు పై భాగంలో ఉండే ప్రపంచ పటాన్ని చూశారా? అటువంటి ప్రపంచ పటం మీ ప్రపంచ దృక్పథాన్ని మార్చి వేస్తుంది. చాలా దూరంలో ఉండే ఆస్ట్రేలియాను, ఆఫ్రికా అగ్రగణ్యతను, లాటిన్ అమెరికా ప్రాముఖ్యతను మీరు గుర్తించడం ప్రారంభిస్తారు. గ్లోబల్ సౌత్ (లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికా, ఓషానియా దేశాలు)ను అగ్రభాగానికి తీసుకువచ్చి, వాటి స్థానంలో ఐరోపా, ఉత్తర అమెరికా దేశాలను ఉంచుతుంది. భూమి గుండ్రంగా ఉందన్న సుపరిచిత సత్యం మీకు కొత్తగా గోచరిస్తుంది. మనం నిత్యం చూస్తుండే, ఉపయోగించే ఉత్తరార్ధ గోళం పై భాగంలో ఉండే ప్రపంచ పటం, మన వలసపాలకులు మనపై రుద్దిన ఒక భౌగోళిక దృక్పథం మినహా మరేమీకాదని కూడా మీకు తెలిసివస్తుంది.


దక్షిణ భారతావని పై భాగంలో ఉండే భారతదేశ పటం మనకు ఎందుకు లేదు? భారత్ జోడో యాత్ర మొదటి రోజు నాకు నేను వేసుకున్న ప్రశ్న అది. కన్యాకుమారిలో త్రివేణీ సంగమం– బంగాళా ఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం కూడలి– వద్ద సాలోచనగా నిలబడ్డ క్షణాలవి. వివేకానంద స్మారక చిహ్నం, తిరువళ్లువర్ విగ్రహం నా వెనుక ఉండగా భారత్ జోడో గమ్యం అయిన కశ్మీర్ వైపు నా దృష్టి సారించాను. ఇక్కడేకాదూ భారత్ మొదలయ్యేది అనే ఒక పరవశ భావం ఆ క్షణంలో నా మదిని పులకరింపచేసింది. మన సువిశాల మాతృభూమి దక్షిణ కొస నుంచి ఈ యాత్ర ప్రారంభం కావడం భారత్ గురించిన ఒక కొత్త భావనాశక్తిని అంకురింప చేసింది.


ఏమిటీ నూతన భావనా శక్తి? దక్షిణాయన్. భాషా విశారదుడు ప్రొఫెసర్ జిఎన్ దేవి సమకూర్చిన పేరు అది. అసలు అది 2016లో పలువురు ఇతర రచయితలతో కలిసి ఆయన ప్రారంభించిన ఒక ఉద్యమం పేరు. భారత్ జోడో ప్రారంభ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఆ ఉదయం ఆయన మాతో కలిసి ఉపాహారం తీసుకున్నారు. ఇడ్లీ సాంబార్‌ను ఆస్వాదించి, రుచికరమైన ఫిల్టర్ కాఫీ తాగుతూ దక్షిణాయన్ భావన, ఉద్యమ వికాస గాథను ఆయన మాకు వివరించారు. కరడుగట్టిన మితవాద శక్తులు ప్రొఫెసర్ ఎమ్ఎమ్ కల్బుర్గిని హతమార్చినప్పుడు ఆయన సతీమణికి బాసటగా ఉండేందుకై తన భార్య సురేఖ, తానూ గుజరాత్‌లోని వడోదర (బరోడా) నుంచి కర్ణాటకలోని ధార్వాడ్‌కు తమ నివాసాన్ని ఎలా మార్చిందీ ఫ్రొఫెసర్ దేవీ నుంచే మీరు విని తీరాలి. దక్షిణాయన్ అనే నామవాచకానికి ఉన్న ద్వివిధ ప్రాధాన్యం ఆయన్ని అమితంగా ఆకట్టుకుంది. దక్షిణాది నేపథ్యంతో పాటు పగళ్లు కురచగానూ, రాత్రులు దీర్ఘంగానూ ఉండే రోజులకు రాజకీయ రూపకాలంకారంగా ఉపయోగపడడం కూడా దక్షిణాయన్ అనే పేరు ఆయన్ని ప్రభావితం చేసింది. చెప్పవచ్చిందేమిటంటే భారత్ జోడో యాత్ర ఆ విధంగా భారత్‌కు ఒక దక్షిణాయన్ సమయం. దీర్ఘ రాత్రులు, కురచ పగళ్లు కావూ ఇవి? వెలుగుదారి దక్షిణాపథమే, సందేహం లేదు. మనం దక్షిణ భారతావని స్ఫూర్తిని ఆవాహన చేసుకోవాలి. సంక్షోభంలో పడిన మన సమున్నత ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యాన్ని కాపాడు కోవడానికి దక్షిణ భారతావని ఒక నిండు ఆశాభావాన్ని, స్ఫూర్తిదాయక భావజాల వనరులను కల్పిస్తోంది.


నడుస్తున్న భారతదేశ చరిత్రలో దక్షిణ భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, దాని అనుబంధ సంస్థల సాంస్కృతిక దాడికి అది సాపేక్షంగా లోబడకపోవడమే కాదు ఆ విశిష్టత. సంఘ్ పరివార్ రాజకీయ విభాగమైన భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో అధికారాన్ని స్వాధీనం చేసుకుంది; తెలంగాణలో నిర్ణయాత్మకంగా ముందంజవేస్తోంది. కేరళలో ఆరెస్సెస్ తన ఉనికిని దృఢపరచుకుంది. అయినా బీజేపీ ప్రవచిస్తున్న జాతీయవాదం, ఉత్తరాది, పశ్చిమ భారత రాష్ట్రాలలో వలే దక్షిణాది రాష్ట్రాలలో ఆధిపత్యం సాధించలేకపోయింది. కేరళ, తమిళనాడులలో పార్టీ వ్యవస్థల ప్రత్యేకతే అందుకు కారణంగా చెప్పవచ్చు. ఆ ప్రత్యేకతలు మరెక్కడా సంతరించుకోలేనివి.


దక్షిణాది రాష్ట్రాలకు నిస్సందేహంగా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అవి కేవలం పాలనా రంగానికి మాత్రమే పరిమితమైనవి కావు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రయాణించే వారు ప్రభుత్వాల పనితీరు, రెస్టారెంట్ల నిర్వహణ మొదలైన వ్యవహారాలు వింధ్యపర్వతాలకు దక్షిణం వైపున మాత్రమే మెరుగ్గా ఉన్నాయనే వాస్తవాన్ని సులభంగా గుర్తించగలుగుతారు. త్వరలో ప్రచురితమవనున్న తన కొత్త పుస్తకం ‘సౌత్ వెర్సెస్ నార్త్: ఇండియాస్ గ్రేట్ డివైడ్’లో ఉత్తర–దక్షిణ భారత రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలను ఆర్ఎస్ నీలకంఠన్ చాలా శక్తిమంతంగా విపులీకరించారు. ఆర్థిక, ఆరోగ్య, విద్యా రంగాలకు సంబంధించిన గణాంకాలను ఒక్క క్షణం చూసినా నీలకంఠన్ వివరించిన వ్యత్యాసాలు ఇట్టే స్పష్టమవుతాయి. విద్య, ఆరోగ్య భద్రతలో దక్షిణాది రాష్ట్రాల బాలలే ఉత్తర భారతావని బాలల కంటే అన్ని విధాల మెరుగ్గా ఉన్నారని ఆయన సహేతుకంగా నిరూపించారు. మరి దక్షిణాది రాష్ట్రాల వారు ఉత్తరాది రాష్ట్రాల వారికంటే అన్ని రంగాలలో ముందంజలో ఉన్నారంటే ఆశ్చర్యమేముంది?


అక్షరాస్యత సాధనలో కేరళ ఒక ఆదర్శప్రాయ మార్గదర్శిగా ఉన్నది; సాహిత్య రంగంలో కన్నడ ప్రభ దేదీప్యమానంగా వెలుగుతోంది; సంక్షేమ పథకాలను ఎలా అమలుపరచాలో తమిళనాడు నుంచే నేర్చుకోవాల్సి ఉంది; సేంద్రియ వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ పథ నిర్ణేతగా ఉంది. ఇక పరిపాలనా వ్యవహారాలలో, ఉత్తర, పశ్చిమ, ఈశాన్య భారత రాష్ట్రాలు దక్షిణాది నుంచి నేర్చుకోవల్సింది చాలా చాలా ఉంది. పాలనా రంగంలో దక్షిణాది రాష్ట్రాల విజయాలు అసాధారణమైనవి. అయితే కన్యాకుమారిలో భారత్ జోడో యాత్ర ప్రారంభమైన రోజున ఆ అంశమేమీ నా ఆలోచనల్లో లేదు. నా దక్షిణాయన్, భావజాల ఉద్యమానికి సంబంధించినది. తమిళ గడ్డపైన నేను నిలబడ్డ ఆ సమయంలో ద్రావిడ ఉద్యమం, దాని సైద్ధాంతిక వారసత్వం నా మనస్సును ఆవహించాయి. ఇరవయ్యో శతాబ్దిలో ద్రావిడ ఉద్యమాన్ని ఒక సమస్యగా లేదా ప్రబల, ప్రభావశీల భారతీయ జాతీయ వాదానికి ఒక సవాల్‌గా చూడడం జరిగింది. అయితే వర్తమాన భారతదేశంలో జాతీయవాదాన్ని పునర్ నిర్వచించి, భారత గణతంత్ర రాజ్యాన్ని కాపాడగల శక్తి ఆ ద్రావిడ రాజకీయ స్రవంతికి ఉన్నదనడంలో సందేహం లేదు. ప్రస్తుతం మెజారిటేరియన్ జాతీయవాదం దండయాత్ర అప్రతిహతంగా సాగుతోంది. దానిని ప్రతిఘటించి తీరాలి. అందుకు మనం ద్రావిడియన్ రాజకీయాల మూడు మూల భావాలు అయిన ప్రాంతీయవాదం, హేతువాదం, సామాజిక న్యాయంను ఆలంబన చేసుకుని తీరాలి.


అయితే ఆ మూడు స్ఫూర్తిదాయక భావాలను వాటి పాత సూత్రీకరణలతో మన ప్రస్తుత పరిస్థితులకు అనువర్తింప చేసుకోలేము. అలా చేసుకోకూడదు కూడా. ప్రాంతీయవాదం భావాన్ని తమిళ ఈలం లేదా సాంస్కృతిక ఆధిక్యతా భావనల నుంచి వేరు చేయాల్సి ఉంది. అలా చేసినప్పుడు మాత్రమే తమిళ జాతీయ వాదం భారతదేశాన్ని నిజమైన సమాఖ్య ప్రాతిపదికలతో పునర్ నిర్వచించగలుగుతుంది. తద్వారా ఏక కేంద్రక రాజ్య వ్యవస్థను నెలకొల్పేందుకు భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శ్రేణులు చేస్తున్న ప్రయత్నాలను విజయవంతంగా ప్రతిఘటించగలుగుతుంది. ఇది సుసాధ్యం కావాలంటే మన ఆలోచనలు కొత్త రీతుల్లో సాగాలి. ఆ ప్రకారం భారత సమాఖ్య అనేది మన సమాజంలోని అన్ని వైవిధ్యాలను సజాతీయం చేసే ఒక జాతి–రాజ్యం (నేషన్–స్టేట్) గా కాకుండా, సామాజిక, సాంస్కృతిక వైవిధ్యాలు అన్నిటినీ గుర్తించి, గౌరవించే ఒక రాజ్య–జాతి (స్టేట్–నేషన్)గా ఉండి తీరాలి.


అలాగే సామాజిక న్యాయ సాధన పోరాటం కేవలం బ్రాహ్మణవాద వ్యతిరేక రాజకీయాలకు మాత్రమే పరిమితం కాకూడదు. యాదృచ్ఛిక పుట్టుక ఆధారిత అసమానతలు, కొత్త సమాజాన్ని ఆ శ్రేణీ వ్యవస్థకు నకలుగా సృష్టించడం వల్ల సమసిపోవు. కుల వ్యవస్థను మొత్తంగా నిర్మూలించినప్పుడు మాత్రమే ఆ అసమానతలు అంతమవుతాయి. జెండర్‌తో సహా ఇతర కులయేతర అసమానతలను నిర్మూలించేం దుకు దృఢ సంకల్పంతో పటిష్ఠ కార్యాచరణకు తప్పక పూనుకోవల్సి ఉంది. ద్రావిడ ఉద్యమ హేతువాదాన్ని మత వ్యతిరేకతా సిద్ధాంతంగా కాకుండా అన్నిరకాల అంధ విశ్వాసాలు, అణచివేత, మతం పేరిట జరుగుతోన్న హింసాకాండకు సూత్రబద్ధ వ్యతిరేకతగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకు జరూరుగా అవసరమైన కొత్త లౌకికవాదానికి ఈ నవ భావనా సరళి మాత్రమే పటిష్ఠ పునాదులను నిర్మించగలుగుతుంది.


భారతదేశ పటానికి సదృశమైనది, భిన్నమైనది తొలి దక్షిణాసియా పత్రిక ‘హిమాల్ సౌత్ ఆసియా’ ప్రచురించిన దక్షిణాసియా చిత్రపటం. ఈ వినూత్న దక్షిణాసియా చిత్రపటంలో శ్రీలంక అగ్ర భాగంలో ఉంటుంది. దక్షిణాసియా దేశాలను సమాంతరంగా చూపించిన చిత్రపటమది. ఇప్పుడు భారత్ గురించిన మన దార్శనికతను అలా మార్చుకోవాల్సి ఉంది. భారత్ జోడో యాత్ర ప్రారంభం అది సాధ్యమయ్యేందుకు ఒక ఆస్కారాన్ని కల్పించింది.


యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

Updated Date - 2022-09-16T06:34:30+05:30 IST