భారతీయులందరినీ క్షేమంగా తీసుకొస్తాం: మోదీ

ABN , First Publish Date - 2022-02-28T12:54:34+05:30 IST

కష్టకాలంలో భారతీయుల ప్రాణాలు కాపాడేందుకే అత్యధిక ప్రాధాన్యమిస్తామని ప్రధాని మోదీ చెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారత పౌరులందరినీ వెన క్కి రప్పించేందుకు తమ

భారతీయులందరినీ క్షేమంగా తీసుకొస్తాం: మోదీ

బస్తి, ఫిబ్రవరి 27: కష్టకాలంలో భారతీయుల ప్రాణాలు కాపాడేందుకే అత్యధిక ప్రాధాన్యమిస్తామని ప్రధాని మోదీ చెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారత పౌరులందరినీ వెన క్కి రప్పించేందుకు తమ ప్రభుత్వం నిరంతరాయంగా పనిచేస్తోందన్నారు. యూపీలోని బస్తిలో ఆదివారం ఆయన బీజేపీ ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అలజడిని ప్రస్తావిస్తూ.. దేశం స్వయం సమృద్ధి(ఆత్మనిర్భర్‌) చెందాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. యూపీ ఎన్నికలను కుటుంబ పాలకులకు, దేశ భక్తులకు మధ్య జరుగుతున్న పోరుగా అభివర్ణించారు. దేశ భక్తికి, కుటుంబ భక్తికి మధ్య చాలా తేడా ఉంటుందని విపక్షాలపై విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై వైమానిక దాడులు జరిపి మూడేళ్లు అవుతోందని, ప్రజలంతా మన సైనికుల తెగువకు జేజేలు కొడుతుంటే కుటుంబ పాలకులు మాత్రం ఆ దాడులకు ఆధారాలు అడుగుతున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ ప్రత్యర్థులు తన చావు కోసం ప్రార్థనలు చేశారని ప్రధాని మోదీ ఆరోపించారు.  


ఉక్రెయిన్‌పై మోదీ ఉన్నత స్థాయి సమీక్ష

పెద్దసంఖ్యలో భారతీయులు ముఖ్యంగా విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన నేపథ్యంలో.. అక్కడి పరిస్థితులపై ప్రధాని మోదీ ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విదేశాంగ మంత్రి జైశంకర్‌, పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రచారం నుంచి ఢిల్లీ వచ్చిన వెంటనే మోదీ ఈ సమీక్ష చేపట్టారు.



Updated Date - 2022-02-28T12:54:34+05:30 IST