దేశ రక్షణలో వివేక భ్రష్టత్వం

ABN , First Publish Date - 2022-06-25T09:07:34+05:30 IST

ఇరవయో శతాబ్ది ప్రపంచ యుద్ధాల కాలంలో అమెరికా అంతటా ఒక ఆకర్షణీయమైన పోస్టర్ (ప్రకటన చిత్రం) ప్రదర్శితమయింది.

దేశ రక్షణలో వివేక భ్రష్టత్వం

ఇరవయో శతాబ్ది ప్రపంచ యుద్ధాల కాలంలో అమెరికా అంతటా ఒక ఆకర్షణీయమైన పోస్టర్ (ప్రకటన చిత్రం) ప్రదర్శితమయింది. అందులో దేశ భక్తులకు పిలుపునిస్తున్న అంకుల్ శామ్ (అమెరికాకు మూర్తీభవించిన ప్రతీక) బొమ్మ అందరినీ ఆకట్టుకునే విధంగా ఉండేది. ఆయనిచ్చిన పిలుపు ఏమిటి? ‘అమెరికా సైన్యానికి నిన్ను కోరుతున్నాను’, వేలాది అమెరికన్ యువకులు ఆ పిలుపునకు మహోత్సాహంగా ప్రతిస్పందించారు. భారత రక్షణదళాలకు సైనికులను సమీకరించేందుకై ప్రవేశపెట్టిన కొత్త పథకానికి విశేష ప్రాచుర్యం కల్పించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా అటువంటి పోస్టర్‌ నొకదాన్ని రూపొందించి ఉపయోగించుకొని ఉండాల్సింది. కాకపోతే అంకుల్ శామ్ పిలుపుతో పాటు మరో వ్యాఖ్యను కూడా జోడించవలసిన అవసరముందేది– చిన్న అక్షరాలలో ‘ఒక దర్జీ, రజకుడు, క్షురకుడు అయ్యేందుకు’ అని.


నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ పథకం సామాన్యమైనది. వాస్తవానికి అది ఒక అతి మామూలు పథకం. త్రివిధ సాయుధ బలగాలలో ఏటా 46 వేల మంది సైనికులను చేర్చుకునేందుకు ఉద్దేశించిన పథకమది. వారికి ఆరు నెలల పాటు శిక్షణ ఇస్తారు. 42 నెలల పాటు ఆ అగ్నివీరులు దేశ రక్షణలో భాగస్వాములవుతారు. అగ్నిపథ్ ఆలోచన ఎవరిదైనా దేశ యువజనులపై దానిని రుద్దారు. ఇదే కదా 2014 నుంచీ ఈ ప్రభుత్వం పనిచేస్తున్న తీరు! నోట్ల రద్దు, రాఫెల్ ఒప్పందం, భూ స్వాధీన చట్టానికి సవరణలు, మూడు సాగు చట్టాలు మొదలైనవి ఆ పాలనకు కొన్ని పాత ఉదాహరణలు. ఊహించిన విధంగానే అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. రెగ్యులర్ రిక్రూట్‌మెంట్‌కు అన్ని విధాల శిక్షణ పొందిన యువకులు తీవ్ర ఆశాభంగానికి గురయ్యారు. తొలుత కొవిడ్ కారణంగా వరుసగా రెండు సంవత్సరాలపాటు ఆ రిక్రూట్‌మెంట్‌ను వాయిదా వేశారు. తీరా ఇప్పుడు అగ్నిపథ్ రూపంలో వారి ఆశలకు భంగం! మరి వారు ఆందోళనకు దిగడంలో ఆశ్చర్యమేముంది? వారిలో అత్యధికుల వయసు 21 సంవత్సరాలకు మించిపోయింది. అగ్నిపథ్ పథకంలో వయోపరిమితి గడువు 21 ఏళ్లే. నిరసనలు ప్రజా ఆస్తులను ధ్వంసించిన అనంతరం ప్రభుత్వం మేల్కొంది. పథకంలో మార్పులను ఒక్కొక్కటిగా ప్రకటించసాగింది. ఇవన్నీ ముందుగా నిర్ణయించినవేనని నిస్సిగ్గుగా ప్రకటించుకుంది. అయితే ఈ మార్పులలో ఏ ఒక్కటీ, అగ్నిపథ్ పట్ల ఆక్షేపణలను తొలగించే విధంగా లేదు!


ఆ ఆక్షేపణలు ఏమిటి? మొదటిది సమయం. అగ్నిపథ్‌ను ప్రవేశపెట్టేందుకు ఇది సరైన సమయమేనా? దేశ సరిహద్దుల్లో పరిస్థితులు సర్వత్రా అపాయకరంగా ఉన్నాయి చైనా ఆకస్మిక దాడులు, పాకిస్థాన్ చొరబాట్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంటికి పై కప్పు ఎండ కాస్తున్నప్పుడే వేసుకోవాలి కానీ కుండపోత వర్షంలో కాదుకదా. అగ్నివీరులకు ఇచ్చే శిక్షణ సమగ్రమైనది, నాణ్యమైనది కాదు కనుక వారిని యుద్ధ రంగంలో మోహరించలేము అనేది రెండో విమర్శ. కొత్తగా చేర్చుకున్న సైనికుడికి ఐదారు సంవత్సరాలు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని అడ్మిరల్ అరుణ్ ప్రకాష్ పేర్కొన్నారు. దీనికి తోడు వర్తమాన నావికా, వైమానిక దళాలు అంతకంతకూ అత్యాధునిక సాంకేతికతలతో పని చేస్తున్నాయి. ఏ నావికుడికీ, వైమానికుడికీ ఆరు నెలల శిక్షణ ఏ మాత్రం సరిపోదు. అగ్నిపథ్ పథకం పూర్తిస్థాయిలో అమలయినప్పుడు బ్రహ్మోస్, పినాక, వజ్ర ఆయుధ వ్యవస్థలను ఉపయోగించలేని సైనికులతో భారత సైన్యం నిండిపోతుందని శతఘ్నిదళం డైరెక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేసిన లెఫ్టినెంట్ జనరల్ పిఆర్ శంకర్ అన్నారు. నవీన సాంకేతికతల పరిజ్ఞానం లేని సైన్యం కిండర్ గార్టెన్ ఆర్మీ మాత్రమే అని ఆయన చమత్కరించారు.


పోరాడే సైనికుడు తాను సభ్యుడుగా ఉన్న దళం గురించి గర్వించాలని, ప్రాణాపాయ సాహసాలకు వెనుకాడకూడదని, సంక్షోభ పరిస్థితుల్లో నాయకత్వాన్ని ప్రదర్శించాలని పలువురు ప్రముఖ సైనికాధికారులు నొక్కి చెప్పారు. ఆరు నెలల శిక్షణ కాలంలోనే ఇటువంటి సమున్నత లక్షణాలను అలవరచుకోవడం సాధ్యమవుతుందా? ఒక పోలీస్ కానిస్టేబుల్‌కు ఇచ్చే శిక్షణా వ్యవధే ఆరునెలలకు పైగా ఉంటున్నప్పుడు సైనికులకు అంతతక్కువ వ్యవధిలో సమగ్ర, పటిష్ఠ శిక్షణ ఇవ్వడం ఎలా సాధ్యమవుతుందనేది మూడో ఆక్షేపణ.


రక్షణ దళాలలో, ముఖ్యంగా సైన్యంలో సమున్నత సంప్రదాయాలు, విలువలు ఉన్నాయి. ఒక సైనికుడు తన దేశం కోసం, తన సహచరుల కోసం చనిపోయేందుకు సంసిద్ధమవ్వాలి. సైనిక పటాలాల వ్యవస్థ కాలం చెల్లినదికావచ్చుగానీ ప్రపంచంలో అత్యుత్తమ పోరాట శక్తిగా భారత సైన్యాన్ని నిలిపింది అదే వ్యవస్థ అనే వాస్తవాన్ని విస్మరించకూడదని పలువురు అన్నారు. నాలుగేళ్ల సర్వీసు కాలం ముగిసిన తరువాత తమకు సమస్యలు అనివార్యమని అగ్నివీరులకు బాగా తెలుసు. ఆర్థిక అభద్రతతో పాటు కనీసం మాజీ సైనికుడు అనే హోదా కూడా వారికి లభించదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో నాలుగేళ్ల సర్వీసుకాలంలో అగ్నివీరుల మధ్య సన్నిహిత స్నేహం నెలకొంటుందా? కేవలం స్పర్ధించే వారుగా మాత్రమే ఉంటారా? అటువంటి సైనికులు త్యాగాలు ఎలా చేయగలుగుతారు? తమ విధ్యుక్త ధర్మాన్ని ఎలా నిర్వర్తించగలుగుతారు? మాజీ సైనికుల పెన్షన్ బిల్లు అంతకంతకూ పెరిగిపోతోంది. నిజానికి అదొక సమస్య. ప్రభుత్వంపై చాలా పెద్ద ఆర్థికభారం మోపుతుంది. అయినంత మాత్రాన అగ్నిపథ్ లాంటి పథకాలను ప్రవేశపెట్టడం ఎంతవరకు సమంజసం? అగ్నిపథ్ నమూనాను ఇజ్రాయిల్‌ అమలుపరిచిందన్న వాదన సమంజసమైనది కాదు. అదొక చిన్నదేశం. జనాభా తక్కువ. నిరుద్యోగం లేని దేశం. యువత నిర్దిష్టకాలం సైన్యంలో ఉండి తీరడం తప్పనిసరి. అదలా ఉంచితే అగ్నిపథ్‌ను ప్రయోగాత్మక పథకంగా ఎందుకు ప్రవేశపెట్టలేదు? త్రివిధ దళాలకు సైనిక సమీకరణకు అగ్నిపథ్‌ను ఏకైక నమూనాగా ఎందుకు అమలుపరుస్తున్నారు? ఎంతో మంది ఈ ప్రశ్నలను లేవనెత్తిన తరువాతనే సైనిక దళాల ఉప ప్రధానాధికారి జనరల్ రాజు ఇప్పుడు ‘అగ్నిపథ్ ప్రయోగాత్మక పథకం మాత్రమేనని, నాలుగైదు సంవత్సరాల తరువాత దానిలో మార్పులు చేస్తామని ప్రకటించారు!


సరైన శిక్షణ లేని, సమున్నత పోరాట ప్రేరణ లేని, చాల వరకు కాంట్రాక్ట్ సైనికులు అయిన అగ్నివీరుల వల్ల దేశ భద్రతకు ప్రమాదమేర్పడదా? అగ్నిపథ్ పట్ల ఇదొక మౌలిక ఆక్షేపణ. ప్రభుత్వం నుంచి దీనికి సరైన సమాధానం లభించడం లేదు. ఆ పథకంలో ఆ మార్పులు, ఈ మార్పులు అంటూ ప్రకటనలు చేస్తోందిగానీ అవి ఎవరినీ సంతృప్తిపరచడం లేదు. నాలుగేళ్ల సర్వీస్ అనంతరం బయటికొచ్చిన అగ్నివీరులకు రక్షణ రంగానికి సంబంధించిన వివిధ సంస్థలలో పది శాతం ఉద్యోగాలను రిజర్వ్ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. నిజమేమిటి? మాజీ సైనికుల పునరావాస విభాగం డైరెక్టర్ జనరల్ మూడురోజుల క్రితం ఏమి చెప్పారో చూడండి: ‘మాజీ సైనికులకు గ్రూప్ సి ఉద్యోగాలలో 10 నుంచి 14.5 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. గ్రూప్ డి ఉద్యోగాల్లో 20 నుంచి 24.5 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. అయితే మాజీ సైనికులు గ్రూప్ సి ఉద్యోగాలలో కేవలం 1.29 శాతం లేదా అంత కంటే తక్కువగా మాత్రమే ఉద్యోగాలు పొందగలుగుతున్నారు. అలాగే గ్రూప్ డి ఉద్యోగాలలో 2.66 శాతం లేదా అంతకంటే తక్కువగా మాత్రమే పొందగలుగుతున్నారు’. 


రక్షణ దళాలకు సైనికుల సమీకరణలో మార్పులు అవసరమయితే వాటిని ప్రవేశపెట్టేందుకు సరైన మార్గం ప్రస్తుత పద్ధతుల మంచి చెడ్డలపై ఒక సమగ్ర నివేదికను రూపొందించి, ప్రజలకు నివేదించమే. అందులో సమస్యలకు ప్రత్యామ్నాయ పరిష్కారాలను సూచించాలి. పార్లమెంటరీ స్థాయీ సంఘంలో వాటిపై పర్యాలోచన చేయాలి. ఉభయ సభలలో చర్చించాలి. ఆ తరువాత లోపభూయిష్టమైన అగ్నిపథ్‌ను రద్దు చేసి కొత్త పథకాన్ని రూపొందించాలి.



పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

Updated Date - 2022-06-25T09:07:34+05:30 IST