రైతుల సమస్యలపై స్పందన లేని మోదీ సర్కార్: సోనియా

Dec 8 2021 @ 15:04PM

న్యూఢిల్లీ: రైతుల అంశాలపై మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తప్పుపట్టారు. రైతు సమస్యలు, సామాన్య ప్రజల విషయంలో ఎలాంటి స్పందన లేని రీతిలో కేంద్రం వ్యవహరిస్తోందని అన్నారు. బుధవారంనాడు జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియాగాంధీ మాట్లాడుతూ, మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది పాటు సాగించిన నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన రైతుల త్యాగాలను గుర్తించాలని ఎంపీలను కోరారు. 


''సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిపిన ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన 700 మంది త్యాగాలను గౌరవిద్దాం. రైతులు, సామాన్య ప్రజానీకం సమస్యలపై మోదీ ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకుండా వ్యవహరిస్తోంది. పెరుగుతున్న నిత్యావసరాల ధరల ప్రభావం ప్రతి కుటుంటం బడ్జెట్‌పై పెనుభారం చూపుతోంది'' అని సోనియాగాంధీ అన్నారు. కనీస మద్దతు ధరకు (ఎంఎస్‌పీ) చట్టపరమైన హామీ ఇవ్వాలని, మరణించిన రైతులకు పరిహారం ఇవ్వాలని రైతులు చేస్తున్న డిమాండ్‌కు కాంగ్రెస్ బాసటగా నిలుస్తుందని చెప్పారు. వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై పార్లమెంటులో చర్చకు తమ పార్టీ పట్టుబడుతుందని తెలిపారు.

ఎంపీల సస్పెన్షన్‌పై...

రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీలను సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సోనియాగాంధీ విమర్శించారు. ఇది అనుచితమైన చర్య అని అన్నారు. రాజ్యాంగం, నిబంధలను ఇది పూర్తిగా విరుద్ధమని అన్నారు. దేశ సరిహద్దుల్లో పరిస్థితి, పొరుగుదేశాలతో సంబంధాలపై పార్లమెంటులో పూర్తి స్థాయి చర్చ జరగాలని కూడా సోనియా గాంధీ అన్నారు. నాగాలాండ్‌లో సైన్యం కాల్పుల్లో అమాయక పౌరులు మరణించడంపై మాట్లాడుతూ, ఈ ఘటనపై ప్రభుత్వ స్పందన అంతంతమాత్రంగానే ఉందని, ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

దీనికి ముందు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం రైతుల అంశాలపై మోదీ సర్కార్‌ను తప్పుపట్టారు. రైతు నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నష్టపరిహారం కానీ, ఉద్యోగాలు కానీ ఇవ్వకపోవడం, కేసులు ఉపసంహరించక పోవడం చాలా పెద్ద తప్పిదాలని అన్నారు. రైతు నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన రైతుల జాబితాను కూడా లోక్‌సభకు రాహుల్ సమర్పించారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
digitalsales[email protected]
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.