వెంకయ్యను విస్మరించిన మోదీ

ABN , First Publish Date - 2022-06-22T08:18:07+05:30 IST

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ప్రధాని మోదీ నుంచి మరోసారి ప్రతికూలత ఎదురైంది.

వెంకయ్యను విస్మరించిన మోదీ

రాష్ట్రపతి పదవికి దూరం పెట్టిన ప్రధాని

తన టీమ్‌ను నిర్మించుకునేందుకే ప్రాధాన్యం!

తొలినుంచీ మోదీకి అండగా ఉన్న వెంకయ్య

ప్రధాని అభ్యర్థిగా ఎంపికలోనూ మద్దతు

అయినా.. వెంకయ్యకు దక్కని అవకాశం


న్యూఢిల్లీ, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ప్రధాని మోదీ నుంచి మరోసారి ప్రతికూలత ఎదురైంది. ఏబీవీపీ కార్యకర్తగా మొదలుపెట్టి.. జనసంఘ్‌, భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం నుంచి సుదీర్ఘకాలం ఆ పార్టీ బాధ్యతలు నిర్వహించిన వెంకయ్యను రాష్ట్రపతి పదవి విషయంలో మోదీ విస్మరించారు. ఎల్‌కే ఆడ్వాణీని, ఆయన టీమ్‌ను పక్కన పెడుతూ, తన సొంత టీమ్‌ను నిర్మించుకుంటూ వస్తున్న మోదీ.. వెంకయ్యను కూడా పక్కన పెట్టారు. నిజానికి వెంకయ్య ఉపరాష్ట్రపతి పదవి చేపట్టేందుకు నిరాకరించినప్పుడు కూడా మోదీ ఆయనపై ఒత్తిడి తెచ్చారు. మొదటినుంచీ మోదీకి వెంకయ్య అండగా ఉన్నా ఆయనను దూరంగా ఉంచేందుకే మోదీ ప్రయత్నించారు. ఒకప్పుడు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీని ఆ పదవి నుంచి తొలగించాలని నాటి ప్రధాని వాజపేయి పట్టుబట్టగా, ఆడ్వాణీ టీమ్‌లో భాగంగా వెంకయ్య.. మోదీకి అండగా నిలిచారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా మోదీని సమర్థించారు. 2014లో మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా నిలబెట్టాలని సంఘ్‌ నిర్ణయించినప్పుడు కూడా ఆడ్వాణీకి వెంకయ్య నచ్చజెప్పారు. ఆ తరువాత మోదీ తొలి క్యాబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన వెంకయ్య.. మోదీ విధానాలను సమర్థించారు. అనంతరం ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్‌గా కూడా మోదీ ప్రభుత్వ మనోభావాలకు అనుగుణంగా నడుచుకున్నారు. ఇటీవల మోదీపై వెలువడిన పుస్తకాన్ని వెంకయ్యే ఆవిష్కరించారు. కాగా మంగళవారం వెంకయ్యను కలుసుకునేందుకు వచ్చిన కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా బృందం.. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తున్న విషయాన్ని ఆయనకు కనీసం చెప్పలేదు. 

Updated Date - 2022-06-22T08:18:07+05:30 IST