రైతు బాంధవుడు మోదీ

ABN , First Publish Date - 2020-10-09T06:00:40+05:30 IST

డెబ్భై నాలుగు సంవత్సరాల స్వతంత్ర భార‌తంలో 2014 నుంచి 2020 వ‌ర‌కు మోదీ తీసుకు వచ్చిన వ్యవసాయ సంస్కరణలే ఆ రంగానికి...

రైతు బాంధవుడు మోదీ

డెబ్భై నాలుగు సంవత్సరాల స్వతంత్ర భార‌తంలో 2014 నుంచి 2020 వ‌ర‌కు మోదీ తీసుకు వచ్చిన వ్యవసాయ సంస్కరణలే ఆ రంగానికి అపూర్వమైన జవజీవాలను అందించే సత్తా కలిగిఉన్నాయి. ఇటీవల కేంద్రప్రభుత్వం తీసుకువ‌చ్చిన మూడు నూత‌న బిల్లులు రైతుల సంక్షేమానికి రక్షణ కవచంలా‌ పని చేస్తాయి. ఈ బిల్లులపై ప్రతిప‌క్షాలు నిర్ధారిత‌మైన ప్రశ్నలేవీ లేవ‌నెత్తకుండానే నిర‌స‌న వెలిబుచ్చటం ఒక ఆత్మవంచన. సోనియా నాయ‌క‌త్వంలోని జాతీయాభివృద్ధి మండ‌లిలో స‌భ్యుడైన స్వామినాథన్ 2006లో సమర్పించిన వివేదికను 2014 వ‌ర‌కు కోల్డ్ స్టోరేజ్‍లో పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆయన సిఫార‌సుల గురించి మాట్లాడ‌టం సిగ్గుచేటు. కాంగ్రెస్ ప్రభుత్వాలు, ప్రాంతీయ పార్టీలు ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల‌లో మార్కెట్ కమిటీల పాల‌క‌మండ‌ళ్ళు అవినీతిని, వ్యాపారస్థుల దోపిడీని నియంత్రించడ‌లో విఫ‌లమవుతున్నాయి.


సమాఖ్య స్ఫూర్తి అంటే రాష్ట్రాల‌కు సార్వభౌమాధికారం ఉన్నట్టు కాదు. కుటుంబాలు న‌డిపే ప్రాంతీయ పార్టీలు సొంత ఎస్టేట్లుగా వేర్పాటువాద దృక్పథంతో వ్యవహరించటం, సున్నిత‌మైన అంశాల‌పై ప్రజలను రెచ్చగొట్టడం స‌మాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు. కేంద్ర ప్రభుత్వ ప‌థ‌కాల‌ను నీరుగార్చటం, వాటిని రాష్ట్రప్రభుత్వ ప‌థ‌కాలుగా ప్రచారం చేసుకోడం రాజకీయ దివాళాకోరుత‌నం. కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీలు కూడా రాజకీయ పార్టీలే. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల‌లో బ‌ల‌ప‌డాల‌ని ఆకాంక్షించే హ‌క్కు వాటికుంటుంది. కేంద్రప్రభుత్వం వ్యవసాయ సంస్కరణల్లో భాగంగా మూడు నూతన చ‌ట్టాలను, ఒక చ‌ట్ట స‌వ‌ర‌ణను తీసుకువ‌చ్చింది. వీటిల్లో మొద‌టిది: వ్యవసాయ ఉత్పత్తి, వ్యాపారం, వాణిజ్యం. దీని ప్రకారం రైతు పండించిన పంట వ్యవసాయ మార్కెట్లలో అమ్ముకోవ‌చ్చు లేదా మార్కెట్ బ‌య‌ట దేశంలో ఎక్కడైనా ఎవ‌రికైనా అమ్ముకోవ‌చ్చు. రైతులు మార్కెట్ బ‌య‌ట అమ్ముకోవటానికే ఈ చ‌ట్టం వ‌ర్తిస్తుంది. రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్లపై ఏ ఆంక్షలూ లేవు. 


 తెలంగాణలోని వ్యవసాయ మార్కెట్లలో రైతుల‌కు ఏమాత్రం రక్షణ లేదు. ఏ ధాన్యాన్ని అయినా, మార్కెట్టులోని వ్యాపారస్థులు సంఘ‌టిత‌మై వారే క‌నిష్ఠ, గరిష్ఠ ధరలను నిర్ణయించి కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్టులో ఎల‌క్ట్రానిక్ తూకం యంత్రాలు ఉన్నా వాటి కొలతల్లో మార్పు చేసుకుంటూ తూకంలో మోసం చేస్తున్నారు. నమూనాల పేరుతో కిలోల‌కు కిలోలు తీసి రైతులకు న‌ష్టం కలిగిస్తున్నారు. క‌మిష‌న్ ఏజెంట్లు చ‌ట్టం నిర్ధారించిన రేటు గాక ఇష్టానుసారం అద‌న‌పు క‌మీష‌న్ తీసుకుంటున్నారు. తేమ పేరుతో రేటు త‌గ్గించ‌డం మరో దోపిడీ. రైతుల వ‌ద్ద మార్కెట్ ఫీజు వ‌సూలు చేసి ప్రభుత్వానికి కట్టకుండా ఎగవేస్తున్నారు. ప్రభుత్వం, పాలకవర్గాలు ఈ దోపిడీవ‌ర్గాల‌కు కొమ్ము కాస్తున్నాయి. ఇలాంటికి కాకుండా ఇంకా చిన్నచిన్న మోసాలు అనేకం ఉన్నాయి. రైతు మార్కెట్లో తప్పనిసరై అమ్ముకుని రావల‌సి వస్తున్నది. ఖ‌మ్మం మిర్చి మార్కెట్‌లో గొడవ‌; వ‌రంగ‌ల్, ఆదిలాబాద్, నిజ‌మాబాద్ మార్కెట్లలో పత్తి తదితర పంట‌ల ధరల విషయంలో గొడ‌వ‌లు ఈ కోవ‌కు చెందిన‌వే. మార్కెట్టులో సరైన ధ‌ర లభించకపోతే రైతులు తమ ఉత్పతుల్ని గోడౌన్లో నిల్వ చేసుకుని, రేటు వ‌చ్చిన‌ప్పుడు అమ్ముకునే వెసులుబాటును తెలంగాణ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. రైతులు మార్కెట్ బ‌య‌ట అమ్ముకుంటే వీరంద‌రి ఆదాయం పోతుంద‌ని, వారి వారి ఆర్థిక, రాజ‌కీయ ప్రయోజనాలు దెబ్బతింటాయని చట్ట సభలలో అల‌జ‌డి సృష్టించారు. నిజానికి ఈ పరిస్థితులను నిశితంగా గమనించిన మీదటే, రైతులకు స్వేచ్ఛా మార్కెట్ పద్ధతి లాభదాయకమని గ్రహించి, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ చరిత్రాత్మక చట్టాన్ని తెచ్చింది. మోదీ ప్రభుత్వం 2014-–2020 మధ్య వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణల వ‌ల‌న రైతుల ఆత్మహత్యలు త‌గ్గుముఖం పడుతున్నట్టు నేష‌న‌ల్ రిజిస్టర్ క్రైమ్ బ్యూరో రికార్డు తెలియపరుస్తోంది. ఇలాంటి గొప్ప సంస్కరణలను త‌మ రాజ‌కీయ అవ‌సరం కోసం వాడుకోవడం ప్రతిపక్షాల నైతిక ప‌త‌నానికి నిదర్శనం.

న‌ర‌హ‌రి వేణుగోపాల్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయ‌కులు

Updated Date - 2020-10-09T06:00:40+05:30 IST