రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్న మోదీ

ABN , First Publish Date - 2022-08-09T05:55:27+05:30 IST

ఆజాది కాఅమృత్‌ మహోత్సవం పేరిట దేశంలో స్వాతంత్య్ర ఉత్సవాలు నిర్వహిస్తున్న మోదీ అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నారని దళిత్‌ పోషణ్‌ ముక్తి మంచ్‌ జాతీయ కార్యదర్శి రాఘవులు విమర్శించారు.

రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్న మోదీ

 దళిత్‌ పోషణ్‌ ముక్తి మంచ్‌  జాతీయ కార్యదర్శి రాఘవులు


 సంగారెడ్డిరూరల్‌, ఆగస్టు 8: ఆజాది కాఅమృత్‌ మహోత్సవం పేరిట దేశంలో స్వాతంత్య్ర ఉత్సవాలు నిర్వహిస్తున్న మోదీ అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నారని దళిత్‌ పోషణ్‌ ముక్తి మంచ్‌ జాతీయ కార్యదర్శి రాఘవులు విమర్శించారు. సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని ఓ గార్డెన్‌లో సోమవారం నిర్వహించిన కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి(కేవీపీఎస్‌) రాష్ట్ర మూడో మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తొలుత మహానీయుల చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం రాఘవులు మాట్లాడుతూ దేశంలో దళితులు, కార్మికులు, రైతుల హక్కులను కాలరాస్తూ ఆజాదికా అమృత్‌ మహోత్సవం నిర్వహించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వం దళితులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు చేసే వారిపై చర్యలు తీసుకోకుండా పైశాచికానందాన్ని పొందుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ, సంఘ్‌ పరివార్‌ శక్తుల నుంచి దేశాన్ని రక్షించుకునేందుకు స్వాతంత్య్ర పోరాటాల స్ఫూర్తితో ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. 


నీల్‌, లాల్‌ కలిస్తేనే మార్పు

 నీల్‌, లాల్‌ కలిస్తేనే సమాజంలో సమూల మార్పులు వస్తాయని ప్రముఖ అంబేడ్కరిస్టు జేబి.రాజు అన్నారు. దేశంలో దళిత, బహుజనులు సృష్టిస్తున్న సంపదను విదేశీ కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అన్నివర్గాల ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మహాసభలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌,  కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు, టీపీఎస్కే రాష్ట్ర నాయకుడు రాములు, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధర్మానాయక్‌, ఎస్‌ఎఫ్‌ ఐ, డీవైఎ్‌ఫఐ రాష్ట్ర కార్యదర్శులు నాగరాజు, వెంకటేశం పాల్గొన్నారు.

Updated Date - 2022-08-09T05:55:27+05:30 IST