ధాన్యంపై మోదీ, కేసీఆర్‌వి నాటకాలు

ABN , First Publish Date - 2021-11-26T08:30:11+05:30 IST

రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనకుండా రాష్ట్రంలో కేసీఆర్‌, కేంద్రంలో మోదీ దొంగ నాటకాలు ఆడుతూ, అన్నదాతల జీవితాలతో చెలగాటమాడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ మండిపడ్డారు.

ధాన్యంపై మోదీ, కేసీఆర్‌వి నాటకాలు

  • రేపు, ఎల్లుండి ఇందిరాపార్కు వద్ద వరి దీక్ష: రేవంత్‌
  • కాంగ్రెస్‌లో చేరిన టీఆర్‌ఎస్‌ ఎన్నారై సెల్‌
  • అమెరికా విభాగం అధ్యక్షుడు అభిలాశ్‌ రావ్‌
  • కరీంనగర్‌ మాజీ మేయర్‌ రవీందర్‌ రాజీనామా
  • ఉద్యమకారులను అవమానిస్తున్నారని కేసీఆర్‌కు లేఖ
  • పాలమూరు ద్రోహి కేసీఆర్‌: రేవంత్‌ రెడ్డి


హైదరాబాద్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనకుండా రాష్ట్రంలో కేసీఆర్‌, కేంద్రంలో మోదీ దొంగ నాటకాలు ఆడుతూ, అన్నదాతల జీవితాలతో చెలగాటమాడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ మండిపడ్డారు. కొల్లాపూర్‌ నియోజకవర్గ నాయకులు, టీఆర్‌ఎస్‌ ఎన్నారై సెల్‌ అమెరికా విభాగం అధ్యక్షుడు అభిలాశ్‌ రావ్‌ తన అనుచరులతో కలిసి గురువారం గాంధీ భవన్‌లో కాంగ్రె్‌సలో చేరారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడారు. ‘‘పాలమూరు అత్యంత వెనకబడిన జిల్లా. కొల్లాపూర్‌ అత్యంత నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గం. అక్కడి ప్రజలకు తాగు నీరు, రైతులకు సాగు నీరు ఇవ్వరు. భూ నిర్వాసితులందరకీ ఉద్యోగాలిస్తానని కేసీఆర్‌ మోసం చేశాడు. పాలమూరు ద్రోహి కేసీఆర్‌. ఆయనకు ఓటు అడిగే హక్కు లేదు. పాలమూరు ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్‌ జెండా ఎగరేస్తాం. ఒక్క కొల్లాపూర్‌నే కాదు 14 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలను కాంగ్రెస్‌ దత్తత తీసుకుంటుంది. పాలమూరు జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత నాది’’ అని రేవంత్‌ అన్నారు. 


నోట్ల కట్టలు లేనిదే నిరంజన్‌రెడ్డి పనిచేయడు

గుడిని, గుడిలోని లింగాన్ని దోచేవాడు మంత్రి నిరంజన్‌ రెడ్డి అని రేవంత్‌ ధ్వజమెత్తారు. నోట్ల కట్టలు లేనిదే ఆయన ఏ పనీ చేయడని ఎద్దేవా చేశారు. కృష్ణా పుష్కరాల్లో వేసిన సీసీ రోడ్లలోనూ కమీషన్లు తీసుకున్నాడని విమర్శించారు. ‘‘వరి రైతులకి ఉరి అని కేసీఆర్‌ అంటున్నాడు. టీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి రైతులకు ద్రోహం చేస్తున్నాయి. రైతులను చంపడానికి కలిసి పని చేస్తున్నాయి. తెలంగాణ, రైతు ద్రోహి కేసీఆర్‌.. ఆయన రెండోసారి సీఎం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 67 వేల మంది రైతులు చనిపోయారు. ఢిల్లీలో చనిపోయిన రైతులకు కేసీఆర్‌ రూ.3 లక్షలు ఇస్తాడట, ఇక్కడ చనిపోయిన లక్ష మంది రైతులకు ఎందుకు ఇవ్వడు..? ఇదేం న్యాయం..? ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి ఏం తెచ్చాడో చెప్పాలి..? 27, 28 తేదీల్లో ఇందిరాపార్కు వద్ద వరి రైతుల కోసం రెండు రోజులు దీక్ష చేస్తాం’’ అని రేవంత్‌ పేర్కొన్నారు. కాంగ్రె్‌సలో చేరిన అభిలాశ్‌ రావ్‌ మాట్లాడుతూ ప్రాణం పోయేవరకు కాంగ్రెస్‌లోనే ఉంటానని పేర్కొన్నారు.


సీఎం సారూ.. కొవిడ్‌ పరిహారం ఎప్పుడు?

కొవిడ్‌తో మరణించినవారి కుటుంబాలకు పరిహారం ఎప్పుడు ఇస్తారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. కొవిడ్‌ బారినపడి ఎంతోమంది జీవితాలు, ఆస్తులు పోగొట్టుకున్నారన్నారు. కొవిడ్‌తో మరణించినవారి కుటుంబాలకు రూ.4లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని విజ్ణప్తి చేశారు. ఈ మేరకు సీఎంకు భట్టి లేఖ రాశారు. రూ.4లక్షల పరిహారం ఇచ్చే పరిస్థితి లేదంటూ కేంద్రం వాదించడం సరైంది కాదన్నారు.  

Updated Date - 2021-11-26T08:30:11+05:30 IST