5G spectrum auction : మోదీ కేబినెట్ భారీ నిర్ణయం

ABN , First Publish Date - 2022-06-15T18:36:23+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేబినెట్ సమావేశం

5G spectrum auction : మోదీ కేబినెట్ భారీ నిర్ణయం

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేబినెట్ సమావేశం 5జీ స్పెక్ట్రమ్ వేలానికి అనుమతిస్తూ భారీ నిర్ణయం తీసుకుంది. జూలై నెలాఖరునాటికి దీనిని వేలం వేస్తారు. 20 ఏళ్ళ చెల్లుబాటు కాల పరిమితితో 72 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ను వేలం వేస్తారు. ఇది 4జీ కన్నా 10 రెట్ల వేగంతో పని చేస్తుంది. త్వరలోనే 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 


ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, 5G spectrum వేలానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. 72 GHz స్పెక్ట్రమ్‌ను 20 ఏళ్ళపాటు చెల్లుబాటయ్యే విధంగా వేలం వేస్తారు. ప్రభుత్వం డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి విధానపరమైన నిర్ణయాలను అమలు చేస్తుండటంతో డిజిటల్ అనుసంధానం చాలా ముఖ్యమైనదిగా మారింది. 


లో ఫ్రీక్వెన్సీ, మిడ్ ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లలో స్పెక్ట్రమ్ వేలం జరుగుతుంది. 600 MHz (మెగాహెర్ట్జ్), 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHzలను లో ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ అంటారు. 3,300 MHzను మిడ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ అంటారు. 26 GHzను హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్ అంటారు. 5 G Technology ఆధారిత సేవలను అందజేయడం కోసం మిడ్, హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నట్లు ప్రభుత్వ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుత 4G సర్వీసుల ద్వారా సాధ్యమవుతున్న దాని కన్నా 10 రెట్లు ఎక్కువ వేగం, సామర్థ్యంతో సేవలందించడానికి ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. 


ప్రజల నిత్య జీవితంలో బ్రాడ్‌బ్యాండ్, మరీ ముఖ్యంగా మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ అంతర్భాగంగా మారిపోయిందని పేర్కొన్నారు. 2015 నుంచి దేశవ్యాప్తంగా 4జీ సేవలను అత్యంత వేగంగా విస్తరించడంతో దీనికి మరింత ఊపు వచ్చిందని తెలిపారు. 2014లో 10 కోట్ల మంది బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రైబర్లు ఉండేవారని, నేడు ఆ సంఖ్య 80 కోట్ల మందికి పెరిగిందని తెలిపారు. 


ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నవతరం వ్యాపారాలు లబ్ధి పొందబోతున్నట్లు విశ్లేషకులు చెప్తున్నారు. వ్యాపార సంస్థలు అదనపు ఆదాయాన్ని పొందడానికి ఈ చర్యలు దోహదపడతాయంటున్నారు. 


గత ఏడాది సెప్టెంబరులో ప్రకటించిన టెలికాం రంగ సంస్కరణలు ఈ వేలానికి ప్రయోజనకరంగా ఉంటాయని భావిస్తున్నారు. ఒక వార్షిక వాయిదాకు సమానమైన బ్యాంకు గ్యారంటీని సమర్పించాలనే నిబంధనను కూడా తొలగించారు. ఆటోమోటివ్, హెల్త్‌కేర్, వ్యవసాయం, ఇంధనం తదితర రంగాల్లో  యంత్రం నుంచి యంత్రానికి కమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కృత్రిమ మేధాశక్తి వంటి ఇండస్ట్రీ 4.0 అప్లికేషన్స్‌లో నవ కల్పనల ప్రభంజనం పుంజుకుంటుందని ప్రభుత్వం ఆశిస్తోంది. దీని కోసం ప్రైవేట్ కేప్టివ్ నెట్‌వర్క్‌ల ఏర్పాటు, అభివృద్ధిని ప్రోత్సహించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించినట్లు ప్రభుత్వ ప్రకటన పేర్కొంది. 


కొద్ది నెలల క్రితం ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఈ దశాబ్దం చివరినాటికి 6జీ సేవలను ప్రారంభించాలని ప్రణాళిక రచించినట్లు చెప్పారు. దీని కోసం ఏర్పాటు చేసిన  టాస్క్‌ఫోర్స్ తన పనిని ప్రారంభించిందని తెలిపారు. 


Updated Date - 2022-06-15T18:36:23+05:30 IST