టెక్స్‌టైల్స్ రంగంలో వినూత్న మార్పులు తెచ్చిన మోదీ ప్రభుత్వం : బీజేపీ

ABN , First Publish Date - 2021-12-31T22:34:51+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం

టెక్స్‌టైల్స్ రంగంలో వినూత్న మార్పులు తెచ్చిన మోదీ ప్రభుత్వం : బీజేపీ

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలతో టెక్స్‌టైల్స్ రంగంలో మార్పులు తీసుకొస్తోందని బీజేపీ తెలిపింది. సమర్థ్ పథకం ద్వారా యువతకు సరికొత్త అవకాశాలను అందుబాటులోకి తెస్తోందని పేర్కొంది. స్టార్టప్ ఇండియా పథకం క్రింద ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తోందని తెలిపింది. ఎగుమతుల లక్ష్యాన్ని సాధించడంలో మెరుగైన స్థితిలో ఉన్నట్లు వెల్లడించింది. భారత్‌ను పెట్టుబడుల గమ్య స్థానంగా నిలిపినట్లు తెలిపింది. 


బీజేపీ ట్విటర్ వేదికగా తెలిపిన వివరాల ప్రకారం, మన దేశంలో టెక్స్‌టైల్ రంగాన్ని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సమూలంగా సంస్కరిస్తోంది. రూ.4,445 కోట్ల వ్యయంతో 7 పీఎం మిత్ర (ప్రధాన మంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ అండ్ అపారెల్) పార్కులను ఏర్పాటు చేస్తోంది. వీటిలో ఒక్కొక్క పార్కు వల్ల ప్రత్యక్షంగా 1 లక్ష మందికి, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం క్రింద ఐదేళ్ళపాటు రూ.10,683 కోట్ల మేరకు ప్రోత్సాహకాలను అందిస్తారు. 


టెక్స్‌టైల్ రంగంలో నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. SAMARTH పథకం క్రింద సంప్రదాయ రంగంలో కళాకారులు, వృత్తి పనివారికి నైపుణ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తోంది. ఈ రంగంలో 3.45 లక్షల మంది యువతకు లబ్ధి చేకూర్చడమే ఈ పథకం లక్ష్యం. 


స్టార్టప్ ఇండియా స్కీమ్‌లో భాగంగా ఎంటర్‌ప్రెన్యూవర్‌షిప్‌ను విప్లవాత్మకం చేస్తోంది. ప్రస్తుతం 60 వేలకుపైగా గుర్తింపు పొందిన స్టార్టప్‌లు పని చేస్తున్నాయి. వీటిలో 45 శాతం స్టార్టప్‌లు మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటయ్యాయి. అత్యధిక స్టార్టప్ కంపెనీలు ఉన్న దేశాల జాబితాలో ప్రపంచంలో మూడో స్థానంలో భారత దేశం నిలిచింది. 


అదేవిధంగా ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటి నుంచి భారత దేశాన్ని పెట్టుబడుల గమ్య స్థానంగా తీర్చిదిద్దినట్లు బీజేపీ తెలిపింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)లు పెట్టేవారు అత్యధిక ప్రాధాన్యమిచ్చే దేశాల్లో ఒకటిగా భారత దేశాన్ని నిలిపినట్లు తెలిపింది. 2014-15తో పోల్చితే 2020-21లో వచ్చిన ఎఫ్‌డీఐలలో 80 శాతం పెరుగుదల నమోదైందని పేర్కొంది. 2014-15లో 45.15 బిలియన్ డాలర్లు ఎఫ్‌డీఐలు రాగా, 2020-21లో 81.97 బిలియన్ డాలర్లు వచ్చినట్లు తెలిపింది.


2021-22 ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు చేయాలనేది లక్ష్యం కాగా, 2021 నవంబరునాటికి 263 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు జరిగాయని తెలిపింది. ఈ లక్ష్యాన్ని చేరుకునే దిశగా కృషి జరుగుతున్నట్లు వివరించింది. 


Updated Date - 2021-12-31T22:34:51+05:30 IST