5 అసెంబ్లీ ఎన్నికల ముందు మోదీ కీలక నిర్ణయం!

ABN , First Publish Date - 2021-07-02T03:37:23+05:30 IST

బిహార్ నుంచి కేబినెట్‌కు అధిక ప్రాతినిధ్యమే రానుంది. బిహార్ మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుంటారని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విస్తరణలో ఆయనకి చోటు దక్కొచ్చని అంటున్నారు

5 అసెంబ్లీ ఎన్నికల ముందు మోదీ కీలక నిర్ణయం!

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల (ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్) అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోదీ కీలక అడుగులు వేస్తున్నారు. ఇందులో ప్రధానంగా వినిపిస్తున్నది కేంద్ర కేబినెట్ విస్తరణ. తొందరలోనే కేంద్ర కేబినెట్‌ను విస్తరించున్నారట. 2019 సాధారణ ఎన్నికల్లో విజయం అనంతరం ఏర్పడిన కేబినెట్‌లో ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు చేయలేదు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా లబ్ది పొందే విధంగా బీజేపీ వ్యూహాలు పన్నుతోంది. మరోసారి తన కుర్చీని నిలబెట్టుకునే విధంగా మోదీ ఎత్తులు వేస్తున్నట్లు, దానికి అనుగుణంగానే మోదీ తన కేబినెట్ విస్తరణ చేపట్టనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కేంద్ర కేబినెట్ సంఖ్య 81. అయితే ప్రస్తుతం మోదీ కేబినెట్‌లో 53 మంది మాత్రమే ఉన్నారు. దీంతో మిగతా 28 మందిని త్వరలోనే భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది.


మధ్యప్రదేశ్‌లో తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చిన జ్యోతిరాదిత్య సింథియాకు తన కుర్చీని కాంగ్రెస్ నుంచి వచ్చిన హిమంత్ బిశ్వా శర్మకు వదులుకున్న అస్సాం మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌లకు ఈ విస్తరణలో ప్రముఖ స్థానం కల్పించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాల వారీగా చూసుకుంటే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నారట. దేశంలో కీలక రాష్ట్రంగా ఉండడం, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతుండడం, బీజేపీకి రాజకీయంగా ఉత్తరప్రదేశ్‌ను ఎక్కువ ప్రాతినిధ్యం ఉండడం ఉత్తరప్రదేశ్‌‌కు కలిసి వస్తున్న అంశాలని తెలుస్తోంది.


బిహార్ నుంచి కేబినెట్‌కు అధిక ప్రాతినిధ్యమే రానుంది. బిహార్ మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుంటారని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విస్తరణలో ఆయనకి చోటు దక్కొచ్చని అంటున్నారు. ఇక ఎల్‌జేపీ నుంచి కూడా ఒకరికి అవకాశం ఇవ్వనున్నారట. ఎల్‌జేపీ మాజీ అధినేత రాం విలాశ్ పాశ్వాన్ మరణంతో కేంద్ర కేబినెట్‌లో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అయితే చిరాగ్ పాశ్వాన్‌కు అవకాశం కల్పిస్తారా లేదంటే రాం విలాస్ తమ్ముడు పశుపతి పారస్‌కు అవకాశం కల్పిస్తారా అనేది చూడాలి. ఇక 2019 ఒకే మంత్రి పదవి రావడంలో కేంద్ర కేబినెట్‌లో చేరకుండా అలకపూని.. చాలా కాలానికి ఒప్పుకున్న నితీష్ కుమార్ పార్టీ జేడీయూకి కూడా అవకాశం దక్కనున్నట్లు సమాచారం.


ఇక మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు సముచిత స్థానమే ఇవ్వనున్నారని తెలుస్తోంది. గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో తమ ప్రాతినిధ్యాన్ని కాపాడుకోవడంతో పాటు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో బీజేపీకి మరింత బలాన్ని ఇచ్చేందుకు తాజా విస్తరణలో ఆయా రాష్ట్రాల వారికి అవకాశం కల్పించనున్నారు. అయితే ఈ తాజా విస్తరణలో దక్షిణాదికి పెద్దగా ప్రాధాన్యత దక్కపోవచ్చని తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నికలు లేకపోవడం ఒక కారణమైతే, ఇక్కడ బీజేపీకి పట్టు ఉండకపోవడం వల్ల కేబినెట్ విస్తరణలో దక్షిణాదికి ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చనే విశ్లేషణలు వస్తున్నాయి.



Updated Date - 2021-07-02T03:37:23+05:30 IST