మరో ‘సామూహిక’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన Modi

ABN , First Publish Date - 2021-07-25T18:09:55+05:30 IST

ఒలంపిక్స్ క్రీడాకారులకు మద్దతుగా ఇప్పటికే ప్రారంభమైన ‘విక్టరీ పంచ్ క్యాంపెయిన్’ ను మరింత ముందుకు తీసుకెళ్లాలని

మరో ‘సామూహిక’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన Modi

న్యూఢిల్లీ : ఒలంపిక్స్ క్రీడాకారులకు మద్దతుగా ఇప్పటికే ప్రారంభమైన ‘విక్టరీ పంచ్ క్యాంపెయిన్’ ను మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఆటగాళ్లకు మద్దతుగా సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ క్యాంపెయిన్ ప్రారంభమైందని, అందరూ తమ తమ టీమ్‌తో మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఆటగాళ్లందరూ చాలా కష్టపడి టోక్యోకు చేరుకున్నారని, ప్రజలు తెలిసో, తెలియకో వారిపై ఎలాంటి ఒత్తిళ్లూ చేయకూడదని మోదీ కోరారు. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా మోదీ ఆదివారం ప్రసంగించారు. సోమవారం ‘కార్గిల్ విజయ దివస్’ ను జరుపుకుంటున్నామని, 1999 లో మన దేశం కోసం సర్వస్వాన్ని అర్పించిన జవాన్లకు నివాళులు అర్పించాలని విజ్ఞప్తి చేశారు. కార్గిల్ యుద్ధం దేశ సాయుధ దళాల శౌర్యానికి, క్రమశిక్షణకు చిహ్నమని పేర్కొన్నారు. 

‘అమృత్ మహోత్సవ్’ గురించి....

రాబోయే ఆగస్టు 15 చాలా స్పెషల్ అని మోదీ పేర్కొన్నారు.  75 వ స్వాతంత్య్ర దినోత్సవంలోకి అడుగిడబోతున్నామని, అందుకే ఇది చాలా ప్రత్యేకమని, అలాగే ‘అమృత్ మహోత్సవ్’ కూడా నిర్వహిస్తున్నామని అన్నారు. అమృత్ మహోత్సవ కార్యక్రమం ప్రభుత్వానిది కాదని, 130 కోట్ల మంది భారతీయు మనోభావాలకు సంబంధించినదని అన్నారు. ఈ కార్యక్రమం ఆధారంగా మహా పురుషులందర్నీ గుర్తు చేసుకుంటున్నామని అన్నారు. అయితే ఆగస్టు 15న ఓ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. జాతీయ గీతాన్ని సాధ్యమైనంత ఎక్కువ మంది కలిసి పాడే బృహత్ కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నామని ప్రకటించారు. దీని కోసం ఓ వెబ్‌సైట్ కూడా రూపొందించామని rashtragaan.in అనే వెబ్‌సైట్ రూపొందించామని పేర్కొన్నారు. సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలాపించి, ఆ రికార్డును ఈ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయాలని మోదీ పిలుపునిచ్చారు. 

భయం వీడి... వ్యాక్సిన్ తీసుకోండి....

దేశ ప్రజలందరూ భయాన్ని వీడి, వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావాలని మోదీ మన్ కీ బాత్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ‘‘దయచేసి భయాన్ని వీడండి. వ్యాక్సిన్ తీసుకోండి. కొందరికి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత జ్వరం వచ్చింది. కానీ ఇది చాలా చిన్నది. కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. వ్యాక్సిన్‌ను నిరాకరించడం చాలా అపాయం. వ్యక్తిగతంగానూ క్షేమం కాదు. సమాజపరంగా కూడా క్షేమం కాదు.. దయచేసి అందరూ వ్యాక్సిన్ తీసుకోండి’’ అని మోదీ విజ్ఞప్తి చేశారు. 


Updated Date - 2021-07-25T18:09:55+05:30 IST