మోదీ అంటే కేసీఆర్‌కు వణుకు

ABN , First Publish Date - 2022-05-22T09:27:57+05:30 IST

ప్రధాని మోదీ పేరు వింటేనే సీఎం కేసీఆర్‌ గజగజ వణికిపోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు.

మోదీ అంటే కేసీఆర్‌కు వణుకు


  • రాష్ట్రానికి ప్రధాని వస్తుంటే పారిపోతున్నరు
  • మీ తండ్రి మొదటి నుంచీ భూస్వామైతే 
  • పాస్‌పోర్టు బ్రోకర్‌ పనులు ఎందుకు చేశారు? 
  • కేటీఆర్‌కు బండి సంజయ్‌ సూటి ప్రశ్న
  • కేసీఆర్‌కూ బాబుకు పట్టిన గతే: ఈటల 


హైదరాబాద్‌, మంచిర్యాల, మే 21 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ పేరు వింటేనే సీఎం కేసీఆర్‌ గజగజ వణికిపోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. ప్రధాని రాష్ట్ర పర్యటనకు వస్తున్నట్లు తెలిసినా మొహం చెల్లక ఇతర రాష్ట్రాలకు పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఈనెల 26న ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పార్టీ తరపున ఘన స్వాగతం పలికేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై రాష్ట్ర పార్టీ కార్యాలయంలో శనివారం సంజయ్‌.. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్వాకంతో ఆత్మహత్య చేసుకున్న రైతులు, విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు, నిరుద్యోగుల కుటుంబాలకు సాయం చేయని కేసీఆర్‌, ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు సాయం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ‘ప్రధానికి కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం పలుకుదాం. మోదీ అంటే కేసీఆర్‌కు భయం పట్టుకుంది. ఆయన పేరు వింటేనే వణికిపోతున్నరు. సమతామూర్తి విగ్రహావిష్కరణకు ప్రధాని వచ్చినప్పుడూ కేసీఆర్‌ మొహం చాటేసిండ్రు. ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారు.. ఇదంతా డ్రామా.. ప్రజల దృష్టి మళ్లించేందుకు, ప్రచారం కోసం ఇతర రాష్ట్రాల్లో రైతులకు సాయం చేస్తున్నట్లు పోజులిస్తున్నరు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా అమిత్‌ షా సభ సక్సెస్‌ కావడంతో కేసీఆర్‌, కేటీఆర్‌లు మతి తప్పి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నరు. 


నిజంగా మొదటి నుంచీ కేసీఆర్‌ భూస్వామి అయితే పాస్‌పోర్టు బ్రోకర్‌ పనులు ఎందుకు చేశారో కేటీఆర్‌ చెప్పాలి. కేసీఆర్‌ చరిత్ర భవిష్యత్తు నాయకులకు గుణపాఠం కావాలి. అందుకే బీజేపీ అధికారంలోకి రాగానే ఆయన నీచమైన చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలియజేస్తం’ అని సంజయ్‌ ప్రకటించారు. ప్రధాని మోదీని ఇష్టం వచ్చినట్లు తిట్టిన సీఎం కేసీఆర్‌.. తన స్థాయిని మించి మాట్లాడినట్లుగా అర్థం చేసుకున్నారని, అందుకే రాష్ట్రానికి వస్తున్న ప్రధానిని ఫేస్‌ చేయలేకనే ఆయన దేశ పర్యటనకు వెళ్లారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సమస్యలను గాలికి వదిలేసిన కేసీఆర్‌.. నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచారన్నారు. గతంలో ఎన్టీర్‌, చంద్రబాబులకు పట్టన గతే ఆయనకూ పడుతుందన్నారు. రైతు ప్రభుత్వమని చెప్పుకొనే కేసీఆర్‌ సర్కార్‌ చేతల్లో మాత్రం అందుకు విరుద్ధంగా ఉందని బీజేపీ నేత విజయశాంతి ట్విటర్‌ వేదికగా శనివారం విమర్శలు గుప్పించారు. మంచిర్యాల జిల్లా లో అధికార పార్టీ నాయకులు, వారి బంధువులు, అనుచరులు నకిలీ విత్తనాలతో రైతులను ముంచుతున్నారని ధ్వజమెత్తారు. భీమిని, నెన్నెల మండలాల్లో నకిలీ పత్తి విత్తనాల దందా జోరుగా నడుస్తోందని ఫైర్‌ అయ్యారు. రైతులను నిండా ముంచుతున్న టీఆర్‌ఎస్‌ పార్టీకి రైతన్నలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని పేర్కొన్నారు. 

Updated Date - 2022-05-22T09:27:57+05:30 IST