కుటుంబ పార్టీలు మమ్మల్ని ఢీకొనలేవు

Published: Tue, 15 Feb 2022 01:30:23 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కుటుంబ పార్టీలు మమ్మల్ని ఢీకొనలేవు

టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, తృణమూల్‌లకు ప్రజాస్వామ్యమంటే కుటుంబ పాలనే

ప్రతిపక్షాలు ఏకమవడం సహజం.. గతంలోనూ ఇలాంటి ప్రయత్నాలు చేశారు

ప్రజలు తిప్పికొట్టారు.. రాష్ట్రాల పట్ల వివక్ష అన్నది పసలేని విమర్శ

రాష్ట్రాల అభివృద్ధికి ఏం చేయాలో తెలుసు.. రైతులకు ఎమ్మెస్పీ కొనసాగుతుంది

‘దైనిక్‌ జాగరణ్‌’ ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): కుటుంబ పార్టీలు బీజేపీతో పోటీ పడలేవని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. తాము చేస్తున్న అభివృద్ధి అన్ని అడ్డంకులను ఛేదిస్తుందని, కుల, మత జాతి వ్యత్యాసాలకు అతీతంగా ప్రజలు తమకు ఓటు వేసేందుకు తోడ్పడుతుందని చెప్పారు.  ప్రతిపక్షాలు ఏకం కావడం సహజమని, కానీ.. ఓటర్లు వాస్తవాలను గమనిస్తారని అన్నారు. కాంగ్రెస్‌, తృణమూల్‌, టీఆర్‌ఎస్‌ పార్టీలకు ప్రజాస్వామ్యమంటే ప్రజల ప్రభుత్వం కాదని, తమ కుటుంబ పాలన అన్నది వారి ఉద్దేశమని ఆరోపించారు. తమ స్వప్నాలు సాకారం కావాలని కోరుకుంటున్న యువత వారిని విశ్వసించబోరని తెలిపారు. గత ఎన్నికలకు ముందు కూడా వారు ఇలాంటి ప్రయత్నాలు చేశారని, మోదీ సర్కారు దిగిపోతుందని ప్రచారం చేశారని, కానీ.. ప్రజలు వారిని తిప్పికొట్టారని అన్నారు. సోమవారం ‘దైనిక్‌ జాగరణ్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై ప్రధాని మోదీ మాట్లాడారు. రాష్ట్రాల పట్ల తాము వివక్షతో వ్యవహరిస్తున్నామన్న విమర్శల్లో పస లేదన్నారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందనిదే దేశం అభివృద్ధి చెందబోదని, అందుకే సాధ్యమైనంత మేరకు రాష్ట్రాలను కలుపుకొని పోయేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా రాష్ట్రాల అభివృద్ధికి తానేమి చేయాలో తనకు తెలుసునన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన కింద ఇప్పటివరకు 90 శాతం గ్రామాలకు రహదారులు ఏర్పడ్డాయని తెలిపారు.  


నిజాయితీపరులకు తక్కువ పన్ను..

నిజాయితీతో పన్ను చెల్లించేవారి ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని ప్రధాని మోదీ అన్నారు. ఎనిమిదేళ్ల క్రితంతో పోలిస్తే నిజాయితీపరులు ఎంతో తక్కువ పన్ను చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. 2014లో రూ.5 లక్షల ఆదాయం ఉన్నవారు రూ. 13,000 పన్ను చెల్లించేవారని ఇప్పుడు వారు ఎలాంటి పన్నూ చెల్లించనవసరం లేదని అన్నారు.  రూ.15 లక్షల ఆదాయం ఉన్నవారు చెల్లించాల్సిన పన్ను రూ.66 వేలకు తగ్గిపోయిందని చెప్పారు.  ధరలు కూడా తాము అధికారంలోకి రాకముందు కంటే ఇప్పుడు ఎంతో తగ్గిపోయాయన్నారు. అప్పుడు ద్రవ్యోల్బణం పది శాతం ఉంటే ఇప్పుడు ఆరు శాతానికి పడిపోయిందన్నారు. అతి తక్కువ ధరలకు 36 కోట్ల ఎల్‌ఈడీ బల్బులు సరఫరా చేస్తే రూ.19 వేల కోట్లు ఆదా అయ్యాయని తెలిపారు. విమాన ప్రయాణ చార్జీలు తగ్గాయని, ఇంటర్నెట్‌ కూడా ఎంతో చౌకగా లభిస్తోందన్నారు. గతంలో ఒక్క జీబీకి రూ.250 ఖర్చయ్యేదని, కానీ ఇప్పుడు రూ.7 మాత్రమే చెల్లిస్తున్నామని చెప్పారు. ఇక వ్యవసాయ రంగానికి తాము ఎంత చేశామో రె ౖతులకు తెలుసునని, అందువల్ల ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లో రైతులు బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారని తెలిపారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసుల మేరకు రైతుల వ్య యానికి ఒకటిన్నర రెట్లు కనీస మద్ద తు ధర చెల్లిస్తున్నామన్నారు. కనీస మద్దతు ధరను ఉపసంహరించుకోబోమని స్పష్టం చేశారు. భూసార ఆరోగ్య కార్డు సహా అనేక పథకాలను తాము అమలు చేస్తున్నామని చెప్పారు.


ముస్లిం మహిళల మద్దతు మాకే: మోదీ

లఖ్‌నవ్‌/అక్బర్‌పూర్‌/జలంధర్‌: ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ముస్లిం మహిళలు బీజేపీకే మద్దతిస్తారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఒకప్పుడు ట్రిపుల్‌ తలాక్‌ పేరుతో ముస్లిం మహిళలను నిర్దాక్షిణ్యంగా పుట్టింటికి వెళ్లగొట్టేవారని, దీంతో వారు, వారి తల్లిదండ్రులు ఎంత వేదనకు గురయ్యేవారో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. ఏ క్షణంలో ట్రిపుల్‌ తలాక్‌కు గురి కావాల్సి వస్తుందోనన్న భయంతో మహిళలు బతకాల్సిన పరిస్థితులు ఉండేవన్నారు. దీనికి వ్యతిరేకంగా తాము తెచ్చిన చట్టం ద్వారా.. అటువంటి భయంకరమైన పరిస్థితుల నుంచి రక్షణ పొందే అవకాశం ముస్లిం సోదరీమణులకు లభించిందన్నారు. యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కాన్పూర్‌ దెహాత్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. గతంలో ముస్లిం ఆడబిడ్డలు పాఠశాలకు వెళ్లాలంటే ఆకతాయిల నుంచి ఎన్నో సమస్యలు ఎదుర్కొనేవారన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలను పటిష్ఠంగా అమలు చేయడంతో ఈ సమస్య తొలగిపోయిందని, ఆడబిడ్డల్లో ధైర్యం వచ్చిందని చెప్పారు. ఇక సమాజ్‌వాది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. ఆ పార్టీ నాయకత్వం రాష్ట్రాన్ని తమ కుటుంబసభ్యులు దోచుకునేందుకు ప్రాంతాల వారీగా అప్పగించేదని మోదీ ఆరోపించారు. గోవాలో హిందువుల ఓట్లను చీల్చేందుకే తృణమూల్‌ కాంగ్రెస్‌ పోటీ చేస్తోందని ఆ పార్టీ నేత చెప్పడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. హిందువుల ఓట్లు ఏకపక్షం కాకుండా చూసేందుకు గోవాలో తాము ఎంజీపీతో జత కట్టామన్న తృణమూల్‌ ఎంపీ మహౌత్‌ మోయిత్రా వ్యాఖ్యలను మోదీ గుర్తు చేశారు. మరోవైపు పంజాబ్‌లోని జలంధర్‌లోనూ ప్రధాని సోమవారం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈసారి పంజాబ్‌లో వచ్చేది బీజేపీ కూటమి ప్రభుత్వమేనని మోదీ ధీమా వ్యక్తం చేశారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.