టీకా సర్టిఫికెట్‌పై మోదీ ఫొటో

ABN , First Publish Date - 2021-03-02T07:08:26+05:30 IST

‘ఏం చేయాలో.. ఎప్పుడు చేయాలో.. ఎలా చేయాలో.. సర్‌ మోదీజీకి బాగా తెలుసు’’ ...సోమవారం దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ మొదలైన కొద్దిసేపటికే పుదుచ్చేరికి చెందిన ఒక వ్యక్తి చేసిన ఈ ట్వీట్‌ ఇప్పుడు బాగా వైరల్‌

టీకా సర్టిఫికెట్‌పై మోదీ ఫొటో

ఏ అంశాన్ని ఎలా వాడుకోవాలో ప్రధానికి బాగా తెలుసు!

పుదుచ్చేరివాసి వ్యంగ్యం.. విదేశాల్లో కేవలం టీకా వివరాలే


న్యూఢిల్లీ, మార్చి 1: ‘‘ఏం చేయాలో.. ఎప్పుడు చేయాలో.. ఎలా చేయాలో.. సర్‌ మోదీజీకి బాగా తెలుసు’’ ...సోమవారం దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ మొదలైన కొద్దిసేపటికే పుదుచ్చేరికి చెందిన ఒక వ్యక్తి చేసిన ఈ ట్వీట్‌ ఇప్పుడు బాగా వైరల్‌ అవుతోంది. ట్వీట్‌తోపాటు అతడు పోస్ట్‌ చేసిన వ్యాక్సినేషన్‌ సర్టిఫికెటే ఇందుకు కారణం. టీకా వేయించుకున్న ప్రతి ఒక్కరికీ... ఈ సర్టిఫికెట్‌ ఇస్తున్నారు. దానిపై లబ్ధిదారుల పేరు, ఇచ్చిన టీకా వివరాలు, రెండో డోసు తీసుకోవాల్సిన తేదీ, బ్యాచ్‌ నంబర్‌ తదితర వివరాలతోపాటు కింది భాగంలో ‘అందరం కలిసి కొవిడ్‌ను-19ను ఓడిద్దాం’ అనే సందేశం, దాని పక్కనే మోదీ ఫొటో ఉన్నాయి. ఇదే ఇప్పుడు తీవ్రస్థాయిలో చర్చకు దారితీసింది. ప్రపంచంలో 103 దేశాలు కరోనా టీకా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. వ్యాక్సినేషన్‌ను ఇలా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్న ఏకైక రాజకీయవేత్త నరేంద్రమోదీ మాత్రమేననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


చాలా మంది.. మన దేశంలో ఇస్తున్న వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ను, అమెరికా, ఇజ్రాయెల్‌, యూకే దేశాల కార్డులను సరిపోల్చుతూ ట్విటర్‌లో ఫొటోలు పెడుతున్నారు. ఆయా దేశాల కార్డులపై కేవలం టీకా, లబ్ధిదారుల వివరాలు మాత్రమే ఉండడం గమనార్హం. యూకే కార్డుపైన మాత్రం బ్రిటన్‌ రాణిని సూచించే విధంగా కిరీటం ఫొటో ఉండడం గమనార్హం. కరోనా టీకాను రాజకీయాలకు వాడుకోవడం మోదీకి, బీజేపీకి కొత్తకాదని.. బిహార్‌ ఎన్నికలకు ముందు ప్రచారంలో టీకానే ప్రధానంగా ప్రచారం చేయడం, బిహారీలకు ఉచితంగా ఇస్తామని వాగ్దానం చేయడం వంటి విషయాలను పలువురు నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు వ్యాక్సినేషన్‌ పత్రాలపై మోదీ ఫొటో ముద్రించడమంటే.. త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల ఓటర్లను ప్రలోభపెట్టడమేనని కాంగ్రెస్‌ పార్టీ మండిపడుతోంది.

Updated Date - 2021-03-02T07:08:26+05:30 IST