రాష్ట్ర ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాలి

ABN , First Publish Date - 2022-04-07T07:50:16+05:30 IST

ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా రాష్ట్రమంతటా నిరసనల హోరు కొనసాగింది.

రాష్ట్ర ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాలి

  • యాసంగి ధాన్యం కొంటామని ప్రకటించాలి
  • ధాన్యం కొనేదాకా కేంద్రాన్ని వదిలిపెట్టం.. 
  • హైవేల దిగ్బంధంలో మంత్రులు, పార్టీ నేతలు
  • రేపు మోదీ, కేంద్ర ప్రభుత్వ శవయాత్రలు: ఎర్రబెల్లి.. 
  • దిగ్బంధంతో ఇక్కట్లు పడిన ప్రజలు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా రాష్ట్రమంతటా నిరసనల హోరు కొనసాగింది. అధికార టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన జాతీయ రహదారుల దిగ్బంధనంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వరి కంకులు చేతపట్టి రహదారులపై బైఠాయించారు. ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పి, యాసంగి ధాన్యాన్ని కొంటామని ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. అన్ని రాష్ట్రాల్లో ధాన్యాన్ని కొని, తెలంగాణలో మాత్రం  ఎందుకు కొనరని ప్రశ్నించారు. కేంద్రం తెలంగాణపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. యాసంగి ధాన్యాన్ని పూర్తిగా కేంద్రమే కొనుగోలు చేయాలని, అప్పటి వరకు మోదీ సర్కారును  వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులు రహదారులను దిగ్బంధించడంతో గంటల తరబడి ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. హైదరాబాద్‌-విజయవాడ, హైదరాబాద్‌-బెంగళూరు, హైదరాబాద్‌-ముంబై తదితర రహదారుల్లో ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జాతీయ రహదారుల దిగ్బంధంతో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి.  


రేపు ఇళ్లపై నల్లజెండాలు: ఎర్రబెల్లి

కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను వ్యతిరేకించినందుకే తెలంగాణపై ప్రధాని మోదీ కక్ష గట్టారని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. జనగామ మండలంలోని యశ్వంతాపూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రా రైస్‌, బాయిల్డ్‌ రైస్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణను తొక్కేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. యాసంగి ధాన్యాన్ని కొనబోమని కేంద్రం చెబితే రైతులు వరి పంట వేయొద్దని సీఎం కేసీఆర్‌ ముందే విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు. బండి సంజయ్‌, కిషన్‌రెడ్డి మాత్రం రైతులను రెచ్చగొట్టి వరి పంట వేసేలా చేశారని మండిపడ్డారు. యాసంగి ధాన్యాన్ని పూర్తిగా కొనేదాకా కేంద్రాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ 8న అన్ని గ్రామాల్లో మోదీ, కేంద్ర ప్రభుత్వ శవయాత్రలు నిర్వహించాలని, ఇళ్లపై నల్లజెండాలు ఎగురవేయాలని పిలుపునిచ్చారు. 


కేంద్రాన్ని వదిలేది లేదు: శ్రీనివాస్‌గౌడ్‌

కేంద్ర ప్రభుత్వం వివక్షను వీడి తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివా్‌సగౌడ్‌ డిమాండ్‌ చేశారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై భూత్పూర్‌ వద్ద చేపట్టిన రహదారి దిగ్బంధన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.  మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. కేంద్రం ధాన్యం సేకరణలో తెలంగాణపై వివక్ష ప్రదర్శిస్తోందన్నారు. కేంద్ర పాలకులు అవహేళన చేస్తూ మాట్లాడడం సరికాదని హెచ్చరించారు.  


ధాన్యం కొనేదాక కొట్లాడతాం: అల్లోల

ధాన్యం కొనుగోలు చేసే వరకూ కేంద్ర ప్రభుత్వంపై కొట్లాడతామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ నిర్మల్‌ జిల్లాలోని 44వ జాతీయ రహదారిపై కడ్తాల్‌ జంక్షన్‌ వద్ద రైతులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల పక్షాన ధర్నా చేస్తున్న వారికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. బీజేపీ నేతలు జిల్లాలో తిరగకుండా రైతులు అడుగడుగునా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.  



గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడతాం: పల్లా

తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిసి విన్నవిస్తే రైతులను అవమానించేలా మాట్లాడారని రైతుబంధు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ధాన్యాన్ని కొనుగోలు చేసేవరకూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమిస్తామన్నారు. చౌటుప్పల్‌లో నిర్వహించిన రహదారి దిగ్బంధన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, టీఆర్‌ఎస్‌ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్‌ ఆధ్వర్యంలో నకిరేకల్‌ బైపా్‌సలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. కోదాడ మండల పరిధిలోని రామాపురం క్రాస్‌ రోడ్డులో ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య, శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈనేపథ్యంలో గరికపాడులోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద మూడు కి.మీల మేర వాహనాలు నిలిచిపోయాయి. 


ఎఫ్‌సీఐ ద్వారా వడ్లు కొనాల్సిందే..

తెలంగాణ రైతులు పండించిన వడ్లను ఎఫ్‌సీఐ ద్వారా కేంద్రం కొనాల్సిందేనని టీఆర్‌ఎస్‌ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ పెద్దఅంబర్‌పేట్‌ ఔటర్‌ రింగు రోడ్డు జంక్షన్‌లో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. సంగారెడ్డి జిల్లాలోని జాతీయ రహదారులను టీఆర్‌ఎస్‌ శ్రేణులు దిగ్బంధించాయి. ఈ నిరసనలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఆందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌, జహీరాబాద్‌ ఎమ్మెల్యే మాణిక్‌రావు పాల్గొన్నారు.

Updated Date - 2022-04-07T07:50:16+05:30 IST