మోదీగారూ మేల్కొంటే మంచిది

ABN , First Publish Date - 2020-02-19T06:02:59+05:30 IST

చలికాలపు మేఘాలను ఛేదించి సూర్యుడి వెచ్చటి కిరణాలు నేలను తాకుతున్నవేళ, చెట్లనుంచి బంధాలు తెంచుకుని ఆకులు నేలతల్లిని స్పృశిస్తున్న సమయంలో దేశ రాజకీయాలు కూడా పరివర్తనం చెందుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో...

మోదీగారూ మేల్కొంటే మంచిది

ప్రభుత్వానికి పదిహేను టెలికం కంపెనీలు లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రమ్ ఛార్జీల కింద రూ.1.47 లక్షల కోట్ల మేరకు  బకాయిలు ఉన్నా సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేంతవరకూ మోదీ సర్కార్ ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నది. మురికివాడలకు అడ్డంగా గోడలు కట్టడం ద్వారా పేదరికాన్ని కప్పిపుచ్చుకోవడం, నినాదప్రాయ ప్రకటనల ద్వారా ఆర్థిక వ్యవస్థ గురించి గొప్పలు చెప్పుకోవడం, భావోద్వేగాల ద్వారా ఓట్లను ఆశించడం మాని ఇప్పటికైనా వాస్తవిక దృక్పథంతో చర్యలు చేపట్టాలి. ఇందుకు మోదీ సర్కార్‌కు ఇంకా అవకాశం ఉన్నది.


చలికాలపు మేఘాలను ఛేదించి సూర్యుడి వెచ్చటి కిరణాలు నేలను తాకుతున్నవేళ, చెట్లనుంచి బంధాలు తెంచుకుని ఆకులు నేలతల్లిని స్పృశిస్తున్న సమయంలో దేశ రాజకీయాలు కూడా పరివర్తనం చెందుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఘోర పరాజయం చెందిన తర్వాత ఒక్కసారిగా రాజకీయ వాతావరణం సద్దుమణిగినట్లు కనపడుతోంది. అయినా ఒక ఓటమి కానీ, ఒక విజయం కానీ కాలాన్ని ఎప్పుడూ స్తంభింపచేయలేవు. ఢిల్లీ ఓటమి ప్రధానమంత్రి మోదీని నిర్ఘాంతపరిచి ఉండవచ్చు కాని నిర్వేదంలో మాత్రం ముంచలేదు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే యథాప్రకారం ఆయన తన ప్రతిష్ఠను పునరుద్ధరించుకునే చర్యలు చేపట్టారు. ‘టైమ్స్ నౌ’ ఛానెల్ నిర్వహించిన సదస్సులో మళ్లీ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధిస్తామంటూ చెప్పుకున్నారు. వారణాసి పర్యటనకు వెళ్లినప్పుడు తనను కూతురి వివాహానికి ఆహ్వానించిన ఒక రిక్షా కార్మికుడి ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపారు. జగద్గురు విశ్వారాధ్య గురుకుల్ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొని తెలుగు, కన్నడ, మరాఠీ, హిందీ భాషల్లో మాట్లాడారు. సరే, మరో వారం రోజుల్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత దేశంలో తొలిసారి పర్యటించడం, అందునా మోదీ స్వంత రాష్ట్రం గుజరాత్‌లో అడుగుపెట్టడం సహజంగానే భారత ప్రధానికి కొత్త ఉత్సాహాన్ని, సరికొత్త ప్రచారాన్నీ కల్పించే విషయమే.


ప్రచారార్భాటం వెనుక వైఫల్యాలను, పరాజయాలను కప్పిపుచ్చుకోవడం నేతలకు అలవాటే. ట్రంప్‌కు భారత పేదరికం కనిపించకుండా ఉండేందుకై అహ్మదాబాద్‌లోని మురికి వాడలు ఆయన దృష్టికి రాకుండా చేసేందుకు సంకల్పించారు. ఇందుకుగాను విమానాశ్రయం నుంచి ఇందిరా వంతెన వరకూ పెద్ద గోడ కట్టారని, ట్రంప్ ప్రసంగించే సర్దార్ వల్లభ్ భాయ్ స్టేడియం సమీపంలోని మురికివాడలో ఉంటున్న 45 కుటుంబాలను అక్కడి నుంచి తరలిస్తున్నారని పత్రికల్లో వార్తలు వచ్చాయి. ట్రంప్ దంపతులు సందర్శించనున్న ఆగ్రాలో కూడా పెద్ద ఎత్తున ప్రక్షాళన కార్యక్రమాలు సాగుతున్నాయి.


నిజానికి ప్రతి ఐదు సంవత్సరాలకూ ఒక సారైనా అమెరికా అధ్యక్షుడు భారత దేశానికి రావడంలో ప్రత్యేకత ఏమీ లేదు. కాని ఆ అధ్యక్షుడు ఏమి మాట్లాడతారు, అమెరికాతో భారత్ కుదుర్చుకునే ఒప్పందాలు ఏమిటి అన్న విషయంపైనే అందరూ ఆసక్తి చూపడం కద్దు. ఢిల్లీ ఎన్నికల ఫలితాల షాక్ నుంచి బిజెపి నేతలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపథ్యంలో ట్రంప్ మన దేశానికి రావడం మోదీకి ఎంత మేరకు ఊరట కలిగిస్తుందో ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే సరిగ్గా ఐదేళ్ళ క్రితం గణతంత్ర దినోత్సవానికి అతిథిగా వచ్చిన అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పట్ల కూడా మోదీ అత్యంత ప్రేమ ఒలకబోశారు. స్వయంగా చాయ్ అందించారు. బాల్య స్నేహితుడి మాదిరి ‘బరాక్‌, బరాక్‌’ అంటూ ఆత్మీయ పిలుపుతో అలరించారు. అయితేనేం, ‘భారత దేశంలో పెరుగుతున్న మతపరమైన అసహన సంఘటనలు మహాత్మాగాంధీని కూడా దిగ్ర్భాంతి కలిగించేవ’ని ఒబామా చివరకు ఘాటుగా స్పందించారు. పైగా ఒబామా మన దేశానికి వచ్చిన నేపథ్యంలో పాకిస్థాన్‌తో చర్చించాలన్న ఒత్తిడి రావడం ఆశ్చర్యకరం. అలా ఒత్తిడి వచ్చిన వెంటనే మోదీ, అప్పటి పాక్ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌తో మాట్లాడారు. ప్రపంచ క్రికెట్‌ కప్‌ సాకుతో పాక్‌తో పాటు సార్క్‌ దేశాధినేతలకు శుభాకాంక్షలు తెలిపారు.


చర్చలకు అప్పటి భారత విదేశాంగ కార్యదర్శి జైశంకర్‌ను ఇస్లామాబాద్‌కు పంపాలని నిర్ణయించారు. ఇది నాటకీయ పరిణామమని వేరే చెప్పనక్కర్లేదు. ఇదే మోదీ అంతకు కొద్ది రోజుల ముందు పాక్‌తో సెక్రటరీ స్థాయి చర్చల్ని కూడా ఉపసంహరించుకుని ఉద్రిక్తతలకు మరింత కారణమైన విషయం తెలిసిందే. ఇప్పుడు ట్రంప్ దేశంలో అడుగుపెడుతున్న సమయంలో కూడా పౌరసత్వ చట్టంపై నిరసన ప్రదర్శనలు సాగుతున్నాయి. కశ్మీర్‌లో ప్రతిపక్ష నేతల దిగ్బంధనంపై పార్లమెంట్‌లో ఇటీవలే ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. మన దేశంలో ఆమోదించిన పౌరసత్వ చట్టం వివక్షతో కూడుకున్నదని, విచ్ఛిన్నకరమైనదని యూరోపియన్ పార్లమెంట్ తీర్మానించింది. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రి జైశంకర్ బ్రసెల్స్‌కు వెళ్లి మన చట్టాన్ని సమర్థించుకోవల్సి వస్తోంది. మనం ఏ దేశానికి వెళ్లినా, మన దేశానికి ఎవరు వచ్చినా అనివార్యంగా కశ్మీర్, పౌరసత్వ చట్టం చర్చకు రావడం, మన నేతలు సమర్థించుకోవాల్సి రావడం జరుగుతోంది. కశ్మీర్ విషయంలో తాను మధ్యవర్తిత్వ పాత్ర పోషిస్తానని గతంలో చెప్పుకున్న ట్రంప్, ఇప్పుడు భారత్ పర్యటనలో ఏమి మాట్లాడతాడో వేచి చూడాలి. అయినా ట్రంప్, ఒబామా లాగా ఒక దృక్పథం, విశాల ప్రయోజనం ఆశించే నేత కాదు. ప్రవాస భారతీయుల్లోకెల్లా గుజరాతీయుల పలుకుబడి ఎలాంటిదో ఆయనకు బాగా తెలుసు. కనుకనే ఈ సంవత్సరాంతంలో జరగనున్న అమెరికా అధ్యక్ష పదవీ ఎన్నికల కోసమే, గత ఏడాది ‘హౌడీ మోడీ’ సభ మాదిరే ఇప్పుడు అహ్మదాబాద్‌లో ‘కెమ్ చో ట్రంప్’ సభ కూడా ఉపయోగపడుతుందని ట్రంప్ విశ్వసిస్తున్నారు. ఏమైనా ట్రంప్ రాక భారత్‌కు ఎంత ప్రయోజనం చేకూరుస్తుందో ఆయన పర్యటన ముగిసిన తర్వాత అర్థమవుతుంది.


ఎనిమిది నెలల క్రితమే భారీ మెజారిటీతో బిజెపిని గెలిపించగలిగిన నరేంద్ర మోదీ మరో నాలుగేళ్లు ప్రధాని పదవిలోనే కొనసాగనున్న రీత్యా దేశ ఆర్థిక వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థకు సంబంధించి బలమైన నిర్ణయాలు తీసుకోగలిగిన అవకాశం ఆయనకు ఇంకా ఉన్నదన్న విషయం కాదనలేం. ఆయన కూడా ‘టైమ్స్ నౌ’ సదస్సులో మాట్లాడుతూ ‘ఇంకా ఏమి చూశారు.. ఇప్పటి వరకూ చూసింది నమూనాయే!’ అని వ్యాఖ్యానించారు. కానీ ప్రధాని మోదీ ఆర్థిక, పరిపాలనా వ్యవస్థలను గురించి మాట్లాడుతున్నారా లేక పౌరసత్వ చట్టం లాంటి వివాదాస్పద నిర్ణయాలను మరిన్ని తీసుకోవడం గురించి మాట్లాడుతున్నారా అన్నది రానున్న రోజుల్లో తేలుతుంది.


‘ఇకనైనా పౌరసత్వ చట్టం, కశ్మీర్ అంటూ మాట్లాడడం మానేసి పరిపాలనపై దృష్టి కేంద్రీకరించండి.. ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారించండి..’ అని శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే చేసిన సూచనల్లో అర్థం లేకపోలేదు. నిజానికి 2014లో ఈ దేశంలో లక్షలాది యువకులు మోదీకి ఓటు వేసేందుకు స్పష్టమైన కారణాలు ఉన్నాయి. మోదీ ఈ దేశ ఆర్థిక వ్యవస్థను పుంజుకునేలా చేయగలరన్న నమ్మకాన్ని నోబెల్‌ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థిక వేత్త అమర్త్యసేన్‌ కూడా అప్పట్లో వ్యక్తం చేశారు. అయితే ఆ తర్వాత ఆర్థిక వేత్తల అలాంటి నమ్మకాలు సడలిపోయాయి. దేశానికి అవసరమైన ఆర్థిక, సామాజిక సంస్కరణలను మోదీ చేపడతారని, అభివృద్ధి పథంలో నడిపిస్తారని అనేకమంది భావించారు. కాని మోదీ రెండోసారి గెలిచినా ఈ నమ్మకాల్ని నెరవేర్చే దిశగా చర్యలు ప్రారంభించకపోగా, బలహీనంగా మారిన ఆర్థిక వ్యవస్థ గురించి ప్రజలు ఆలోచించకుండా ఉండేందుకు భావోద్వేగ అంశాలపై అధికంగా దృష్టి కేంద్రీకరించడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.


విచిత్రమేమంటే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అయిదేళ్లలో భారత్‌ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని, అందుకు ఈ బడ్జెట్‌లో పునాది వేశామని తరుచూ చెప్పుకుంటున్న మాటలు ఆర్థిక వేత్తలకు ఎంతైనా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ప్రధాని, ఆర్థికమంత్రి మాటలు కేవలం నినాదప్రాయ ప్రకటనలుగా మిగిలిపోయే అవకాశాలున్నాయని, కనీసం ఇలాంటి ఆడంబర ప్రకటనలు చేయకుండా వుండాలని అధికారులైనా సలహా ఇచ్చి ఉంటే బాగుండేదని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ బ్యాంకు సీనియర్ ఉపాధ్యక్షుడు, మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు కౌశిక్ బసు ఒక పత్రికలో రాసిన వ్యాసంలో ప్రస్తుతం అధికారికంగా చెప్పుకుంటున్న 4.5 శాతం అభివృద్ధి రేటు ప్రకారం చూసినా వచ్చే అయిదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించగలిగే అవకాశాలు ఏమాత్రంలేవని, అందుకు కనీసం పన్నెండేళ్లు పడుతుందని చెప్పారు. ప్రధాని, ఆర్థిక మంత్రి చెప్పినట్లు 2024 నాటికే 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలంటే ప్రస్తుతం చెప్పుకుంటున్న 4.5 శాతం కాకుండా వరుసగా అయిదేళ్ల పాటు 10.5 శాతం అభివృద్ధి రేటును సాధించాల్సి ఉంటుందని ఆయన విశ్లేషించారు. ఇలాంటి బృహత్తరమైన లక్ష్యాన్ని కేవలం చైనా 2003-2009 మధ్య సాధించిందని ఆయన అన్నారు మరి భారత దేశం వచ్చే అయిదేళ్లు ఇంతటి కనీవినీ ఎరుగని అభివృద్ధి రేటును సాధించగలదా? గతంలో ఎప్పుడైనా అలా సాధించిందా? 1988-89, 2007-08లో రెండు సార్లు అలా సాధించిందని, ఆ తర్వాత 2005 నుంచి పీవీ హయాంలో 9 శాతం అభివృద్ధి రేటును సాధించగలిగిందని ఆయన వివరించారు.


పీవీ హయాంలో వృత్తి నైపుణ్యంతో కూడిన ఆర్థిక విధానాలను అవలంభించడం, భారత ఆర్థిక వ్యవస్థలో జరిగిన గుణాత్మక మార్పుల గురించి ప్రపంచ దేశాలు స్పందించడంతో పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడంతో భారత్ అభివృద్ధి రేటు పెరిగిందని ఆయన చెప్పారు. మనం డాలర్ల లెక్కన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి రేటు పెరుగుతుందని చెప్పుకుంటున్నందువల్ల మన జీడీపీ అభివృద్ధి రేటు 7 శాతానికి పెరిగి, అమెరికా ద్రవ్యోల్బణం కూడా 7. 5శాతానికి పెంచమని ట్రంప్‌ను ఒప్పించి డాలర్ విలువను తగ్గిస్తే తప్ప మనం చెప్పుకుంటున్న 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించలేమని కౌశిక్ బసు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. విచిత్రమేమంటే భారత ప్రభుత్వం నియమించుకున్న ఆర్థిక సలహాదారులు కూడా ఆర్థిక మంత్రి అభిప్రాయాలతో ఏకీభవించడం లేదు. నిరాశాజనక బడ్జెట్‌లో దార్శనికత లేదని, అసలు ఆర్థిక మందగమనం అన్నమాట కూడా ప్రస్తావించలేదని ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి సభ్యురాలు ఆషిమా గోయెల్ బహిరంగంగా విమర్శించారు. నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆర్థికాభివృద్ధి రేటు గురించి ఆశాజనకమైన సర్టిఫికెట్లు జారీ చేసిన అనేక సంస్థలు కూడా ఇప్పుడు అలాంటి సర్టిఫికెట్లు ఇవ్వడానికి వెనుకాడుతున్నాయి. 2020లో భారత అభివృద్ధి రేటు 6.6 శాతం ఉంటుందని అంచనా వేసిన మూడీ ఇన్వెస్టర్స్ సర్వీస్ ఇప్పుడు దాన్ని 5.4 శాతానికి తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక దుస్థితి నుంచి కోలుకోవడమనేది డొల్లతనంగా అది అభివర్ణించింది. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో చెప్పుకున్న ‘హరిత మొలకలు’ వాడిపోకుండా చూసుకోవడం అవసరమని రిజర్వు బ్యాంకు చైర్మన్ శక్తికాంత దాస్ వ్యాఖ్యానించడం గమనార్హం.


విచిత్రమేమంటే ప్రభుత్వానికి 1.47 లక్షల కోట్ల మేరకు 15 టెలికం కంపెనీలు లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రమ్ ఛార్జీల క్రింద బకాయిలు ఉన్నా సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేంతవరకూ ప్రభుత్వం ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నది. చివరకు ‘ఈ దేశంలో చట్టం అంటూ ఏమీ లేదా’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించవలిసి వచ్చింది. టెలికం కంపెనీలు బకాయీల్లో కొద్ది భాగమే చెల్లిస్తూ ప్రభుత్వం తమకు ఊరట కల్పిస్తుందని ఆశతో ఉన్నాయి. తాము మార్కెట్ నుంచి వెళ్లిపోతే ఇప్పటికే కునారిల్లిపోతున్న భారత ఆర్థిక వ్యవస్థ మరింత దెబ్బతింటుందని పారిశ్రామిక వేత్తలు బహిరంగ వేదికలపై ప్రభుత్వాన్ని హెచ్చరించే పరిస్థితి ఏర్పడింది. మురికివాడలకు అడ్డంగా గోడలు కట్టడం ద్వారా పేదరికాన్ని కప్పిపుచ్చుకోవడం, నినాదాల ద్వారా ఆర్థిక వ్యవస్థ గురించి గొప్పలు చెప్పుకోవడం, భావోద్వేగాల ద్వారా ఓట్లను ఆశించడం మాని ఇప్పటికైనా వాస్తవిక దృక్పథంతో చర్యలు తీసుకునేందుకు మోదీ సర్కార్‌కు ఇంకా అవకాశం ఉన్నది.






ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2020-02-19T06:02:59+05:30 IST