మోదీని సన్నిహితంగా చూసినవారు చెప్పే విశేషాలతో ‘Modi Story' వెబ్‌సైట్

Published: Sat, 26 Mar 2022 16:38:30 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మోదీని సన్నిహితంగా చూసినవారు చెప్పే విశేషాలతో Modi Story వెబ్‌సైట్

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవితాన్ని సన్నిహితంగా చూసినవారు చెప్పే స్ఫూర్తిదాయక అంశాలతో ఓ వెబ్‌సైట్ ప్రారంభమైంది. మోదీతో సన్నిహితంగా మెలగినవారి జ్ఞాపకాలు, వారు చెప్పే కథనాలు దీనిలో ఉంటాయి. ‘Modi Story' పేరుతో కొందరు నెటిజన్లు స్వచ్ఛందంగా దీనిని నిర్వహిస్తున్నారు. 


‘Modi Story'లో ప్రచురించేందుకు మోదీని కలిసినవారు తమ జ్ఞాపకాలను తమతో పంచుకోవచ్చునని వీరు కోరారు. వ్యాసాలు, ఆడియో లేదా విజువల్ స్టోరీస్, చిన్న కథలు, మోదీతో ఫొటోలు, ఆయన రాసిన లేఖలు లేదా వ్యక్తిగత జ్ఞాపకాలు వంటివాటిని పంపించవచ్చునని తెలిపారు. 


modistory.in వెబ్‌సైట్‌ను కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్ ట్విటర్ వేదికగా షేర్ చేశారు. మోదీతో వ్యక్తిగత సమావేశాలు, సంభాషణలు, జ్ఞాపకాలు, నిశ్చయాత్మక రాజకీయ వ్యక్తిత్వాన్ని, స్నేహపూర్వక వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే అంశాలు వంటివాటిని ఈ వెబ్‌సైట్‌లో చూడవచ్చునని స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు వెలుగులోకి రాని అంశాలు కూడా దీనిలో ఉంటాయన్నారు. అనురాగ్ ఠాకూర్ ఇచ్చిన ట్వీట్‌లో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితం గురించి ఆసక్తికర విషయాలు ఈ వెబ్‌సైట్‌లో ఉంటాయన్నారు. 


గుజరాత్‌కు చెందిన డాక్టర్ అనిల్ రావల్ 1980వ దశకంలో మోదీతో మాట్లాడిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. ‘‘చిట్ట చివరి వ్యక్తిని ఉద్ధరించడానికి అంకితమయ్యేలా మిమ్మల్ని ప్రేరేపించినదేమిటి?’’ అని మోదీని తాను అడిగానని చెప్పారు. మోదీ స్పందిస్తూ అంతకుముందు ఆయన ఓ స్వయం సేవకుని ఇంటికి వెళ్ళిన విషయాన్ని గుర్తు చేసుకున్నారని చెప్పారు. మోదీ చెప్పిన మాటలను యథాతథంగా ఈ విధంగా చెప్పారు.


‘‘నేను ఒకసారి ఓ స్వయం సేవకుని ఇంటికి వెళ్ళాను. అది ఓ చిన్న గుడిసె. దానిలో ఆయన, ఆయన భార్య, కుమారుడు నివసిస్తున్నారు. వాళ్ళు నాకు ఓ అర ముక్క రొట్టెను, ఓ గ్లాసులో పాలను ఇచ్చారు. తల్లి ఒడిలో కూర్చున్న బాలుడు నా దగ్గర ఉన్న గ్లాసులోని పాలను చూస్తున్నాడు. ఈ పాలు అతనివేనని నేను అర్థం చేసుకున్నాను. నేను ఆ రొట్టెను తినేసి, మంచినీళ్ళు తాగాను. పాలను వదిలేశాను. ఆ పాలను ఆమె తన కుమారునికి ఇచ్చింది. అతడు ఒకే ఒక గుక్కలో ఆ పాలను తాగేశాడు. దాన్ని చూసి నా కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరిగాయి. అప్పుడు నేను చిట్ట చివర నిల్చున్న వ్యక్తిని ఉద్ధరించడానికి నా జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని మోదీ చెప్పారని డాక్టర్ అనిల్ తెలిపారు.


మరో గుజరాత్‌వాసి రోహిత్ అగర్వాల్ చెప్పిన కథ ప్రకారం, మోదీ ఎమర్జెన్సీ కాలంలో సిక్కు మతస్థుని మాదిరిగా బట్టలు వేసుకుని, పోలీసుల నుంచి తప్పించుకున్నారు. మోదీ సర్దార్జీ మాదిరిగా బట్టలు వేసుకుని బయటకు వెళ్ళారని, అప్పుడు ఓ పోలీసు ఆయన వద్దకు వచ్చి, నరేంద్ర మోదీ ఎక్కడ ఉన్నారని అడిగారని చెప్పారు. అందుకు మోదీ బదులిస్తూ, తనకు తెలియదని, ఇంట్లోకి వెళ్లి అడగండని చెప్పారని తెలిపారు. వెంటనే తన (అగర్వాల్) సోదరుని స్కూటర్‌పై వెళ్ళి ఆ పోలీసు నుంచి తప్పించుకున్నారని తెలిపారు. ఈ విధంగా వస్త్రాలు ధరిస్తూ ఆయన తమను కూడా మాయ చేసేవారని చెప్పారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.