మోదీ ఖాతాలో త్వరలో మరో రికార్డు!

ABN , First Publish Date - 2021-08-01T21:31:41+05:30 IST

ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్‌సీ)కి ఆగస్టు

మోదీ ఖాతాలో త్వరలో మరో రికార్డు!

న్యూఢిల్లీ : ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్‌సీ)కి ఆగస్టు నెలలో భారత దేశం అధ్యక్షత వహిస్తోంది. ఈ సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ యూఎన్ఎస్‌సీ సమావేశానికి అధ్యక్షత వహించబోతున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత యూఎన్ఎస్‌సీ సమావేశానికి అధ్యక్షత వహించబోతున్న తొలి భారత  ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించబోతున్నారు. ఈ వివరాలను ఐక్యరాజ్య సమితిలో భారత దేశ మాజీ  రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ ఆదివారం ట్విటర్ వేదికగా తెలిపారు. 


మోదీ ఆగస్టు 9న యూఎన్‌ఎస్‌సీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారని అక్బరుద్దీన్ చెప్పారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ సమావేశానికి అధ్యక్షత వహించబోతున్న తొలి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ నిలవబోతున్నట్లు ఓ ట్వీట్ ద్వారా తెలిపారు. 2019లో మోదీ ఐక్య రాజ్య సమితిని సందర్శించినప్పటి ఫొటోను షేర్ చేశారు. వర్చువల్ విధానంలో జరిగే సమావేశంలో మోదీ ప్రసంగిస్తారని పేర్కొన్నారు. 


అక్బరుద్దీన్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ముందు ఉండి నడిపించాలని నాయకుడు కోరుకుంటుండటాన్ని ఇది స్పష్టం చేస్తోందన్నారు. మన విదేశాంగ విధానంలో భారత దేశం, దాని రాజకీయ నాయకత్వం శ్రద్ధ పెడుతున్న విషయం వెల్లవడుతోందన్నారు. 


యూఎన్ఎస్‌సీ రొటేటింగ్ ప్రెసిడెన్సీ ఆగస్టు నెలకు భారత దేశానికి వచ్చింది. ఈ సందర్భంగా మారిటైమ్ సెక్యూరిటీ, పీస్ కీపింగ్, కౌంటర్ టెర్రరిజం సమస్యలపై భారత దేశం ఈ నెలలో ప్రధానంగా దృష్టి సారిస్తుంది. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సహా, భారత దేశ ఉన్నతాధికారుల నాయకత్వంలో అత్యున్నత స్థాయి సమావేశాలు ఈ నెలలో జరుగుతాయి. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శృంగ్లా వంటివారు ఈ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. 


Updated Date - 2021-08-01T21:31:41+05:30 IST