స్వాతంత్ర్య సమరయోధుడు, దివంగత పసల కృష్ణమూర్తి కుటుంబాన్ని పరామర్శించిన ప్రధాని మోదీ

Published: Mon, 04 Jul 2022 17:41:13 ISTfb-iconwhatsapp-icontwitter-icon
స్వాతంత్ర్య సమరయోధుడు, దివంగత పసల కృష్ణమూర్తి కుటుంబాన్ని పరామర్శించిన ప్రధాని మోదీ

Amaravathi: ప్రధాని మోదీ (Modi) ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు.  పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. మన్యం వీరుడు, తెలుగు జాతి యుగపురుషుడు అల్లూరి (Alluri) అని కొనియాడారు. అల్లూరి నడిచిన నేలపై మనం నడవడం అదృష్టమన్నారు. యావత్ భారతానికి అల్లూరి స్ఫూర్తిగా నిలిచారన్నారు.  ‘‘ఆంధ్రరాష్ట్రం పుణ్యభూమి... వీర భూమి. పుణ్యభూమికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. వీరభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’’ అంటూ ప్రసంగాన్ని కొనసాగించారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధుడు, దివంగత పసల కృష్ణమూర్తి కుటుంబాన్ని ఆయన కలిశారు. కృష్ణమూర్తి కూతురు 90 ఏళ్ల పసల కృష్ణ భారతి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు.   


పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలోని పడమర విప్పర్రులో 1900 జనవరి 26వ తేదీ సంపన్న కుటుంబంలో జన్మించారు. 1904లో తణుకు తాలూకా కుముదవల్లిలో మునసబు కుటుంబంలో జన్మించిన అంజలక్ష్మితో 1916లో కృష్ణమూర్తికి వివాహమైంది. గాంధీజీ 1921లో విజయవాడ, ఏలూరును పర్యటించిన సమయంలో వీరు కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నారు. 1929 ఏప్రిల్ 25న చాగల్లు ఆనంద నికేతన్‌కు వచ్చిన గాంధీజీని కలిశారు. ఇద్దరు నిధికి తమ ఒంటిపైనున్న నగలన్నింటిని ఇచ్చేశారు. వీరితో పాటు వీరి ఆరు సంవత్సరాల కూతురు సత్యవతి, నాలుగేళ్ల కుమారుడు ఆదినారాయణ కూడా తమ ఆభరణాలను ఇచ్చేశారు. వెంటనే గాంధీజీ, పిల్లలను తన దగ్గరకు తీసుకుని ఇప్పుడిచ్చారు. సరే... మళ్లీ నగలపై ఆశ పెట్టుకోరా అని అడిగారు. ఇకపై నగలు ధరించబోమని వారు గాంధీజీకి సమాధానమిచ్చారు. ఆ రోజు నుంచి వారు బంగారం జోలికెళ్లలేదు. రెండో కూతురు కృష్ణభారతికి చెవులను కూడా కుట్టించలేదు. కృష్ణమూర్తి జీవితాంతం బాపూజీ వేషధారణలోనే సంచరించారు. అంజలక్ష్మి వడికిన నూలుతో తయారు చేసిన ఖద్దరు వస్త్రాలనే ధరించారు. విదేశీ వస్త్రాల బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు  పసల కృష్ణమూర్తి  అంజలక్ష్మి దంపతులును ఆంగ్లేయులు 1931లో జైలు శిక్ష విధించారు.  చంకలో నాలుగేళ్ల కుమారుడు ఆదినారాయణను పట్టుకొనే జైలుకెళ్లారు అంజలక్ష్మి.


జైలు నుంచి వచ్చాక రెట్టింపు ఉత్సాహంతో..

తర్వాత జైలు నుంచి వచ్చాక 1932 శాసనోల్లంఘన ఉద్యమంలో రెట్టింపు ఉత్సాహంతో పాల్గొన్నారు. జూన్ 27న భీమవరంలో ఆ శాసనాన్ని ఉల్లంఘిస్తూ కృష్ణమూర్తి అధ్యక్షతన కాంగ్రెస్ సమావేశం ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఎలాగైనా అడ్డుకోవాలని పోలీసులు పట్టుదలకు పోయారు. కృష్ణమూర్తి- ఆరు నెలల గర్భిణి అంజలక్ష్మి దంపతులు మరికొందరు కార్యకర్తలతో కలసి రహస్యంగా పొలంగట్ల పై నుంచి పోలీసుల నుంచి తప్పించుకుని భీమవరం చేరి సమావేశం నిర్వహించారు. అనంతరం కృష్ణమూర్తి మరికొందరు సహచర యోధులతో భవనం పైకెక్కి కాంగ్రెస్ జెండాను ఎగురవేసి వందేమాతరం అంటూ నినదించారు. పోలీసులు పతాకావిష్కరణను అడ్డుకోకుండా అంజలక్ష్మి... తన సహచర మహిళలతో నిలువరించారు. కొన్ని రోజుల తర్వాత పోలీసులు ఈ ఘటనలో పాల్గొన్న అందరినీ అరెస్టు చేశారు. అంజలక్ష్మికి పది నెలల జైలుశిక్ష పడగా... గర్భిణీగా ఉన్నా  జంకులేకుండా జైలుకు వెళ్లారు. అక్టోబరు 29న వెల్లూరు జైల్లోనే ఆడబిడ్డకు జన్మనిచ్చారు. కృష్ణుడిలా కారాగారంలో పుట్టినందుకు 'కృష్ణ', భారతావని దాస్య శృంఖలాలు తెంచే పోరాటంలో భాగమైనందుకు 'భారతి' కలిపి.. ఆ బిడ్డకు కృష్ణభారతి అని పేరుపెట్టారు. 1833 ఏప్రిల్ మాసంలో 6 నెలల పసికందుతో అంజలక్ష్మి జైల్లోంచి బయటకు వస్తుంటే.. ప్రజలు నీరాజనాలు పట్టారు. జాతీయోద్యమంలో పాల్గొన్నందుకు ఆగ్రహించిన ప్రభుత్వం ఇంట్లో మట్టిపాత్రలు తప్పించి మరేమీ మిగలకుండా.. చేసింది. 


వితంతు వివాహాలను ప్రోత్సహించిన  కృష్ణమూర్తి-అంజలక్ష్మి దంపతులు

కృష్ణమూర్తి-అంజలక్ష్మి దంపతులిద్దరూ వితంతు వివాహాలను ప్రోత్సహించారు. అంటరానితనం నిర్మూలనకు ఎంతో కృషి చేశారు. తమ ఇంటిలోనే ఆశ్రయం కల్పించి, దళిత, పేద బాల బాలికలకు చదువు చెప్పించారు. మరోవైపు. ఖద్దరు ధరించని వారి ఇళ్లకు వెళ్లబోమంటూ వీరు చేసిన ప్రతిన చాలామంది బంధువులకు ఆగ్రహం తెప్పించింది. అయినా వారు వెరవలేదు. గ్రామంలోని తమ ఇంటినే ధర్మాసుపత్రిగా మార్చారు. ఓ వైద్యుడిని నియమించి అంజలక్ష్మి నర్సుగా, కృష్ణమూర్తి కాంపౌండర్‌గా సేవలందించారు. తమ 60 ఎకరాల పొలాన్ని సమాజహితం కోసమే ఖర్చు చేశారు. స్వాతంత్య్రానంతరం సమరయోధులకిచ్చే పింఛను, సౌకర్యాలను కూడా వద్దన్నారు. ప్రభుత్వం ఇచ్చిన భూమిని పేదల స్కూలు కోసం విరాళంగా ఇచ్చారు. 1978 సెప్టెంబరు 30న కృష్ణమూర్తి కన్నుమూశారు. ఆయన గౌరవార్థం తాడేపల్లిగూడెం పురపాలక సంఘం పసల కృష్ణమూర్తి స్మారక ప్రాథమికోన్నత పాఠశాలను నెలకొల్పింది.  ఆంజలక్ష్మి రాష్ట్రపతి నుంచి తామ్రపత్ర పురస్కారం అందుకున్నారు. 1998లో తన 94 సంవత్సరాల వయసులో కన్నుమూశారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.