దేశ ప్రజలను దగా చేసిన మోదీ

ABN , First Publish Date - 2022-05-29T06:21:36+05:30 IST

దేశ ప్రజలను మోదీ దగా చేశారని ఏఐకేఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి హన్నన మొల్లా విమర్శించారు. నగరంలో శనివారం నిర్వహించిన ఏపీ రైతు సంఘం రాష్ట్ర 22వ మహాసభలలో ఆయన ప్రసంగించారు. 2

దేశ ప్రజలను దగా చేసిన మోదీ
రైతు మహా ప్రదర్శనలో పాల్గొన్న నాయకులు

ఏఐకేఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి హన్నన మొల్లా

అనంత వీధుల్లో కదం తొక్కిన రైతు

ఏపీ రైతు సంఘం 22వ  రాష్ట్ర 

మహాసభలు ప్రారంభం 

అనంతపురం కల్చరల్‌, మే 28: దేశ ప్రజలను మోదీ దగా చేశారని ఏఐకేఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి హన్నన మొల్లా విమర్శించారు. నగరంలో శనివారం నిర్వహించిన ఏపీ రైతు సంఘం రాష్ట్ర 22వ మహాసభలలో ఆయన ప్రసంగించారు. 2014 ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ స్వామినాథన కమిషన సిఫారసులు అమలు చేస్తానని హామీ ఇచ్చారని, అమలు చేయకపోగా, మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులకు అన్యాయం చేసేందుకు సిద్ధపడ్డారని విమర్శించారు. రైతులు సమష్టిగా 372 రోజులు ఎండ, వాన, చలికి వెరవక పోరాటం సాగించి కేంద్రం మెడలు వంచారని అన్నారు. రానున్న రోజుల్లో రైతు సమస్యలపై రెండోదశ ఉద్యమానికి రైతు సంఘాలన్నీ సిద్ధపడుతున్నాయని తెలిపారు.


రైతు సంఘం మహాసభలను పురస్కరించుకుని, క్లాక్‌టవర్‌ కూడలి నుంచి సప్తగిరి సర్కిల్‌, శ్రీకంఠం సర్కిల్‌ మీదుగా ఆర్ట్స్‌ కళాశాల మైదానంలోని బహిరరంగసభ వేదిక వరకు రైతు మహా ప్రదర్శన నిర్వహించారు. సాంస్కృతిక ప్రదర్శనలతోపాటు, జిల్లాలో పండే వేరుశనగ, వరి, మామిడి తదితర పంటలను మహిళా రైతులు తమ తలలపై మోసుకుంటూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బహిరంగ సభలో అఖిల భారత కిసాన సభ జాతీయ ప్రధాన కార్యదర్శి హన్నన మొల్లా, సంయుక్త కార్యదర్శి విజ్జుకృష్ణన, ఏపీ రైతుసంఘం పూర్వ కార్యదర్శులు శ్రీనివాసరావు, మధు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. ఏపీ రైతుసంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గేయానంద్‌, సీఐటీయూ రాష్ట్ర నాయకుడు ఓబులు, ఏపీ రైతుసంఘం అధ్యక్షుడు కేశవరావు, ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు నాగరాజు, ఉపాధ్యక్షుడు రాంభూపాల్‌, మహాసభల ఆహ్వానసంఘం అధ్యక్షుడు ఎస్‌ఎం బాషా, మానవహక్కుల వేదిక నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డి, డాక్టర్‌ అనీల్‌రెడ్డి పాల్గొన్నారు.


సరళీకరణ విధానాలతో చేటు..

దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన నాటినుంచే ఆర్థికవ్యవస్థకు నష్టం జరుగుతోందని ఏఐకేఎస్‌ హెచ్చరించింది. దీనివల్ల ప్రయోజనాలు అధికంగా ఉంటాయని నాటి పాలకులు చెప్పారు. ఆర్థిక సంస్కరణలవల్ల లాభం లేదన్నది ఆచరణలో స్పష్టమైంది. అందుకే ప్రత్యామ్నాయ విధానాలను అమలుచేయాల్సిన అవసరముంది. కేరళలోని వామపక్ష ప్రభుత్వం రేషన దుకాణాలద్వారా ఇంటికి కావాల్సిన అన్ని నిత్యావసర సరుకులను అందిస్తోంది. అర్హులందరికీ క్రమం తప్పకుండా సంక్షేమ పథకాలను అందిస్తోంది. ఏపీలో ఆ తరహాలో అమలు చేయాలి.

-  విజ్జూకృష్ణన, ఏఐకేఎస్‌ సంయుక్త కార్యదర్శి


ప్రశ్నించలేని  టీడీపీ, వైసీపీ..

కేంద్ర ప్రభుత్వ విధానాలను అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ప్రశ్నించలేకున్నాయి.  కేంద్ర ప్రభుత్వం వేస్తున్న భారాలకు వ్యతిరేకంగా మహానాడులో టీడీపీ తీర్మానం చేయాలి. వైసీపీ సామాజిక న్యాయం పేరుతో రాష్ట్రంలో యాత్ర చేస్తోంది. 17 మందికి మంత్రిపదవులిస్తే సామాజికన్యాయం చేసినట్టా..? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఆర్థిక పురోగాభివృద్ధికి చర్యలు చేపట్టినపుడే సామాజికన్యాయం చేసినట్లవుతుంది. రాష్ట్రంలోనూ ఢిల్లీ తరహా ఐక్య పోరాటాలు జరగాల్సిన అవసరముంది. 

- మధు, ఏపీ రైతుసంఘం మాజీ కార్యదర్శి


విద్యుత మీటర్లను అంగీకరించవద్దు

వ్యవసాయ మోటార్లకు విద్యుత మీటర్లు పెట్టి రైతులపై భారం మోపేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధపడుతోంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు అంగీకరించవద్దు. విద్యుత సంస్కరణల విషయంలో గతంలో పెద్దఎత్తున పోరాటం జరిగింది. ఇపుడు ఈ ప్రభుత్వం మొండిగా రైతులపై భారాలు మోపేందుకు సిద్ధపడుతోంది. దీనికి వ్యతిరేకంగా రైతులను ఐక్యపరిచి పోరాటాలు చేపట్టేలా ఏపీ రైతుసంఘం మహాసభలు జరగాలి.

- శ్రీనివాసరావు, ఏపీ రైతుసంఘం మాజీ కార్యదర్శి





Updated Date - 2022-05-29T06:21:36+05:30 IST