మోదీజీ, మౌనం వీడండి

ABN , First Publish Date - 2022-04-29T09:00:52+05:30 IST

విద్వేష రాజకీయాలు ఉధృతమవుతున్నాయి. వాటి ఉన్మాదానికి ముస్లింలు, ఇతర మైనారిటీ వర్గాల వారే కాదు, రాజ్యాంగమే బలవుతున్నది. మాజీ సివిల్ సర్వెంట్స్‌గా, మా కళ్ల ఎదుట సంభవిస్తున్న సంఘటనల పట్ల మా మనోభావాలను తీవ్ర పదజాలంతో...

మోదీజీ, మౌనం వీడండి

‘విద్వేష రాజకీయాల’పై మాజీ బ్యూరోక్రాట్ల బహిరంగ లేఖ


ప్రధానమంత్రి గారూ,

విద్వేష రాజకీయాలు ఉధృతమవుతున్నాయి. వాటి ఉన్మాదానికి ముస్లింలు, ఇతర మైనారిటీ వర్గాల వారే కాదు, రాజ్యాంగమే బలవుతున్నది. మాజీ సివిల్ సర్వెంట్స్‌గా, మా కళ్ల ఎదుట సంభవిస్తున్న సంఘటనల పట్ల మా మనోభావాలను తీవ్ర పదజాలంతో వ్యక్తం చేయడం అనివార్యమయింది. నిజానికి ఇది మా అలవాటు కాదు. అయితే స్వతంత్ర భారత వ్యవస్థాపకులు నిర్మించిన మన సమున్నత ప్రజాస్వామిక గణతంత్ర రాజ్య విలువలు, సంప్రదాయాల విధ్వంసమే మా ఆగ్రహాన్ని, ఆవేదనను ఇలా వ్యక్తం చేసేందుకు బలవంతపెట్టింది.


గత కొద్ది సంవత్సరాలుగా, నెలలుగా పలు రాష్ట్రాల- అస్సోం, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌-లో మైనారిటీ మతస్థులు, ముఖ్యంగా ముస్లింలపై విద్వేష హింసాకాండ పెచ్చరిల్లిపోయింది. ఢిల్లీ మినహా, ఇవన్నీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలే కావడం గమనార్హం (ఢిల్లీలో పోలీసు విభాగం కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది). ఈ కారణంగా ఆ సంఘటనలు కొత్త పరిమాణాన్ని సంతరించుకున్నాయి. ఇవి, ఇంకెంత మాత్రం హిందూత్వ అస్తిత్వ రాజకీయాల లేదా మతోన్మాదం సదా రగులుతూ ఉండేలా చేసే ప్రయత్నాల పర్యవసానాలు కావు. దశాబ్దాలుగా, గత కొద్ది సంవత్సరాలుగా అవి కొత్త సాధారణ పరిస్థితులలో భాగమైపోయాయి. మన రాజ్యాంగ మౌలిక సూత్రాలను, చట్ట బద్ధ పాలనను మెజారిటేరియన్ శక్తులకు అధీనమై పోవడమే ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఈ సంఘటనలలో రాజ్యం పూర్తిగా భాగస్వామిగా ఉన్నట్టు కనిపిస్తోంది.


ముస్లింల పట్ల ప్రదర్శిస్తున్న ద్వేషపూరిత శత్రు వైఖరి, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలోని రాజ్య వ్యవస్థలు, సంస్థలు, పాలనా ప్రక్రియలలో అంతర్భాగమై పోయింది. శాంతి సామరస్యాల పరిరక్షణకు ఉపకరణంగా కాకుండా, మైనారిటీ వర్గాలను నిత్యం భయాందోళనల్లో ఉండే విధంగా చట్టాల అమలు జరుగుతోంది. తమ సొంత మత విశ్వాసాలను ఆచరించుకోవడానికి, తమ సొంత ఆచారాలు, వస్త్రధారణ పద్ధతులు, ఆహార సంప్రదాయాలు, మత చట్టాలను అనుసరించేందుకు మైనారీటీ వర్గాలకు రాజ్యాంగ బద్ధంగా లభించిన హక్కులకు ముప్పు కలుగుతోంది. చట్ట విరుద్ధ నిఘా మూకలు నిర్భయంగా పాల్పడుతున్న హింసాత్మక చర్యల వల్లనే కాకుండా చట్టాన్ని దుర్వినియోగపరచడం వల్ల కూడా ఆ ప్రమాదం సంభవిస్తోంది. వారి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు అన్ని విధాల పరిమితులు విధిస్తున్నారు. ఇలా ఒక నిర్దిష్ట మత వర్గానికి వ్యతిరేకంగా ఉద్దేశించిన చట్ట విరుద్ధ నిఘా బృందాల హింసాకాండ అడ్డూ అదుపులేకుండా సాగేందుకు రాజ్యాధికారాన్ని వినియోగిస్తున్నారు. అంతే కాకుండా పాలనా యంత్రాంగానికి ప్రత్యక్షంగా లభ్యమవుతున్న చట్టబద్ధ పద్ధతుల (మతాంతరీకరణ వ్యతిరేక చట్టాలు, పశు మాంసాన్ని ఆహారంగా తీసుకోవడంపై నిషేధాన్ని విధించిన చట్టాలు, అక్రమ ఆక్రమణల తొలగింపు, విద్యా సంస్థలలో యూనిఫామ్ నియమాల నిర్దేశం మొదలైనవి ఇందుకు ఉదాహరణలు) ద్వారా మైనారిటీ వర్గాలలో తీవ్ర భయాందోళనలు నెలకొల్పుతున్నారు. వారి జీవనాధారాలను దెబ్బకొడుతున్నారు. మెజారిటేరియన్ రాజకీయ శక్తులకు, మెజారిటేరియన్ సాంఘిక, సాంస్కృతిక ప్రమాణాలకు తమకు తామే లోబడిపోయే అప్రధాన పౌరులుగా తమ హోదాను అంగీకరించేలా చేస్తున్నారు. తన సొంత పౌరులను- మైనారిటీలు, దళితులు, పేదలు, అణగారిన వర్గాల వారు- విద్వేష హింసాకాండకు గురిచేస్తూ, వారి ప్రాథమిక హక్కులను హరించివేస్తున్న దేశంగా మన దేశం పరిణమించడమనేది ఇప్పుడు ఒక స్పష్టమైన యథార్థంగా ఉన్నది. ఎంతో భయోత్పాతాన్ని కలిగిస్తున్న వాస్తవమిది.


అంతకంతకూ ఉధృతమవుతున్న మతోన్మాదాన్ని పరిణామాలు రాజకీయ నాయకత్వం నిర్దేశం ప్రకారమే సంభవిస్తున్నాయా లేదా అన్నది మాకు తెలియదు. అయితే రాష్ట్ర స్థాయిలోనూ, స్థానిక స్థాయిలోనూ పాలనా యంత్రాంగం విద్వేష మూకలు నిర్భయంగా పాల్పడుతున్న భీతావహ చర్యలకు సానుకూల వాతావరణానికి ప్రోది చేస్తుందనడం నిరాధారమైన విషయం కాదు. అటువంటి మద్దతివ్వడం స్థానిక పోలీసులు, ఇతర పాలనాధికారుల నుంచి రావడమే కాదు, దానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలోని అత్యున్నత స్థాయి రాజకీయ నాయకత్వం నుంచి వత్తాసు లభిస్తుందని చెప్పక తప్పదు. స్థానిక స్థాయిలో విద్వేష మూకల ఆగడాలకు పాలనాపరమైన, సంస్థాపరమైన వాతావరణాన్ని ఆ అత్యున్నత స్థాయి రాజకీయ నాయకత్వం సమకూరుస్తోంది. హింసాకాండకు పాల్పడుతున్నది క్రింది స్థాయి వారే అయినప్పటికీ ఒక పథకంలో భాగంగా తమకు నిర్దేశించిన పాత్రను వారు నిర్వర్తిస్తున్నారనేది స్పష్టం. వారి చర్యలను సమర్థించేందుకు పార్టీ ప్రచార యంత్రాంగం అన్ని విధాల తోడ్పడుతోంది.


గతంలో సంభవించిన మతోన్మాద అల్లర్లకు, ప్రస్తుత మతోన్మాద హింసాకాండకు మధ్య ఒక తేడా ఉంది. ప్రస్తుత ఘటనలు, హిందూ రాష్ట్ర ఏర్పాటుకు రంగాన్ని సిద్ధం చేసే ప్రయత్నాలలో భాగంగా సంభవిస్తున్నాయి. అంతేకాదు, అటువంటి పరిణామాన్ని అంటే హిందూ రాష్ట్ర ఏర్పాటును నిరోధించే రాజ్యాంగ నియమాలు అమల్లోకి రాకుండా చేసి, మెజారిటేరియన్ నియంతృత్వానికి ఉపకరణమయ్యేలా చేయడమే వాటి లక్ష్యంగా ఉన్నది. మరి రాజకీయ, పాలనాపరమైన అధికారాలకు బుల్‌డోజర్ వాచ్యంగానూ, వాస్తవంగానూ ప్రతీక కావడంలో ఆశ్చర్యమేమీ లేదు. ‘యుక్తమైన ప్రక్రియ’, ‘చట్టబద్ధ పాలన’ అనే భావనల ఆధారంగా నిర్మాణమైన రాజ్యాంగ ప్రాసాదం కూల్చివేయబడింది. జహంగీర్‌పురి ఘటనలే ఇందుకు నిదర్శనం. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను కార్యనిర్వాహక వర్గం పాటించక పోవడాన్ని ఇంకెలా అర్థం చేసుకోవాలి?


ప్రధానమంత్రి గారూ, ‘కానిస్టిట్యూషనల్ కాండక్ట్ గ్రూప్’ సభ్యులమైన మేమందరమూ దశాబ్దాల పాటు రాజ్యాంగ సేవలో ఉండి, ప్రస్తుతం విశ్రాంత జీవితంలో ఉన్నాం. ఇప్పుడు మనమెదుర్కొంటున్న ముప్పు ఇంతకు ముందెన్నడూ ఎదుర్కోనిది. రాజ్యాంగ నైతికత, రాజ్యాంగ విహిత ప్రవర్తనకు మాత్రమే కాకుండా మన విశిష్ట, మహోన్నత నాగరికతా వారసత్వమైన సమ్మిళిత సామాజిక వ్యవస్థకు ప్రమాదం వాటిల్లనున్నది. అది ఛిన్నాభిన్నమై పోయే అవకాశముంది. ఇటువంటి విపత్సమయంలో కూడా మీరు మౌనం వహిస్తున్నారు! మీ వాగ్దానం సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ స్ఫూర్తితో మీ మనస్సాక్షికి విజ్ఞప్తి చేస్తున్నాం. భారత స్వాతంత్ర్య అమృతోత్సవాల తరుణంలో విద్వేష రాజకీయాలకు అంతం పలకాలని మీ పార్టీ నియంత్రణలో ఉన్న అన్ని ప్రభుత్వాలకు మీరు పిలుపు ఇవ్వగలరని ఆశిస్తున్నాం. సౌభ్రాతృత్వం, మత సామరస్యం వాతావరణంలో మాత్రమే మన జాతి నిర్మాతల భారత్ భావన సమున్నతమవుతుంది.

సత్యమేవ జయతే.

(సలాహుద్దీన్ అహ్మద్, గోపాలన్ బాలగోపాల్, సుందర్ బుర్రా, సుశీల్ దూబే, 

ఎఎస్ దులాత్ కమల్ జైస్వాల్, శివశంకర్ మీనన్, సత్వంత్ రెడ్డి, విజయ లతా రెడ్డి, 

హర్ష్‌ మాందర్‌, జూలియో రిబేరియో, అరుణారాయ్, సుజాతా సింగ్‌తో సహా 

108 మంది రిటైర్డ్ ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపిఎస్ అధికారుల లేఖకు స్వేచ్ఛానువాదం.)

Updated Date - 2022-04-29T09:00:52+05:30 IST