మోదీజీ.. మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి

ABN , First Publish Date - 2022-08-18T09:37:00+05:30 IST

బిల్కిస్‌ బానో కేసులో దోషులను గుజరాత్‌ ప్రభుత్వం విడుదల చేయడంపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

మోదీజీ.. మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి

‘బిల్కిస్‌ బానో’ దోషులను తిరిగి జైలుకు పంపండి: కేటీఆర్‌

మోదీ మాటలు, చేతల్లో తేడాను దేశమంతా చూస్తోంది: రాహుల్‌

మహిళలకు గౌరవం ఉపన్యాసాల్లోనేనా...: ప్రియాంక గాంధీ

హైదరాబాద్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): బిల్కిస్‌ బానో కేసులో దోషులను గుజరాత్‌ ప్రభుత్వం విడుదల చేయడంపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశం మొత్తం స్వతంత్ర భారత వజ్రోత్సవాలను సంబురంగా జరుపుకొంటున్న సందర్భంలో... హేయమైన చర్యకు పాల్పడిన రేపిస్టులను విడుదల చేయడం బాధాకరమన్నారు. ఐదు నెలల గర్భిణీపై సామూహిక అత్యాచారానికి పాల్పడినవారిని విడుదల చేయడం ద్వారా గుజరాత్‌ ప్రభుత్వం తన హీన మనస్తత్వాన్ని బయటపెట్టుకుందని విమర్శించారు. గుజరాత్‌ ప్రభుత్వ చర్యతో వ్యవస్థల మీద నమ్మకం పోతుందన్న కేటీఆర్‌... ఈ విషయంలో ప్రధాని మోదీ తక్షణం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్ర్తీలను గౌరవించాలని ఆగస్టు 15న ఎర్రకోట నుంచి దేశానికి నిర్దేశించిన ప్రధాని... తన మాటల్లోని నిజాయితీని నిరూపించుకోవాల్సిన సమయం ఇదే అన్నారు. గుజరాత్‌ ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేసి, ఖైదీలను తిరిగి జైలుకు పంపడం ద్వారా ప్రధాని తన చిత్తశుద్ధి, నిబద్దతను దేశానికి చాటాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రేప్‌ వంటి నేరాలకు పాల్పడితే ఉరిశిక్ష లేదా చనిపోయేవరకు జైలు శిక్ష విధించినప్పుడే అత్యాచారాలు ఆగే అవకాశం ఉందన్నారు.  ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన అత్యాచారం ఘటనలో మైనర్లనే ఒకే ఒక్క కారణంతో నిందితులు కఠిన శిక్ష నుంచి తప్పించుకున్నారని, బెయిల్‌ పొందారని కేటీఆర్‌ తెలిపారు. రేపిస్టులకు న్యాయస్థానాలు బెయిల్‌ ఇవ్వకుండా చట్ట సవరణలు చేయాలని, ఈ విషయంలో కేంద్రానికి తమ సహకారం ఉంటుందని చెప్పారు.


మోదీ, షాకు తెలియకుండానే జరిగిందా? 

బిల్కిస్‌ బానో కేసులో ఖైదీలను విడుదల చేయడంపై కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ స్పందించారు. ప్రధాని  మాటల్లో, చేతల్లో తేడాను దేశమంతా చూస్తోందని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాకు తెలియకుండానే, వారి ఆమోదం లేకుండానే గుజరాత్‌ ప్రభుత్వం ఖైదీలను విడుదల చేసిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ మాట్లాడుతూ... తమకు గౌరవం కేవలం ఉపన్యాసాల్లోనేనా అని మహిళలు అడుగుతున్నారన్నారు. గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడినవారిని విడుదల చేయటం, ఖైదీలకు కెమేరాల ముందు స్వాగతం పలకటం అన్యాయానికి, అమానుషత్వానికి పరాకాష్ట కాదా అన్నారు.. 2002లో గోద్రాలో జరిగిన అల్లర్లలో బిల్కిస్‌ బానోపై గ్యాంగ్‌ రేప్‌తోపాటు ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురు హత్యకు గురయ్యారు. ఈ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు 2008లో 11మందికి జీవిత ఖైదు విధించింది. 15ఏళ్ల తర్వాత ఖైదీలు క్షమాభిక్ష కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.... వారి దరఖాస్తులను పరిశీలించాలని గుజరాత్‌ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. దీనిపై కమిటీని ఏర్పాటుచేసిన గుజరాత్‌ ప్రభుత్వం... కమిటీ సిఫార్సుల మేరకు ఖైదీలను సోమవారం విడుదల చేసింది.


నా నమ్మకం కదిలిపోయింది!

నా జీవితాన్ని, నా కుటుంబాన్ని నాశనం చేసి.. నా మూడేళ్ల కూతుర్ని నాకు దూరం చేసిన 11 మంది నిర్దోషులుగా పేర్కొంటూ రెండు రోజుల క్రితం ఆగస్టు 15న వచ్చిన తీర్పుతో.. 20 ఏళ్లుగా నన్ను బాధిస్తున్న గాయం మళ్లీ తిరగబెట్టింది. నాకు మాటలు రాక.. స్తబ్దుగా ఉండిపోయాను. మనదేశంలోని న్యాయస్థానాలను, వ్యవస్థలను నేను నమ్మాను. కానీ.. ఈ కేసులో దోషులను విడుదల చేయడం నా మనశ్శాంతిని దూరం చేసింది. న్యాయంపై నా నమ్మకాన్ని కదిలిపోయేలా చేసింది. నా బాధ.. రెపరెపలాడుతున్న నా విశ్వాసం.. నా ఒక్కదాని కోసమే కాదు. న్యాయస్థానాల్లో న్యాయం  కోసం పోరాడుతున్న మహిళలందరి కోసం. ప్రశాంతంగా, నిర్భయంగా జీవించే నా హక్కును తిరిగి  నాకివ్వాల్సిందిగా గుజరాత్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.

- బిల్కిస్‌  బానో

Updated Date - 2022-08-18T09:37:00+05:30 IST