సిద్ధాంత, సంక్షేమ చక్రాలపై మోదీ రథం!

ABN , First Publish Date - 2022-08-19T09:33:23+05:30 IST

75సంవత్సరాల స్వతంత్ర భారతావని ఎమర్జన్సీ, తీవ్రవాద కశ్మీర్, బలహీన విదేశాంగ విధానం, అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం ఇలా ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని నేడు ప్రపంచ పటంలో...

సిద్ధాంత, సంక్షేమ చక్రాలపై మోదీ రథం!

75సంవత్సరాల స్వతంత్ర భారతావని ఎమర్జన్సీ, తీవ్రవాద కశ్మీర్, బలహీన విదేశాంగ విధానం, అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం ఇలా ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని నేడు ప్రపంచ పటంలో పటిష్టమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. ఈ ప్రయాణంలో 2014 తరువాత దేశంలో జరిగిన అనేక పరిణామాలపైన, వాటిపై వస్తున్న విమర్శలపైన వాస్తవాల ఆధారంగా విశ్లేషణ చేయడం ఆవశ్యం.


2014 తర్వాత భారతదేశ రాజకీయాల్లో వచ్చిన మార్పులనూ, జాతీయ, అంతర్జాతీయ, సామాజిక, ఆర్థిక వ్యవస్థలపైన వాటి ప్రభావాన్నీ రెండు భాగాలుగా విశ్లేషణ చేయాలి. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా 2014 నుంచి 2019 మధ్య తీసుకున్న నిర్ణయాల్లో స్వచ్ఛ భారత్, సమగ్ర శిక్ష అభియాన్, బేటీ పడావో–బేటీ బచావో, అర్హులైన పేదవారికి గృహాలు, ఆయష్మాన్ భారత్, ఆహర భద్రత చట్టం క్రింద 80కోట్ల పేదలకు సహాయం, స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా యువతకు శిక్షణ, వృద్ధాప్య పింఛన్ ఇలా ఎన్నో ఉన్నాయి. ఈ పథకాల ద్వారా మోదీ దేశంలో దారిద్ర్య రేఖ దిగువన జీవిస్తున్న ప్రజలకు ‘సామాజిక భద్రత’ కల్పించడానికి పెద్ద పీట వేశారు. మరోవైపు, గ్రామీణ భారత సమ్మిళిత అభివృద్ధి కోసమూ పలు చర్యలను చేపట్టారు. రైతులకు అందించే యూరియాకి వేపపూత వేయించటం ద్వారా నాణ్యత ప్రమాణాలను పెంచడం, రైతులకు కనీస మద్దతు ధరపై ధాన్యం సేకరణ, ఫసల్ బీమా యోజన ద్వారా రైతులకు నష్టనివారణ, ఉపాధిహమీ పథకాన్ని విస్తృతపరచడం ద్వారా కనీస పనిదినాల అమలు ద్వారా వేతనాలు అందేలా చేయడం, గ్రామీణ సడక్ యోజన క్రింద రహదారుల అభివృద్ధి... ఇలా మోదీ నిర్ణయాలు గ్రామీణ భారతంపై ఎంతో సానుకూల ప్రభావాన్ని చూపించాయి.


దేశానికి సంక్షేమం, అభివృద్ధి జోడెద్దులు అనే ప్రాథమిక సూత్రాన్ని మోదీ నమ్మారు. అందుకే సామాజిక, పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిపెట్టారు. ముఖ్యంగా సాగరమాల పరియోజన ద్వారా రూ.5.48లక్షల కోట్ల వ్యయంతో 802ప్రాజెక్టులు, నౌక, విమాన, రైలు, రహదారి మార్గాల కనెక్టివిటీ పైన దృష్టి సారించారు. ఈ వ్యయంలో రూ.2.12లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను 2024 కల్లా పూర్తి చేసే విధంగా పురోగతి జరుగుతోంది. మరోవైపు, భారతమాల పరియోజన ద్వారా మొదటి దశగా 34,800 కిలోమీటర్ల జాతీయ రహదారులను రూ.10.63 లక్షల కోట్ల వ్యయంతో 2027 నాటికి పూర్తి చెయ్యాలన్న లక్ష్యం వేగంగా సాగుతోంది. ఇందులో భాగంగా 2022 డిసెంబరు నెలకి 7,375 కిలోమీటర్ల నిడివి పూర్తయింది. ఈ ప్రాజెక్టులన్నింటినీ రూ.111 లక్షల కోట్ల ప్రధానమంత్రి గతిశక్తి యోజన ద్వారా అనుసంధానించటం ద్వారా దేశ జీడీపీ 4శాతం నుంచి 5శాతం మధ్య అదనంగా పెరిగే అవకాశం కలుగుతుంది. తద్వారా ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు లభించటంతోపాటు, పారిశ్రామిక ప్రగతి జరిగి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగి, నిరుద్యోగ రేటు నియంత్రణకి వస్తుంది. ప్రభుత్వానికి ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రాబడి పెరిగి దేశ ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుంది. దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది.


2019 తర్వాత ప్రపంచ ఆర్థిక మందగమనం యొక్క ప్రభావాన్ని తట్టుకోవడానికి, ఆటోమొబైల్, టెక్స్‌టైల్, ఎన్.బి.ఎఫ్.సి రంగాలను ఆదుకోవడానికి కేంద్ర ఆర్థికశాఖ అనేక సంస్కరణలను ప్రకటించింది. అలాగే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ రూ.100లక్షల కోట్ల జాతీయ మౌలిక సదుపాయాల పైప్‌లైన్ ప్రణాళికను 2019–20 ఆర్థిక సంవత్సర బడ్జెట్టులో ప్రకటించారు. ఈలోగా 2019–20 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం, 2020–21 ఆర్థిక సంవత్సరం కరోనా లాక్ డౌన్ ప్రభావంలో పడింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైన ఈ సందర్భానికి భారతదేశమూ మినహాయింపు కాలేకపోయింది. నేటికీ ఆ ప్రభావం చాయలు ఉన్నప్పటికీ, ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.21లక్షల కోట్ల ఆత్మనిర్భర భారత్ ప్యాకేజీ ప్రభావం వల్ల ఆర్థిక వ్యవస్థ క్రమంగా గాడిలో పడటం మొదలైంది. అంతేకాదు, అంతర్జాతీయ ఏజెన్సీల అంచనా ప్రకారం, 2022–23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వృద్ధిరేటు సాధించనున్నది.


ఆర్థిక వ్యవస్థలో గత ముప్ఫై ఏళ్ళుగా అమలులో ఉన్న సంస్కరణలను కొనసాగిస్తూనే, మోదీ వాటిలోని తప్పులను సరిదిద్దుతున్నారు. అవసరమైన సవరణలను చేస్తున్నారు. ఆదాయ వనరులను పెంచుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియలో స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియాతో పాటు నేటికీ అనేక రాజకీయ విమర్శలను ఎదుర్కొంటున్న పెట్టుబడుల ఉపసంహరణ, డీమానిటైజేషన్, జీఏస్టీ వంటి కీలక నిర్ణయాలు కూడా భాగమే. వీటి వాస్తవ ఫలితాలు ఇప్పుడిప్పుడే బహిర్గతం అవుతున్నాయి. అయినా విమర్శకులు ఇంకా గతంలో పాడిన పాటే పాడుతున్నారు. కరోనా లాక్‌డౌన్, ప్రపంచంలో వివిధ దేశాల ఆర్థిక మందగమనం, బ్రెక్జిట్, చమురు ధరల హెచ్చుతగ్గుల ప్రభావం, ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం, ఇప్పుడు తైవాన్‌తో చైనా యుద్ధ వాతావరణం... ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా మోదీ తన పాలనా చాతుర్యంతోనూ, పటిష్టమైన విదేశాంగ విధానంతోనూ భారతదేశాన్ని ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దారు. అయినప్పటికీ– అవినీతి కేసులను ఎదుర్కొంటున్న రాజకీయ ప్రత్యర్థులు, మంత్రి పదవుల కోసం అర్రులు చాచేవారు, పదవి కొనసాగింపు అవకాశం రాని బ్యాకింగ్ నిపుణులు, వామపక్ష ముసుగులోని ఆర్థిక మేధావులు గుడ్డి వ్యాఖ్యానాలతో మోదీని తప్పు పడుతూనే ఉన్నారు.


ఈ మధ్య కొన్ని గణాంకాల విశ్లేషణ చేయడంలో ‘చిదంబర’ రహస్యం బహిర్గతం అయ్యింది. ముఖ్యంగా ప్రస్తుత 2022–23 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనా ద్రవ్యలోటు 6.4శాతం, అంటే రూ.16,61,196 కోట్లు అయితే, మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో ద్రవ్యలోటు రూ.3,51,871 కోట్లు మాత్రమే నమోదు కావడాన్ని తట్టుకోలేక విమర్శలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదాయ, వ్యయాలను తక్కువగా చూపారు అని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం వ్యాఖ్యానించడం అర్థరహితం. ద్రవ్యలోటు ఎలా భర్తీ చేస్తారో తెలియకుండానే ఆయన ఈ దేశానికి ఆర్థికమంత్రిగా పని చేశారా అనే అనుమానం కలుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ద్రవ్యలోటు 6.4శాతం వద్ద కట్టడి చేయగలదా అనేవారికి అంచనాలను మించిన జీఏస్టీ, ప్రత్యక్ష పన్నుల వసూళ్లే సమాధానం.


మరోవంక, కరెంటు ఖాతా లోటును గత సంవత్సరం 3000 కోట్లతో ప్రస్తుత సంవత్సర అంచనా 10,000 కోట్లు అని పోల్చేముందు ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం వల్ల పెరిగిన చమురు ధరల ప్రభావాన్ని విస్మరిస్తే ఎలా? అలాగే గత ఏడాది అంత ర్జాతీయ వాణిజ్యం ఎంత, ఈ సంవత్సరం ఎంత– అనే అంశాలను పరిగణనలోకి తీసుకోకకుండా ఆర్థిక వ్యవహారాల్లో రాజకీయ వ్యాఖ్యలు జొప్పించే ప్రయత్నం చేస్తున్నారు చిదంబరం. ఇంత ప్రతికూల అంతర్జాతీయ వాణిజ్య ఒత్తిడిలో కూడా మన వద్ద 573.875 బిలియన్ డాలర్ల విదేశీమారక నిల్వలు ఉండడం అనుకూలాంశం. ఇక ద్రవ్యోల్బణ అదుపు కోసం ఆర్బీఐ వడ్డీ రేట్లపైన తీసుకొనే నిర్ణయాలను ప్రభుత్వానికి సంబంధం లేదంటూనే ప్రభుత్వంపైన రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్బీఐ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకున్నందునే నేడు అనేక అభివృద్ధి చెందిన దేశాలకన్న పటిష్టంగా భారతదేశం ఉంది. అందుకే ఆర్థికమాంద్యం ఛాయలు ఇక్కడ లేవు. 2014 ముందు పెట్రోలు, డీజిలు పైన కంపెనీలకు చెల్లించాల్సిన సబ్సిడీని నేడు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తూంటే సెస్, సర్‌ఛార్జీ అంటూ చిల్లర ప్రచారం ఎక్కువైంది. పెట్రోలు, డీజిలు సెస్, సర్‌ఛార్జీలను ప్రశ్నించే పెద్దలు 2014 ముందు జాతీయ రహదారుల, రైల్వే లైన్ల నిడివి ఎంత, ఇప్పడు ఎంత అనేది బేరీజు వేయగలరా?


ఒకవైపు సిద్ధాంత మూలాలను మరచిపోకుండా ఆర్టికల్ 370 రద్దు, సీఏఏ, ట్రిపుల్ తలాక్, అయోధ్య రామాలయ నిర్మాణం... ఈ అంశాలన్నింటిలో ధైర్యంగా విజయవంతంగా వేసిన ముందడుగులనూ, మరోవైపు దేశంలో నేడు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలనూ పరిశీలిస్తే నరేంద్ర మోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చేసరికే ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఉన్నారనీ, ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’ అనే జాతీయవాద స్ఫూర్తితో అమృతోత్సవ సందర్భంలోకి భారతదేశాన్ని నడిపిస్తున్నారనీ అర్థమవుతుంది.

లంకా దినకర్

Updated Date - 2022-08-19T09:33:23+05:30 IST