బహుళ ప్రయోజనాల మోదుగాకుల కూర!

ABN , First Publish Date - 2022-06-11T06:21:31+05:30 IST

మోదుగ పూలు ఎర్రగా చిలుకముక్కు ఆకారంలో ఉంటాయి అందుకని వాటిని కింశుక లేదా కింశులక అన్నారు.

బహుళ ప్రయోజనాల మోదుగాకుల కూర!

మోదుగ పూలు ఎర్రగా చిలుకముక్కు ఆకారంలో ఉంటాయి అందుకని వాటిని కింశుక లేదా కింశులక అన్నారు. ఎర్రగా విరగ పూస్తాయి కాబట్టి, వీటిని రక్తపుష్పక అనీ అగ్నిపూలు అనీ పిలుస్తారు. పలాశ అని కూడా పిలుస్తారు. మోదుగ ఆకులతో విస్తళ్లు కుట్టి అందులో భోజనం చేస్తే వాతవ్యాధులు, కఫ వ్యాధుల్లో మేలు చేస్తుందని ఆయుర్వేద గ్రంఽథాలు చెప్తున్నాయి. ఈ ఆకుల్నే ఆహార పదార్థంగా తీసుకుంటే ఇంకెంత ప్రయోజనకరంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. మోదుగలో రసాయనాలు ఉత్తమమైన క్షారగుణాలు కలిగి ఉంటాయి కాబట్టి దీన్ని ‘క్షారశ్రేష్ఠ’ అంటారు.  బ్రహ్మవృక్షం, బ్రహ్మోపనేత్ర ఇలా ఒక పవిత్ర వృక్షంగా కూడా దీన్ని పిలుస్తారు. మోదుగ పూలు, ఆకులు, కొమ్మలు, వేళ్లు, గింజలు వీటన్నింటికీ గుణాలు ఇంచుమించు సమానమే! వీటిలో లేతాకులు కూరగా వండుకోవటానికి పనికొస్తాయి. పాకదర్పణం గ్రంఽథంలో నలుడు మోదుగాకుల కూరగురించి అనేక విశేషాలు చెప్పాడు. 


మోదుగ మొక్కలు దారిపక్కన పెరిగేవే! దీని లేతాకులతో కూరని వండుకుని తరచూ తింటూ ఉంటే జీర్ణకోశవ్యాధులు, కడుపులో పెరిగే ఎలికపాముల లేకుండా పోతాయి. అతిసార వ్యాధిని, అమీబియాసిస్‌ వ్యాధిని బాగా తగ్గిస్తుంది. షుగరు వ్యాధిని తగ్గించే గుణం దీనికి ఉంది. లైంగిక శక్తిని పెంచుతుంది. విరేచనం సాఫీగా అయ్యేలా చేస్తుంది. లివర్‌ వ్యాధుల్లో పనిచేస్తుంది. పొట్టలోపల అవయవాలలో ఏర్పడే వాపుని తగ్గిస్తుంది. నడుము చుట్టూ ఉన్న అవయవాలకు రక్తప్రసారం పెరిగేలా చేస్తుంది. ఈ చెట్టు కాండం నుండి కీనో అనే జిగురుపదార్థం స్రవిస్తుంది. దీనికి మొలలవ్యాధుల్ని తగ్గించే ప్రయోజనం ఉంది. మౌలికంగా మోదుగ చెట్టు పంచాంగాలూ విషదోషాలను హరించే అమృతం లాంటివి. డయాలసిస్‌ అవసరమైన పరిస్థితుల్లో ఉన్నవారికి లేతమోదుగ ఆకులు బాగా ఉపయోగపడతాయి. చర్మవ్యాధుల మీద కూడా వీటికి ఔషధ ప్రయోజనం ఉంది. మోదుగ గింజల్ని ’మోదుగమాడలు‘ అంటారు. ఇవి నులిపురుగుల్ని పోగొట్టటంలో బాగా పనిచేస్తాయి. అద్దకం పరిశ్రమలో మోదుగ పూలను కాషాయవర్ణం కోసం వాడతారు. కాకరకాయల దోషాలకు మోదుగ క్షారం విరుగుడు. అందుకని కాకరతో వంటకాలు చేసేప్పుడు ఒకటి రెండు మోదుగ ఆకుల్ని తరిగి కలిపి వండితే కాకరకాయలు పడకపోవటం అనేది ఉండదు. 


లేత మోదుగ ఆకులు చిరుచేదుగా ఉంటాయి. ఎర్రతోటకూర లేదా పెరుగుతోటకూరతో ఈ ఆకుల్ని కలిపి తరిగి ఉడికించి నీటిని వార్చేస్తే చేదు తగ్గుతుందంటాడు నలుడు. దీనికి తగినంత చుక్కకూర, చింత చిగురు లేదా చింతపండు లాంటి  పులుపు ద్రవ్యాల్ని కలిపి సుగంధద్రవ్యాలు చేర్చి ఇగురుకూర వండుకోవాలన్నాడు. కఫవ్యాధులతోనూ, వాతవ్యాధులతోనూ, మానని వ్రణాలతోనూ ఇన్‌’ఫెక్షన్లతోనూ, కడుపులో పెరిగే ఎలికపాముల్లాంటి వాటితోనూ సతమతమయ్యేవారికి తరచూ మోదుగ లేతాకుల కూర వండిపెడుతూ ఉంటే ఆయా వ్యాధులకు వాడే ఔషధాలు శక్తివంతంగా పనిచేస్తాయన్నాడు నలుడు.  మోదుగ ఆకుల్ని ఎండించి దంచిన పొడితో టీ కాచుకుని  రోజూ రెండు పూటలా తీసుకుంటూ ఉంటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి.


మోదుగ ఆకులు కేవలం జబ్బులున్న వాళ్ళకే అనుకోనవసరం లేదు. స్త్రీ పురుషులు, బాల వృద్ధు లందరికీ వండి పెట్టవచ్చు. మోదుగకు విరిగిన ఎముకలు త్వరగా అతుక్కునేలా చేసే గుణం కూడా ఉంది.  మెనోపాజ్‌ ఎదుర్కొంటున్న స్త్రీలకు ఇది మంచిది. సొరియాసిస్‌ లాంటి భయంకర చర్మవ్యాధులమీద కూడా పనిచేస్తుంది. షుగరు వ్యాధి, మూత్ర పిండాల వ్యాధుల్లో దీనికి ఎక్కువ ప్రయోజనాలున్నాయి. 


గంగరాజు అరుణాదేవి

Updated Date - 2022-06-11T06:21:31+05:30 IST