మరుగునపడిన మేధావి మోదుకూరి జాన్సన్‌

Published: Mon, 08 Aug 2022 00:38:53 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మరుగునపడిన మేధావి మోదుకూరి జాన్సన్‌

మోదుకూరి జాన్సన్‌ పేరు వినగానే మానవుడు - దానవుడు, కరుణామయుడు, దేవాలయం, నేటి భారతం సినిమాలు గుర్తుకు వస్తాయి. నాటక ప్రపంచంలో ‘నటనాలయం’ పేరు తలిస్తే  జాన్సన్‌ గుర్తుకు వస్తాడు. పాడిపంటలు సినిమాలో ‘మన జన్మ భూమి బంగారు భూమి’ పాటను శ్రీశ్రీ రాశారా అనుకునేంత గొప్పగా రాశాడు జాన్సన్‌. దళిత రచయితలకు సినిమా రంగంలో అవకాశాలు రావటం, నిలదొక్కుకోవటం, రాణించటం అంత సులభమైన పనికాదు. ప్రముఖ నాటక రచయిత పాటిబండ్ల ఆనందరావు సైతం సినిమా రచయితగా ప్రయత్నం చేసి అక్కడ ఇమడలేక తిరిగి వచ్చి నాటకాన్నే నమ్ముకున్న పరిస్థితి. ఒక ‘జాలాది’ మాత్రం ప్రత్యేకమైన పల్లె పదాలతో తనదైన ఒక బాణీలో పాటలు రాసి నిలదొక్కుకున్నాడు.

మోదుకూరి జాన్సన్‌ ఏనాడూ సినీ పరిశ్రమకు వెళ్ళాలని ప్రయత్నం చెయ్యలేదు. సినీ పరిశ్రమే ఆయన ప్రతిభను గుర్తించింది. ‘నటనాలయం’ నాటకాన్ని తెనాలి దగ్గర ఒక పల్లెటూర్లో ప్రముఖ సినీ నటుడు గుమ్మడి చూశారు. గుమ్మడికి అందులోని సన్నివేశాలు, విషయాన్ని కొత్త కోణంలో చెప్పిన విధానం నచ్చింది. అదే కాలంలో అక్కినేని నాగేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావు మరో ప్రపంచం సినిమా కోసం ‘ఎవరన్నా కొత్త రచయితలు ఉంటే చెప్పండి’ అని గుమ్మడిని అడగ్గా వెంటనే మోదుకూరి జాన్సన్‌ని సిఫారసు చేసి మద్రాసు పిలిపించి పరిచయం చేశారు. ఆ విధంగా జాన్సన్‌ మరో ప్రపంచంలోకి అడుగుపెట్టి వెనుదిరిగి చూడలేదు. తెలుగు సినీరంగంలో రచయితగా చెరగని ముద్ర వేశాడు జాన్సన్‌. జాన్సన్‌ 1962లో తెనాలిలో కొంతకాలం అడ్వకేట్‌గా పనిచేశాడు. ఆ రోజుల్లో రాడికల్‌ హ్యుమనిస్టులతో ేస్నహం, చర్చలతో సామాజిక అవగాహన పెంచుకున్నాడు. ఆయనలో సృజనాశక్తి ఉన్నందువల్ల ‘దేవాలయం’, ‘హృదయాలయం’, ‘నాగరికత’, ‘నిచ్చెనమెట్లు’ వంటి చాలా నాటకాలు రాశాడు, ప్రదర్శించాడు. జాన్సన్‌ సినిమాలో ఇన్వాల్వ్‌ అయితే ఎలాంటి సాహిత్యం వస్తుందనడానికి ఉదాహరణ కరుణామయుడు. జాన్సన్‌ మాటలు రాసిన ఈ చిత్రంలోనే చిరస్థాయిగా నిలిచిపోయే పాట ఒకటి రాశాడు. ‘కదిలిందీ కరుణ రధం, సాగిందీ క్షమాయుగం మనిషి కొరకు దైవమే కరిగీ వెలిగె కాంతి పథం’. ఈ పాట జాన్సన్‌ తప్ప ఎవరు రాసినా ఆ స్థాయిలో రాయలేరు. మానవుడు - దానవుడు సినిమా జాన్సన్‌కు డైలాగ్‌ రైటర్‌గా గుర్తింపు తెచ్చింది. ‘అవసరానికి మించి ఐశ్వర్యం ఇస్తే మనిషి కన్నుమిన్నూ కానబోడేమో, కడుపుకు చాలినంత కబలమీయకుంటే మనిషి నీతీ నియమం పాటించడేమో’ అంటూ దేవుడికి మానవుడి బలహీనతల గురించి వివరిస్తాడు జాన్సన్‌. రాసేది భక్తి గీతమే అయినా, అందులోనూ సామాజికాంశాన్ని చొప్పించడం జాన్సన్‌ ప్రత్యేకత.

రామానాయుడు, కృష్ణ లాంటి నిర్మాతలు జాన్సన్‌ను కోరి మరీ తమ సినిమాల్లో రచన చేయించుకున్నారు. నవయుగ కవి చక్రవర్తి గుఱ్ణం జాషువాతో జాన్సన్‌కు ఆత్మీయ సంబంధం ఉంది. దళితుడుగా తాను పడే బాధలను చెప్పడానికి జాషువా ‘గబ్బిలం’ రాస్తే, జాన్సన్‌ అదే విషయాన్ని మరింత బలంగా వినిపించడానికి ‘కాకి’ కావ్యం రాసి, ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల వేదిక మీద చదివాడు. జాషువా ‘స్మశానం’ మీద పద్యం రాేస్త, జాన్సన్‌ అదే స్మశానాన్ని ‘దేవాలయం’ సినిమాలో కళ్యాణ వేదికగా మలిచాడు. జాషువా తన చివరి కాలం ఎక్కువగా తెనాలి ప్రాంతంలోనే గడిపాడు. ఈ ప్రాంతం వేస్త జాన్సన్‌ తప్పకుండా జాషువా వెంట ఉండేవాడు. దళితుల ఆత్మ గౌరవం కోసం కులాన్ని పేరు చివర పెట్టుకోవడమే మంచిదని 1970 ప్రాంతాల్లోనే తను ‘కాకి’ కావ్యం రాేస నాటికే అభిప్రాయపడిన క్రాంతి దర్శి జాన్సన్‌.

తెనాలి సమీపంలో 1934 సంవవత్సరంలో ఆగస్టు 8న మోదుకూరి గురవయ్య, రత్నమ్మ దంపతులకు జన్మించాడు జాన్సన్‌. వీరిది సాధారణ వ్యవసాయ కూలీ మాదిగ కుటుంబం. జాన్సన్‌ కళావాచస్పతి జగ్గయ్య శిష్యుడు. ఆయనే జాన్సన్‌కు ‘అగ్నికవి’ అని నామకరణం చేశాడు. గుంటూరు ఏ.సి. కాలేజీలో బి.ఏ. చదివినప్పుడు ఇంగ్లిష్‌ లెక్చరర్‌ రోశయ్య, తర్వాత ‘లా’ చదవడానికి ఆంధ్ర యూనివర్శిటీ వెళ్ళినప్పుడు అక్కడ కూర్మ వేణుగోపాలస్వామి జాన్సన్‌లోని కవిని, నాటక రచయితని నిద్రలేపి నిలబెట్టారు. ప్రపంచానికి పరిచయం చేశారు. జాన్సన్‌ 1988 డిసెంబర్‌ 24న గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.‘చలన చిత్రాలను ప్రేక్షకులు కేవలం వినోదం కోసమే చూస్తారంటే నేను నమ్మను. ప్రజల కష్ట సుఖాలు, వారి సమస్యలకు పరిష్కారాలు చెప్పే చిత్రాలు కూడా చూస్తారు. అసలు సినిమా లక్షణం, ప్రయోజనం అదేనని నా గట్టి నమ్మకం’ అని ఓ సందర్భంలో చెప్పారు మోదుకూరి జాన్సన్‌.

కత్తి కళ్యాణ్‌

(నేడు ఒంగోలులో మోదుకూరి జాన్సన్‌ జయంతి ఉత్సవాల సందర్భంగా)


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International