Mohammad Hafeez: ప్రపంచ క్రికెట్‌కు భారత్‌ను ముద్దుబిడ్డగా అభివర్ణించిన పాక్ క్రికెటర్!

ABN , First Publish Date - 2022-09-03T22:11:37+05:30 IST

డబ్బుంటే చాలు అప్పటి వరకు లేని బంధాలు కూడా వచ్చి చేరుతుంటాయి. అది లేనప్పుడు మనవైపు చూసే వారు

Mohammad Hafeez: ప్రపంచ క్రికెట్‌కు భారత్‌ను ముద్దుబిడ్డగా అభివర్ణించిన పాక్ క్రికెటర్!

దుబాయ్: డబ్బుంటే చాలు అప్పటి వరకు లేని బంధాలు కూడా వచ్చి చేరుతుంటాయి. అది లేనప్పుడు మనవైపు చూసే వారు కూడా ఎవరూ ఉండరు. అందుకే ‘ధనం మూలం ఇదం జగత్’ అంటారు. అది నిజమేనంటాడు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ (Mohammad Hafeez). బీసీసీఐ (BCCI) వద్ద అంత డబ్బు ఉంది కాబట్టే అది ప్రపంచ క్రికెట్‌కు ముద్దుబిడ్డలా మారిపోయిందని వ్యాఖ్యానించి విమర్శలు మూటగట్టుకున్నాడు. బీసీసీఐకి ఆదాయ వనరులు పుష్కలంగా ఉన్నాయని చెప్పుకొచ్చాడు. అందుకనే ప్రపంచం నలుమూలల నుంచి దానికి అంతగా ప్రేమాభిమానాలు లభిస్తున్నాయని అన్నాడు.


‘‘నాకు ఇంతకుమించి తెలియదు కానీ, ఈ సమాజం గురించి మాత్రం బాగా తెలుసు. ఎవరైతే డబ్బు సంపాదిస్తారో వారిని అందరూ ఇష్టపడతారు. అలాంటి వారికే ప్రతి ఒక్కరి నుంచి ముద్దులు లభిస్తాయి’’ అని హఫీజ్ చెప్పుకొచ్చాడు. ఇండియా ఆర్జించే దేశమని, అందుకే ప్రపంచంలోని ఏ దేశంతో అది ద్వైపాక్షిక సిరీస్ ఆడినా స్పాన్సర్లు లభిస్తారని పేర్కొన్నాడు. అంతేకాదని, వారికి జాక్‌పాట్ కూడా లభిస్తుందని, అది కాదనలేని సత్యమని అన్నాడు. ఇండియా బాగా ఆడుతుందని అందరూ దానిని ఇష్టపడుతున్నారా? లేక, బాగా డబ్బులు సంపాదిస్తోందని ఇష్టపడుతున్నారా? అన్న ప్రశ్నకు హఫీజ్ స్పందిస్తూ.. ‘రెండోదో’ నిజమన్నాడు. 


హఫీజ్ చేసిన ఈ వ్యాఖ్యలు క్రికెట్ ప్రేమికులకు అంతగా రుచించలేదు. దీంతో అతడిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. కాగా, ఇటీవల టీమిండియా సారథి రోహిత్ శర్మపైనా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. రోహిత్ శర్మ బాడీ లాంగ్వేజ్ అతడు భయపడుతున్నాడని, అయోమయంగా ఉన్నాడని చెబుతోందని పేర్కొన్నాడు. అంతేకాదు, కెప్టెన్‌గా అతడు ఎక్కువకాలం కొనసాగకపోవచ్చని జోస్యం చెప్పాడు. టాస్ వేయడానికి బయటకు వచ్చినప్పుడు రోహిత్ చాలా నీరసంగా కనిపించాడని, భయపడుతున్నట్టు అనిపించిందని అన్నాడు. అద్భుతమైన ఇన్నింగ్స్‌ల ఆడిన రోహిత్ శర్మలా తనకు కనిపించలేదన్న హపీజ్.. కెప్టెన్సీ కారణంగా అతడిపై ఒత్తిడి పడుతోందని, చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాడని వివరించాడు. 

Updated Date - 2022-09-03T22:11:37+05:30 IST