ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా మహ్మద్ రిజ్వాన్

ABN , First Publish Date - 2021-12-18T00:19:41+05:30 IST

పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ మహ్మద్ రిజ్వాన్ అత్యంత అరుదైన రికార్డు సాధించాడు. టీ20 క్రికెట్‌లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో 2 వేల..

ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా మహ్మద్ రిజ్వాన్

కరాచీ: పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ మహ్మద్ రిజ్వాన్ అత్యంత అరుదైన రికార్డు సాధించాడు. టీ20 క్రికెట్‌లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో 2 వేల పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. టీ20ల్లో రిజ్వాన్ ఇప్పటి వరకు ఓ సెంచరీ, 18 అర్ధ సెంచరీలు సాధించాడు. వీటిలో 1326 పరుగులను 29 మ్యాచుల్లో 134.89 స్ట్రైక్ రేట్‌తో, 73.66 సగటుతో సాధించాడు. రిజ్వాన్ ఈ ఏడాది 12 అర్ధ సెంచరీలతోపాటు ఓ సెంచరీ సాధించాడు. ఇవన్నీ అంతర్జాతీయ టీ20ల్లో వచ్చినవే కావడం గమనార్హం. 


ఒకే క్యాలెండర్ ఇయర్‌‌‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు ఇప్పటి వరకు విండీస్ దిగ్గజ ఆటగాడు క్రిస్ ‌గేల్‌పై ఉంది. గేల్ ఒకే క్యాలెండర్ ఇయర్‌లో 1665 పరుగులు సాధించాడు. ఇప్పుడు రిజ్వాన్ ఆ రికార్డును బద్దలు కొట్టగా, 1700 పైచిలుకు పరుగులతో అతడి ఓపెనింగ్ పార్ట్‌నర్ బాబర్ ఆజం రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.


వెస్డిండీస్‌తో గురువారం కరాచీలో జరిగిన చివరి టీ20లో పాకిస్థాన్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. విండీస్ నిర్దేశించిన 207 పరుగుల విజయ లక్ష్యాన్ని మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే అందుకుంది. ఈ మ్యాచ్‌లో రిజ్వాన్ (87), బాబర్ ఆజం (79) కలిసి తొలి వికెట్‌కు 158 పరుగులు జోడించారు.


టీ20ల్లో వీరిద్దరికీ ఇది ఆరో సెంచరీ భాగస్వామ్యం. ఫలితంగా రోహిత్ శర్మ-కేఎల్ రాహుల్ ఐదు సెంచరీల భాగస్వామ్య రికార్డు బద్దలైంది. అలాగే, బాబర్‌కు టీ20ల్లో ఈ ఏడాది ఇది 20వ అర్ధ సెంచరీ కావడం గమనార్హం. ఒక క్యాలండర్ ఇయర్‌లో ఇన్ని సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్‌గా బాబర్ రికార్డులకెక్కడాడు.


అలాగే, రిజ్వాన్-బాబర్‌కు ఈ ఏడాది ఇది నాలుగో సెంచరీ భాగస్వామ్యం. కాగా, ఈ ఏడాది మొదట్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 197 పరుగుల భాగస్వామ్యం జోడించగా, ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం. 

Updated Date - 2021-12-18T00:19:41+05:30 IST