సత్యం వధ!

ABN , First Publish Date - 2022-07-02T08:53:31+05:30 IST

త్రికేయుడు, ఆల్ట్ న్యూస్ వెబ్ సైట్ సహవ్యవస్థాపకుడు మొహమ్మద్ జుబైర్ తన అరెస్టునూ పోలీసు రిమాండునూ సవాలు చేస్తూ దాఖలు చేసుకున్న పిటిషన్ పై..

సత్యం వధ!

పాత్రికేయుడు, ఆల్ట్ న్యూస్ వెబ్ సైట్ సహవ్యవస్థాపకుడు మొహమ్మద్ జుబైర్ తన అరెస్టునూ పోలీసు రిమాండునూ సవాలు చేస్తూ దాఖలు చేసుకున్న పిటిషన్ పై స్పందించడానికి ఢిల్లీ హైకోర్టు శుక్రవారం పోలీసులకు రెండు వారాల సమయం ఇచ్చింది. ఎఫ్ఐఆర్ కాపీలేకుండా, కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా తన క్లయింట్ ను ఉన్నపళంగా అరెస్టుచేసి పట్టుకుపోయారని జుబైర్ తరఫు న్యాయవాది విన్నవించుకున్నారు. రిమాండ్ కొనసాగించాలా లేదా అన్నది మేజిస్ట్రేట్ నిర్ణయిస్తారనీ, పోలీసులు తమ వద్ద ఉన్న ఆధారాలు అక్కడ చూపాలని హైకోర్టు పేర్కొంది. జుబైర్ అరెస్టు విషయంలో పోలీసులు ప్రదర్శించినంత వేగాన్ని న్యాయస్థానాలనుంచి ఆశించలేం కానీ, ఆయనను తక్షణం విడుదల చేయాలన్న ప్రజాసంఘాల, ఎడిటర్స్ గిల్డ్ కోరిక మాత్రం ఇప్పట్లో నెరవేరే సూచనలు కనిపించడం లేదు.


రాజు తలుచుకుంటే.. అన్న సామెత పాతకాలం నాటిదయినా, మనం గొప్పగా చెప్పుకుంటున్న ఈ ప్రజాస్వామ్యయుగంలో అంతకంటే బలంగా వర్తిస్తున్నది. పాలకులు కక్షకడితే ఎలా ఉంటుందో చెప్పడానికి జుబైర్ అరెస్టు ఓ బలమైన ఉదాహరణ. వారు వద్దనుకుంటే కళ్ళకు ఎదురుగా కనిపిస్తున్న ఉన్మాదాలను, సమాజాన్ని నిలువునా చీల్చే తీవ్రమైన వ్యాఖ్యలను సైతం బేఖాతరు చేయగలరు. కొరడా ఝుళిపించాలని అనుకుంటే నాలుగేళ్ళ నాటి ట్వీట్ ను ఓ మారణాయుధంగా చిత్రీకరించగలరు. జుబైర్ ను భాజపా పెద్దలు జిహాదీ అంటున్నారు. ఈ ట్వీట్ తో మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నాడని అంటున్నవారికి, ఆయన సామాజిక మాధ్యమాల్లో తిమ్మినిబమ్మిని చేస్తూ, అసత్యాలను వండివారుస్తూ మైనారిటీలమీద విషాన్ని చిమ్మే పోస్టుల్లో నిజానిజాలు వెలికితీయడం నచ్చడం లేదు. విద్వేషాలను సృష్టిస్తున్నవారిని వదిలేసి, అటువంటి చర్యలకూ చేష్టలకూ వ్యతిరేకంగా పోరాడుతున్నవారిని వేధించడం విచిత్రం, విషాదం. ఫేక్ న్యూస్ సృష్టికర్తలకు ఆయన తన ఆల్ట్ న్యూస్ వెబ్ సైట్ ద్వారా చేస్తున్న పోరాటం నచ్చకపోవడంలో ఆశ్చర్యమేమీలేదు. మతవిద్వేషాలు రెచ్చగొట్టి సమాజాన్ని చీల్చే ప్రయత్నాలకు ఆయన అడ్డుపడుతున్నాడు. గతకాలం నాటి విడియోలను కత్తిరించి, గుదిగుచ్చి, అతుకులు వేసి, ఉన్మాదపూరితమైన వ్యాఖ్యలు జోడించి దేశం మీదకు వదిలేస్తున్న తరుణంలో వాటిని సాంకేతికంగానూ, నిష్పాక్షికంగానూ విశ్లేషించి సత్యాసత్యాలు తెలియచెప్పే పని ఆయన తన వెబ్ సైట్ ద్వారా చేస్తున్నాడు.


జుబైర్ అరెస్టు దేశంలోని ప్రజాస్వామ్యవాదులను, హక్కులప్రేమికులను, పత్రికాసంఘాలను, మీడియా సంస్థలను మాత్రమే కాదు, మిగతా ప్రపంచాన్ని కూడా నివ్వెరపరచింది. పైగా, పోలీసుల ఈ తరహా అత్యుత్సాహానికి న్యాయస్థానాలు వెంటనే అడ్డుపడకపోగా బాధితులకు బెయిల్ ఇవ్వకుండా సంకెళ్ళు వేయడానికీ, జైలులోకి నెట్టడానికీ వీలుకల్పించడం మరింత ఆశ్చర్యకరం. నాలుగేళ్ళనాటి ఆయన ట్వీట్ ఒకదానిని ఇప్పుడు తవ్వితీసి, అది దేశంలోని హిందువుల మతవిశ్వాసాలను దెబ్బతీసేట్టుగా ఉన్నదంటూ ఒకేఒక్క ఫాలోవర్ ఉన్న ట్విటర్ యూజర్ ఒకరు గోప్యంగా ఓ ఫిర్యాదు చేసి మాయమైపోతే, దానిని ఆయుధంగా ధరించి పోలీసులు విరుచుకుపడినప్పుడు అంతర్జాతీయ సమాజం ముందు మన పరువుపోకుండా ఎలా ఉంటుంది? ఆ ట్వీటు కూడా నలభైయేళ్ళక్రితం నాటి హృషీకేష్ ముఖర్జీ చిత్రంలోని ఓ దృశ్యం ఆధారంగా చేసింది. సెన్సార్ అనుమతితో ఆ చిత్రాన్ని ఈ దేశప్రజలంతా చూశారు. సదరు ట్వీట్ చవుకబారుగా ఉండవచ్చును కానీ, మతచిచ్చురాజేసేంతటి శక్తివంతమైనదైతే కాదు. దానికి అంత హననశక్తే వుంటే ఈ నాలుగేళ్ళలో మతకలహాలు రేగివుండేవి, లేదా ఉన్మాదులకు అందుకు ఆయుధంగానైనా ఉపకరించేది. కానీ, ఇంతకాలం తరువాత అది ఓ మారణాయుధంగా వెలికిరావడం వెనుక జుబైర్ ను వేటాడాలన్న లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. రెండేళ్ళక్రితం ఓ పోస్కో కేసులో ఆయనను మూసివేయడానికి చేసిన ప్రయత్నం నెరవేరకపోవడంతో, ఇప్పుడు ఇలా కక్షతీర్చుకుంటున్నారు. పైగా, మ్యునిచ్ జీ సెవన్ సదస్సులో ప్రధాని నరేంద్రమోదీ వాక్ స్వాతంత్ర్యం గురించి ఉపన్యాసం ఇచ్చి, తన దేశపౌరులకు ఆ స్వేచ్ఛ దక్కేట్టు చేయడానికి కట్టుబాటు కనబరిచిన నాడే ఈ అరెస్టు జరగడం విచిత్రం. అయ్యా, ఇప్పటికే మీ దేశం మీడియా స్వేచ్ఛలో 150వ ర్యాంకులో ఉంది, ఇంకా ఎంత దిగజారిపోతారు? అని  ఐక్యరాజ్యసమితి అధినేత కూడా అందుకే వాపోతున్నాడు.

Updated Date - 2022-07-02T08:53:31+05:30 IST