Tirupathi: Justice పిలిచారు.. వచ్చాను.. చూశాను.. సంతకం పెట్టాం..: Mohanbabu

ABN , First Publish Date - 2022-06-28T17:30:32+05:30 IST

ఎన్నికలకోడ్ ఉల్లంఘన వ్యవహారంలో మోహన్ బాబు కేసు విచారణ సెప్టెంబర్ 20వ తేదీకి వాయిదా పడింది.

Tirupathi: Justice పిలిచారు.. వచ్చాను.. చూశాను.. సంతకం పెట్టాం..: Mohanbabu

తిరుపతి (Tirupathi): ఎన్నికలకోడ్ ఉల్లంఘన వ్యవహారంలో సినీ నటుడు మోహన్ బాబు (Mohanbabu) కేసు విచారణ సెప్టెంబర్ 20వ తేదీకి వాయిదా పడింది. శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మోహన్ బాబు తన కుమారులు మంచు విష్ణు (Vishnu), మనోజ్‌ (Manoj)లతో కలిసి మంగళవారం తిరుపతి కోర్టులో హాజరయ్యారు. తిరుపతి ఎన్టీఆర్ సెంటర్ నుంచి వారు పాదయాత్రగా వెళ్లి కోర్టుకు హాజరయ్యారు. అనంతరం మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ కోర్టు సమన్లు తనకు అందలేదని, అయినా న్యాయాధిపతి రమ్మని పిలిచారని.. ఆయన సమక్షంలో సమన్లపై సంతకం చేశానన్నారు. నిజం చెప్పాలంటే.. ‘పిలిచారు.. వచ్చాను.. చూశాను.. సంతకం పెట్టాము.. బయలుదేరుతున్నాము.’ అందరికి నమస్కారం అంటూ మోహన్ బాబు వ్యాఖ్యానించారు.


పాదయాత్రపై మోహన్ బాబు ఏమన్నారంటే...

‘‘పాదయాత్రగా వచ్చామని ఏ మూర్ఖుడు చెప్పాడు.. కారులో వచ్చి అక్కడ దిగాము.. జనం ఉన్నారు.. మన కోసం వచ్చిన వారిని ప్రేమించాలి.. హ్యాపీగా వాళ్లతో నడిచి వచ్చాము.. కోర్టు లోపలికి వెళ్లాం.’’ అని మోహన్ బాబు మీడియాకు చెప్పారు.


పూర్తి వివరాలు...

టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించలేదని 2019 మార్చి 22వ తేదీన తిరుపతి, మదనపల్లె జాతీయ రహదారిపై మోహన్‌బాబు, మంచు విష్ణు, మనోజ్‌, విద్యానికేతన్‌ విద్యాసంస్థల సిబ్బంది, విద్యార్థులతో కలిసి బైఠాయించి, ధర్నా చేపట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించలేదని అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ సమయంలో సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో అప్పటి చంద్రగిరి ఎంపీడీవో, మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ బృందం అధికారి హేమలత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో మోహన్‌బాబు, ఆయన కుమారులు మంచు విష్ణు, మనోజ్‌కుమార్‌, శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థల ఏవో తులసినాయుడు, పీఆర్వో సతీష్‌లు రోడ్డుపైకి వచ్చి వాహనదారులకు ఇబ్బంది కలిగించారని, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని, ధర్నాకు ముందస్తు పోలీసుల అనుమతి లేదని, 341, 171(ఎఫ్‌), పోలీస్‌ యాక్ట్‌ 290 కింద చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2022-06-28T17:30:32+05:30 IST