స్వాతంత్ర్య సమరంలో ప్రవాసులు

ABN , First Publish Date - 2022-08-10T06:29:07+05:30 IST

విదేశీ గడ్డపై ఉంటూ మాతృభూమి శ్రేయస్సుకై నిరంతరం పాటుపడుతున్నట్లుగా చెప్పుకునే ప్రవాసులు, వారి సంఘాలు నేటి డిజిటల్ కాలంలో కోకొల్లలు.

స్వాతంత్ర్య సమరంలో ప్రవాసులు

విదేశీ గడ్డపై ఉంటూ మాతృభూమి శ్రేయస్సుకై నిరంతరం పాటుపడుతున్నట్లుగా చెప్పుకునే ప్రవాసులు, వారి సంఘాలు నేటి డిజిటల్ కాలంలో కోకొల్లలు. ఒక తెలుగు రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ ప్రమోటర్ల నుంచి డబ్బులు తీసుకుని విదేశాలలో సంఘాలు నడిపే వారు ఇటీవలి కాలంలో అధికమవుతున్నారు! ఈ నేపథ్యంలో భారత స్వాతంత్ర్య సమరంలో అలనాటి ప్రవాసులు తమ వంతుగా నిర్వహించిన పాత్రను ఆ మహోజ్వల పోరాట విజయసిద్ధి అమృత ఉత్సవాల సందర్భంగా స్మరించవల్సి ఉంది.


భారతీయులు 19వ శతాబ్ది నుంచే ఉన్నత విద్యాభ్యాసం నిమిత్తం అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలకు వెళ్లడం ప్రారంభమయింది. వారిలో పలువురు విద్యాధికులై, ఆ దేశాలలో మంచి వృత్తి జీవితాలతో ఆనందప్రదంగా జీవించేందుకు తమకు లభించిన ఆవకాశాలను వదులుకోవడం జరిగింది. మాతృదేశ దాస్య విమోచన కొరకు అని మరి చెప్పనవసరం లేదు. అలనాడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తమకు తోచిన రీతిలో వారు పోరాడారు.


మోహన్‌దాస్ కరంచంద్ గాంధీని ప్రవాస జీవితమే మహాత్ముడుగా తీర్చిదిద్దింది. విభిన్న భావజాలాలను ఔదలదాల్చిన హర్ దయాళ్, జవహర్‌లాల్ నెహ్రూ, వినాయక్ దామోదర్ సావర్కార్, బి.ఆర్.అంబేడ్కర్, మహమ్మద్ అలీ జిన్నా, సుభాష్ చంద్రబోస్ మొదలైన అనేక మంది అలనాడు విదేశాలలో విద్యాబ్యాసం చేసి, మాతృభూమి విముక్తి కొరకు ఉద్యమించి ఆ తర్వాత భారతావనికి తిరిగి వచ్చిన వారే కావడం గమనార్హం.

తమ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎవరైనా వ్యవహరిస్తే వారికి దేశ బహిష్కార శిక్ష విధించడం గల్ఫ్ దేశాలలో ఇప్పటికీ ఒక ఆనవాయితీగా ఉంది. అదే విధంగా ఇరవయో శతాబ్ది పూర్వార్థంలో బ్రిటన్, అమెరికా ఇత్యాది పాశ్చాత్య దేశాలు సైతం ప్రవాస భారతీయులను తమ దేశం నుంచి బహిష్కరించాయి. ఇలా బహిష్కృతులు అయిన వారిలో సావర్కార్, శ్యాంజీ కృష్ణ వర్మ, హర దయాళ్, బర్కతుల్లాలు ప్రముఖులు.


కాంగ్రెస్ అవిర్భావం కంటే దశాబ్దాల ముందుగా లండన్‌లో దాదాబాయి నౌరోజీ ‘ఈస్టిండియా సొసైటీని స్థాపించారు. ఆ తర్వాత ఒక ‘భారతీయ సంఘాన్ని’ ఆయన ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మరికొన్ని సంఘాలు కూడ ఆవిర్భవించాయి. 1905లో నెలకొల్పబడ్డ ఇండియా హోం రూల్ సోసైటీ కూడ వాటిలో ఒకటి. అమెరికా విషయానికి వస్తే, 1913లో ప్రవాసులు, ముఖ్యంగా పంజాబీల నేతృత్వంలో గదర్ పార్టీ అమెరికాలో అవిర్భవించింది. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన దర్శి చెంచయ్య కూడ గదర్ పార్టీ ప్రముఖులలో ఒకరు. ఆ కాలంలో వ్యవసాయ శాస్త్రవేత్తగా పరిశోధనలు చేయడానికి వెళ్ళిన చెంచయ్య అమెరికా గడ్డ పై నుంచి భారత దేశ స్వాతంత్ర్యం కొరకు తాపత్రయపడ్డారు. కర్మాగారాలు, వ్యవసాయ క్షేత్రాలలో పని చేసే నిరక్షరాస్య కార్మికులు మొదలు స్టాన్‌ఫోర్డ్, బర్కెలీ మొదలగు ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలలో విద్యనభ్యసించిన విద్యార్ధులతో పాటు ఆచార్యులు కూడ గదర్ పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ వచ్చారు. బ్రిటన్‌కు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని నమ్ముకున్నారు. గదర్ పార్టీ ఉద్యమం స్వదేశంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయినప్పటికీ అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలలో ఉంటున్న భారతీయులను మాత్రం అమితంగా ప్రభావితం చేసింది. గదర్ పార్టీలో పిన్న వయస్కుడయిన కర్తార్ సింగ్ సర్భా అమెరికాలోని విశ్వవిద్యాలయ చదువును కాదని స్వదేశానికి తిరిగి వచ్చి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరు సల్పగా ఆయన్ను లాహోర్ జైలులో ఉరి తీసారు. ఈ కర్తార్ సింగ్‌ను స్ఫూర్తిగా తీసుకుని అతని ఫోటోను ఎల్లవేళలా తన జేబులో పెట్టి అభిమానించే భగత్ సింగ్ తన పోరాటాన్ని కొనసాగించి అదే లాహోర్ జైలులో మరణ శిక్షకు గురయ్యాడు. జలియన్‌వాలా బాగ్ నరమేధానికి ప్రతీకారంగా జనరల్ డయ్యర్‌ను లండన్‌లో కాల్చి చంపిన ఉదంసింగ్ కూడ గదర్ పార్టీ సభ్యుడే. అమెరికాలోని ఫోర్డ్ కంపెనీలో ఉద్యోగాన్ని వదలుకుని లండన్‌కు చేరుకున్న ఆ వీరుడు అక్కడ జనరల్ డయ్యర్‌ను తుపాకీతో కాల్చి చంపాడు. అలా ఆ దేశభక్తుడు జలియన్‌వాలా బాగ్ కాల్పులకు ప్రతీకారం తీర్చుకున్నాడు.


జర్మనీ విషయానికి వస్తే, ప్రథమ ప్రపంచ సంగ్రామం సందర్భంగా బ్రిటన్ పాలనను వ్యతిరేకించే భారతీయ వీరులకు ఆ యూరోపియన్ దేశం సహజంగా ఒక ఆతిథేయి రాజ్యంగా నిలిచింది. టర్కీలోని ఖలీఫా వ్యవస్ధ రద్దుకు వ్యతిరేకంగా భారత్‌లో మహాత్మా గాంధీ చేపట్టిన ఖిలాఫత్ ఉద్యమం స్వాతంత్ర్య ఉద్యమ మొదటి దశలో కీలక పాత్ర వహించింది. చంపక్ రామన్ పిళ్ళై సహా అనేక మంది యుద్ధ వీరులకు జర్మనీ ఆశ్రయం ఇచ్చింది. రాజా మహేంద్ర ప్రతాప్, బర్కతుల్లాలు తమ తాత్కలిక భారత ప్రభుత్వాన్ని బెర్లిన్‌లో ఏర్పాటు చేశారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో సుభాష్ చంద్రబోస్ జర్మనీ సహాయాన్ని తీసుకున్నారు. అయితే జర్మనీలోని భారతీయులు ఆశించిన మేరకు హిట్లర్ భారత స్వాతంత్ర్య పోరాటానికి మద్దతు ఇవ్వలేదు. ఫ్రాన్స్, స్వీడన్, అస్ట్రియా తదితర యూరోపియన్ దేశాలలోని భారతీయ మేధావులు కూడ తమకు తోచిన విధంగా క్షేత్రస్ధాయిలో భారత స్వాతంత్ర్య పోరాటానికి తోడ్పడ్డారు.


ప్రస్తుతం గల్ఫ్ దేశాలుగా ఉన్న ప్రాంతాలన్నీ కూడ టర్కీ సామ్రాజ్యంలో భాగంగా ఉండేవి. ఆ కాలంలో మక్కా, మదీన పుణ్యక్షేత్రాలకు వచ్చే భారతీయ ముస్లిం యాత్రికులు, ఒక నలుగురు సింధీ వ్యాపారులు మినహా ఇక్కడ భారతీయులు ఎవరూ ఉండేవారు కాదు. గతంలో ప్రశస్త ఘనత కలిగిన ప్రవాస లోకం ఇప్పుడు మాతృదేశ ఉన్నతికి ఆరాటపడడం లేదు. పడకపోగా తమ సంఘం విందు భోజనాలకై స్వదేశంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులపై ఆధారపడే దుస్థితికి చేరుకున్నది.


మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Updated Date - 2022-08-10T06:29:07+05:30 IST