రక్తం చిందించి.. మొక్కులు చెల్లించి..!

ABN , First Publish Date - 2022-08-10T06:56:49+05:30 IST

చాకులు, బ్లేడ్లతో వీపు, ఛాతీపై కొట్టుకుని రక్తం చిందిస్తూ దైవప్రవక్త మహమ్మద్‌ మనవడు ఇమాం హుస్సేన్‌ కుటుంబీకులకు వందలాది షియా ముస్లింలు మొక్కులు చెల్లించుకున్నారు.

రక్తం చిందించి.. మొక్కులు చెల్లించి..!
తిరుపతిలో పీర్లతో ఊరేగింపు

గంగాధరనెల్లూరు/తిరుపతి(కొర్లగుంట), ఆగస్టు 9: చాకులు, బ్లేడ్లతో వీపు, ఛాతీపై కొట్టుకుని రక్తం చిందిస్తూ దైవప్రవక్త మహమ్మద్‌ మనవడు ఇమాం హుస్సేన్‌ కుటుంబీకులకు వందలాది షియా ముస్లింలు  మొక్కులు చెల్లించుకున్నారు. ఇరాన్‌ దేశం ఖరబల్లా ప్రాంతంలో ఇమాం హుస్సేన్‌, ఆయన కుటుంబీకులు, స్నేహితులు కలిపి 72మందిని యజీద్‌ అలీయాస్‌ ఖలీఫా హింసించి ప్రాణాలు తీసిన ఘటనను స్మరించుకుంటూ గంగాధరనెల్లూరు మండలం తూగుండ్రం పంచాయతీ ఆవలకొండలో అజాదారి మాతమ్‌ (రక్తతర్పణం) నిర్వహించారు. మొహరం పదో రోజు సందర్భంగా తమిళనాడు, కర్ణాటక, హైదరాబాద్‌ ప్రాంతాల నుంచీ షియా ముస్లింలు తరలివచ్చారు. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు పిల్లలు, మహిళలు, పురుషులు నల్ల దుస్తులు ధరించి ఇమాం హుస్సేన్‌ త్యాగాలను స్మరించుకుంటూ ఛాతీకి ఇరువైపులా చేతులతో కొట్టుకుంటూ కన్నీటితో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఫకీరుతోట వరకు పీర్లను ఊరేగించారు. తిరుపతిలో ప్రధానంగా మహతి కళాక్షేత్రం వెనుకన పెద్దపీర్లచావడి, గాలివీధి, చింతకాయల వీధి, పెద్దకాపువీధి ప్రాంతాల్లో వున్న మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పెద్దపీర్లచావడి వద్ద మంగళవారం ఉదయం అగ్నిగుండప్రవేశం చేశారు.

Updated Date - 2022-08-10T06:56:49+05:30 IST