త్యాగాల మాసం

ABN , First Publish Date - 2022-08-05T05:30:00+05:30 IST

ఈ సమస్త విశ్వానికీ ఒక కర్త ఉన్నాడు. ఆయనే దానికి ప్రభువు, పాలకుడు, పోషకుడు. సృష్టిలో ఉన్నదంతా ఆయనదే. ఆ సర్వాంతర్యామి చూపిన మార్గంలో పయనిస్తూ, ధర్మ నిర్వహణలో ప్రాణత్యాగం చేసినా...

త్యాగాల మాసం

ఈ సమస్త విశ్వానికీ ఒక కర్త ఉన్నాడు. ఆయనే దానికి ప్రభువు, పాలకుడు, పోషకుడు. సృష్టిలో ఉన్నదంతా ఆయనదే. ఆ సర్వాంతర్యామి చూపిన మార్గంలో పయనిస్తూ, ధర్మ నిర్వహణలో ప్రాణత్యాగం చేసినా... అది మనకు మనం చేసుకున్న మహోపకారమే. అలాంటి త్యాగాన్ని... మహనీయుడైన అంతిమ దైవప్రవక్త మహమ్మద్‌ మనుమడు, హజ్రత్‌ అలీ, బీబీ ఫాతిమాల కుమారుడు అయిన ఇమామ్‌ హుస్సేన్‌... ముహర్రమ్‌ (మొహర్రం)  పదవరోజున చేశారు. దైవ ధర్మ పరిరక్షణ కోసం ప్రాణాలతో సహా సర్వస్వాన్నీ అర్పించారు. 


అల్లాహ్‌ తన భక్తులైన మానవులకు... తాను ప్రసాదించిన ధన, ప్రాణాలను త్యాగం చేయమని, అలా చేసిన ప్రాణత్యాగానికి స్వర్గాన్ని ప్రసాదిస్తాననీ హామీ ఇస్తున్నాడు. ‘‘దైవమార్గంలో ప్రాణాలు కోల్పోయిన వారిని మృతులని పిలవకండి. వారు మరణించినా సజీవులే’’ అని అల్లాహ్‌ స్పష్టం చేశాడు. 


హిజ్రీ శకం ప్రకారం ముహర్రమ్‌ను మొదటి నెలగా పరిగణిస్తారు. చంద్రుడి కళల ఆధారంగా ఈ మాసానికీ, ఈ మాసంలోని పదవ రోజుకూ చాలా ప్రాముఖ్యం ఉంది. ఆ రోజును ‘ఆఘారా’ అంటారు. అఘరా గురించి అనేకమంది మహనీయులు ఎన్నో విషయాలు తెలియజేశారు.


కొందరు ముహర్రమ్‌ మాసాన్ని విషాద మాసంగా పరిగణిస్తూ ఉంటారు. ఇది అపోహ. అంతిమ దివ్య ఖుర్‌ఆన్‌ ఆదేశాలకూ, దైవ ప్రవక్త మహమ్మద్‌ ప్రవచనాలకూ ఇది విరుద్ధం. ఏడాదిలోని పన్నెండు మాసాల్లో అత్యంత పవిత్రమైన మాసంగా రంజాన్‌నూ, పుణ్యప్రదమైన మాసాలుగా జీఖా అద, జిల్‌ హజ్జ, ముహర్రమ్‌, రజబ్‌లను పూర్వులు పేర్కొన్నారు. హజ్రత్‌ ఇబ్రహీమ్‌ కాలం నుంచి వీటిని విశేషమైనవిగా గుర్తిస్తున్నారు. రంజాన్‌ రోజాలు (ఉపవాసాలు) విధిగా నిర్దేశించారు. ఆ తరువాత అంతటి ప్రాధాన్యం ఉన్నవి ముహర్రమ్‌ ఉపవాసాలు. ముహర్రమ్‌ మాసంలోని తొమ్మిది, పది రోజుల్లో కానీ, పది, పదకొండు రోజుల్లో కానీ... రెండు దినాలు ఉపవాసం ఉండాలని దైవ ప్రవక్త ఆదేశించారు. ఈ రోజాల వల్ల ఏడాది కాలంలో చేసిన పాపాలకు క్షమాపణ దొరుకుతుంది. కానీ ఒక రోజు మాత్రమే ఉపవాసం చేయడం నిషిద్ధం.


చరిత్రలో కర్బలా సంఘటన చాలా విషాదకరమైన ఘట్టమే. అయితే విషాద ప్రదర్శనలను దైవ ప్రవక్త నిరసించారు. దీన్ని విషాదభరితమైన, దురదృష్టకరమైన మాసంగా భావించేవారు ఉన్నారు. అలాగే ఈ మాసంలో వివాహాలు నిర్వహించరాదనడం, మహనీయులు స్వర్గస్తులైన రోజును విషాద దినంగా పాటించడం దివ్య ఖుర్‌ఆన్‌ వచనాలకు, దైవ ప్రవక్త ప్రవచనాలకు విరుద్ధమే. దైవ ప్రవక్త వంశానికి చెందినవారిపై జరిగిన దౌర్జన్యాలను, వారు పడిన కష్టాలను మననం చేసుకోవాల్సిన కర్తవ్యాన్ని గుర్తు చేసే రోజు ఇది. ముహర్రమ్‌ను విషాద మాసంగా కాకుండా, త్యాగాల మాసంగా పరిగణించాలి.


(9న ముహర్రమ్‌)

మహమ్మద్‌ వహీదుద్దీన్‌ 

Updated Date - 2022-08-05T05:30:00+05:30 IST