మొక్కుబడి!

ABN , First Publish Date - 2022-06-25T05:24:45+05:30 IST

మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు మాత్రం గడప దాటడం లేదు... అనే నానుడి మనకు తెలిసిందే. సరిగ్గా ఇది సర్కారువారి మాటలకు అతికినట్లు సరిపోతుంది.

మొక్కుబడి!
ఇది బాపట్ల--జమ్ములపాలెం రోడ్డు... ఇక్కడ దాదాపు 7,000 మొక్కలు నాటామని యంత్రాంగం చెబుతోంది. ఒక్క మొక్క ఆనవాలు కూడా కనపడడం లేదు...

నాటడంతో సరి.. వాటిని పట్టించుకున్న నాథుడే లేడు

ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో గత రెండేళ్లలతో అయిదు లక్షలపైనే మొక్కలు

కనీసం వందల్లో కూడా మొక్కలు బతకలేదు..

పంచాయతీలకు బిల్లుల పెండింగ్‌  

ప్రస్తుతం 2,11,000 మొక్కలు నాటాలని లక్ష్యం

 

బాపట్ల, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు మాత్రం గడప దాటడం లేదు... అనే నానుడి మనకు తెలిసిందే. సరిగ్గా ఇది సర్కారువారి మాటలకు అతికినట్లు సరిపోతుంది. గత రెండేళ్ల నుంచి కొన్ని లక్షల మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంది. అవి నాటేటపుడు అధికారులు, పాలకులు పోటీలు పడి ఫొటోలకు ఫోజులిచ్చారు. సంవత్సరం తిరిగేసరికి ఆ మొక్కలు ఎక్కడ నాటారో కనీసం ఆనవాలు కూడా మిగలడం లేదు. మళ్లీ ఇప్పుడు తాజాగా జిల్లావ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం తొలిదశ ఇప్పటికే ముగిసింది. ఈ సంవత్సరం నాటినవి అయినా వృక్షాలుగా ఎదిగితే రాబోయే తరాలకు కొంతమేర పర్యావరణ భరోసా దక్కినట్లే.


కనీసం ఆనవాళ్లు లేవు..

గత రెండేళ్లలో నాటిన మొక్కల ప్రస్తుత పరిస్థితిపై ఆంధ్రజ్యోతి క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. కొన్ని చోట్ల ఎండిపోయి దర్శనమిస్తే నాటిన చోటు వెతకడానికి కూడా మరి కొన్నిచోట్ల కష్టపడాల్సి వచ్చింది. కనీసం వాటి ఆనవాళ్లు కూడా కనిపించకుండా పోయాయి.  కేవలం అక్కడక్కడ మాత్రమే ప్రాణంతో మొక్కలు కనపడ్డాయి 


ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో..

గత రెండేళ్లలో  ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలో దాదాపు ఐదు లక్షలకు పైగా మొక్కలను ప్రభుత్వం నాటించింది. ఆయా రహదారుల వెంబడి పంచాయతీల ఆధ్వర్యంలో గ్రామీణ ఉపాధిహామీ పథకం నిధులతో వీటిని పెద్ద ఎత్తున నాటించారు. దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేర ఈ కార్యక్రమాన్ని అప్పట్లో చేపట్టారు. 2020-21లో పంచాయతీలకు పాలకవర్గాలకు లేకపోవడంతో ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో ఇవి కొనసాగాయి. గతేడాది పంచాయతీలకు సర్పంచ్‌లు ఎన్నికవడంతో వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది.


బిల్లులు అందక లబోదిబో..

రెవెన్యూ ప్లాంటేషన్‌కు సంబంధించి గత రెండు సంవత్సరాలనుంచి బిల్లులు కూడా పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. బిల్లులు సకాలంలో అందించకుండా వాటిపోషణ,సంరక్షణ అంటే తమకు ఇబ్బందిగా మారుతుందని సర్పంచ్‌ల ఆవేదన. అధికారులు ఇటు ప్రభుత్వానికి చెప్పలేక అటు గ్రామస్థాయిలో పాలకుల దగ్గర నుంచి సహకారం కొరవడడంతో నలిగిపోతున్నారు.


ప్రజల భాగస్వామ్యమే కీలకం..

కీలకమయిన పచ్చదనం లాంటి కార్యక్రమాలు విజయవంతం కావాలంటే పాలకులకు చిత్తశుద్ధితో పాటు ప్రజలకు అవగాహన కల్పించి వారిని స్వచ్ఛందంగా భాగస్వాములను చేస్తే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశముంది. ఒకటికి రెండుసార్లు మొక్కలు పెంచడం వల్ల ఉండే ఉపయోగాలను గ్రామీణులకు అర్థమయ్యే విధంగా చెప్పగలగడంతోపాటు కళాశాలలకు ప్రతి ఏడాది ఇన్ని రోజుల పాటు విద్యార్థులతో తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా ఆదేశాలు జారీ చేస్తే కొంతమేర మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశముంటుంది.


గతానికి భిన్నంగా జిల్లాలో..

రెండేళ్లతో పోలిస్తే కొత్త జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమం కొంత భిన్నంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ నాటిన మొక్కలను బతికించే విషయంలో ప్రత్యేక యాక్షన్‌ప్లాన్‌ను సిద్ధం చేశారు. ఈ కార్యక్రమం సహజంగా ఆగష్టులో మొదలవుతుంది. కానీ ప్రత్యేకంగా ఈ జిల్లాలో మాత్రమే ఈ నెలలో మొదలయింది. ఇప్పటికే దాదాపు 1,11,000 మొక్కలను నాటారు. ఇంకో లక్ష మొక్కలను ఆగష్టులో నాటడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నాటిన ప్రతి మొక్క బతికి తీరాల్సిందేనని కలెక్టర్‌ విస్పష్టమైన ఆదేశాలిచ్చారు. పూర్తి స్థాయిలోవర్షాలు పడేదాకా వాటికి నీటి విషయంలో గానీ,  గార్డ్సు ఏర్పాటు చేసి సంరక్షణ చేపట్టడంలో గాని అలసత్వం వహించిన అధికారులపై చర్యలుంటాయని కూడా హెచ్చరించారు. ప్రతి రెండు కిలోమీటర్ల మేర మొక్కల సంరక్షణ బాధ్యతలను చేపట్టడానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు.  


 

Updated Date - 2022-06-25T05:24:45+05:30 IST