పెద్దాస్పత్రిలో పీక్కుతింటున్నారు

ABN , First Publish Date - 2021-05-11T04:59:41+05:30 IST

పెద్దాస్పత్రిలో..

పెద్దాస్పత్రిలో పీక్కుతింటున్నారు

కేజీహెచ్‌లో వార్డు బాయ్‌ల దందా
సాధారణ రోగులను అంబులెన్స్‌ నుంచి దించాలంటే రూ.500 నుంచి రూ.1000
క్యాజువాల్టీ నుంచి వార్డుకు తరలించేందుకు మరో రూ.500
అంబులెన్స్‌లో తరలించాల్సి వస్తే..రూ.వేయి నుంచి రూ.రెండు వేలు
వార్డుల్లో బెడ్‌షీట్‌ కావాలంటే వంద నుంచి రెండొందలు
కోలుకుంటే..రూ.500
దురదృష్టవశాత్తూ చనిపోతే బాడీని అంబులెన్స్‌లోకి ఎక్కించాలంటే రూ.ఐదు వేలు పైమాటే!
అదే...కొవిడ్‌ రోగులైతే మరిన్ని పాట్లు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): ‘ఆస్తమాతో మా నాన్న తీవ్రంగా ఇబ్బంది పడుతుండడంతో ఆస్పత్రిలో చేర్పించేందుకు నగరమంతా తిరిగినా ప్రయోజనం లేకపోయింది. ఎక్కడా పడకలు అందుబాటులో లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కేజీహెచ్‌లో చేర్పించా. ఆస్పత్రిలో ప్రవేశించినప్పటి నుంచి వార్డు బాయ్‌లకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. అంబులెన్స్‌ నుంచి దించాలన్నా, వైద్యుడు చూసిన తరువాత వార్డుకు తరలించాలన్నా...కూడా డబ్బులు వసూలుచేశారు. వార్డు బాయ్‌లకే దాదాపు ఎనిమిది వేల రూపాయల వరకూ చెల్లించాను. ఆస్పత్రికి వెళ్లే నిరుపేదల పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు’

...ఇదీ మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన జగదీశ్వరరావు ఆవేదన.


ఉత్తరాంధ్ర పెద్దాస్పత్రిలో వార్డు బాయ్‌లు చెలరేగిపోతున్నారు. ఆస్పత్రికి వచ్చే వారిని జలగల్లా పట్టుకుని పీడిస్తున్నారు. వారికి డబ్బు ముట్టజెప్పనిదే ఆస్పత్రిలో ఏ పనీ జరగడం లేదు. కరోనా వైరస్‌ విజృంభణ తరువాత పలువురు...సాధారణ వైద్యం కోసం అత్యవసర పరిస్థితుల్లో కేజీహెచ్‌లోని క్యాజువాల్టీకి వస్తున్నారు. ఇదే అదనుగా వార్డు బాయ్‌లు దోచుకుంటున్నారు. క్యాజువాల్టీలో సదరు రోగిని వైద్యుడు చూడాలన్నా, వైద్యుడు చూసిన తరువాత వార్డుకు తరలించాలన్నా వార్డు బాయ్‌లకు డబ్బులు ముట్టజెప్పాల్సి వస్తోంది. అదీ, ఎంతో కొంత అంటే..కాదు. వాళ్లు చెప్పిన మొత్తం ఇస్తేనే..స్ట్రెచర్‌ కదులుతుంది. కాదూ..కూడదు అంటే..రోగిని బంధువులే మోసుకుంటూ వార్డుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. వార్డు బాయ్‌ల ఆగడాలు అక్కడి అధికారులు, వైద్యులకు తెలిసినా...ఏమీ అనడం లేదని పలువురు రోగులు, వారి బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


వైద్యానికయ్యే ఖర్చుతో సమానంగా మామూళ్లు..

సాధారణ రోజుల్లో ఒక కార్పొరేట్‌/ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యానికి అయ్యేంత ఖర్చు ప్రస్తుతం కేజీహెచ్‌లోని వార్డు బాయ్‌లకు మామూళ్లుగా చెల్లించాల్సి వస్తోందని రోగుల బంధువులు వాపోతున్నారు. క్యాజువాల్టీకి అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగిని (నాన్‌ కొవిడ్‌) అంబులెన్స్‌/వాహనంలో నుంచి దించాలంటే రూ.500 నుంచి రూ.1000 చెల్లించాల్సి వస్తోంది. అక్కడ వైద్యులు చూసిన తరువాత క్యాజువాల్టీ నుంచి దగ్గరలోని వార్డుకు తరలించాలంటే మరో రూ.500 చెల్లించుకోవాల్సిందే. స్ట్రెచర్‌ లేదా వీల్‌చైర్‌లో రోగిని తరలించాల్సి వస్తే..దీనికి కొందరు అదనపు మొత్తాలను వసూలు చేస్తున్నారు. అదే అంబులెన్స్‌లో తరలించాల్సి వస్తే.. రూ.వేయి నుంచి రూ.రెండు వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇక, వార్డుల్లో చేరిన రోగికి  బెడ్‌షీట్‌ కావాలన్నా, ఇంకో బెడ్‌ మీదకు మార్చాలన్నా..మళ్లీ అక్కడ వంద నుంచి రెండొందలు చెల్లించాల్సిందే. అదృష్టవశాత్తూ రోగి కోలుకుంటే..సంతోషంతో రూ.500 ఇవ్వండి అంటూ అడుగుతారు.


మరణిస్తే..నరకమే..

దురదృష్టవశాత్తూ రోగి మరణిస్తే...మాత్రం కుటుంబ సభ్యులు నరకం చూస్తున్నారు. మృతదేహం ఇవ్వడానికి వార్డు బాయ్‌లు నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సాధారణ మరణమైనా బాడీని అంబులెన్స్‌లో ఎక్కించేందుకు ఎవరూ ముందుకురారు. కనీసం రూ.5 వేల నుంచి రూ.7 వేల రూపాయలు ఇస్తేనేగానీ అంబులెన్స్‌లోకి ఎక్కించరు. పైగా వాళ్లు చెప్పిన అంబులెన్స్‌లోనే మృతదేహాన్ని తరలించాలి. ఇందుకు ముందుగానే రేటు ఫిక్స్‌ చేస్తున్నారు. ఐదు కిలో మీటర్లులోపు అయితే రూ.ఐదు వేల నుంచి రూ.ఎనిమిది వేలు వరకు వసూలు చేస్తున్నారు. ఐదు కిలోమీటర్లు దాటితే రూ.పది నుంచి రూ. పదిహేను వేలు చెల్లించాలి. 


కొవిడ్‌తో అయితే కష్టమే..

ఇక, కొవిడ్‌ బారినపడి ఆస్పత్రుల్లో చేరుతున్న వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. పొరపాటున క్యాజువాల్టీలో కరోనా అని నిర్ధారణ అయితే..వారిని కొవిడ్‌ వార్డుల్లోకి తరలించేందుకు భారీ మొత్తంలో వసూలు చేస్తున్నారు. రూ.మూడు నుంచి రూ.ఐదు వేల వరకు ఇస్తేగానీ కొవిడ్‌ వార్డులకు తరలించడం లేదు.

Updated Date - 2021-05-11T04:59:41+05:30 IST